Senior Citizen Taxpayers: మన దేశంలో, ఆదాయ పన్ను చెల్లించే సీనియర్ సిటిజన్ల (60 సంవత్సరాల వయస్సు పైబడిన వాళ్లు) సంఖ్య విపరీతంగా పెరిగింది. వాళ్ల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయపు పన్ను రాబడిలోనూ భారీ పెరుగుదల కనిపిస్తోంది. 


కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఆదాయ పన్ను చెల్లించే సీనియర్ సిటిజన్ల సంఖ్య గత 4 సంవత్సరాల్లో 18.55 శాతం పెరిగింది. అంతేకాదు, వాళ్ల ఆదాయ పన్ను చెల్లింపులు ఈ నాలుగేళ్లలోనే 61 శాతం పెరిగాయి. 


4 సంవత్సరాల్లో 61 శాతం పెరిగిన పన్ను చెల్లింపులు
దేశంలో ఎంతమంది సీనియర్ సిటిజన్లు ఆదాయ పన్ను చెల్లిస్తున్నారని, వారి నుంచి ప్రభుత్వానికి ఎంత పన్ను ఆదాయం వస్తోందని లోక్‌సభ సభ్యుడు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధ్రి ఆ ప్రశ్నకు సమాధానం చెప్పారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 73,14,324 మంది సీనియర్‌ సిటిజన్లు పన్ను చెల్లింపుదార్ల రూపంలో రూ. 70,262 కోట్ల ఆదాయ పన్ను చెల్లించారని లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. 2020-21లో 75,73,353 మంది రూ. 79,806 కోట్లు; 2021-22లో 81,30,798 మంది రూ. 83,756 కోట్ల ఆదాయ పన్ను చెల్లించినట్లు పేర్కొన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 2023 ఫిబ్రవరి 28వ తేదీ వరకు, 86,71,564 మంది సీనియర్ సిటిజన్ పన్ను చెల్లింపుదార్లు రూ. 1,13,458 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించారు. గత 4 సంవత్సరాల్లో, ఆదాయపు పన్ను చెల్లించిన సీనియర్ సిటిజన్ల సంఖ్య 18.55 శాతం పెరిగింది, పన్ను చెల్లింపులు 61 శాతం పెరిగాయని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.


పన్ను మినహాయింపు ప్రతిపాదన లేదు!
పెన్షనర్లు సహా సీనియర్ సిటిజన్లను ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందా? అన్న ప్రశ్నపై కూడా ఆర్థిక శాఖ సహాయ మంత్రి స్పందించారు. ప్రభుత్వం వద్ద అలాంటి ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని పంకజ్ చౌధ్రి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పెన్షనర్లు, సీనియర్ సిటిజన్లకు ఆదాయపు పన్నులో అనేక రకాల మినహాయింపులు కల్పిస్తోందని వెల్లడించారు.


1. సీనియర్ సిటిజన్లకు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌ 80D కింద ఆరోగ్య బీమా లేదా వైద్య ఖర్చులపై పన్ను మినహాయింపు పొందే పరిమితిని రూ. 30,000 నుంచి రూ. 50,000 కి పెంచినట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి తెలిపారు.


2. సెక్షన్‌ 80DDB కింద, 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్‌ల తీవ్రమైన అనారోగ్యం చికిత్స కోసం చేసే ఖర్చులపై పన్ను మినహాయింపు పరిమితిని రూ. 60,000 నుంచి రూ. 80,000కి పెంచాం. తద్వారా, వైద్య ఖర్చులపై పన్ను మినహాయింపు పొందే పరిమితిని సీనియర్‌ సిటిజన్ల కోసం రూ. 1.10 లక్షలకు పెంచడం జరిగింది.


3. బ్యాంకులు, సహకార సంఘాలు, పోస్టాఫీసుల్లో సీనియర్‌ సిటిజన్ల డిపాజిట్ల మీద వచ్చే వడ్డీ ఆదాయంపై రూ. 50,000 వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. దీనికి అనుగుణంగా సీనియర్ సిటిజన్లకు వడ్డీ ఆదాయంపై TDS పరిమితిని రూ. 10,000 నుంచి రూ. 50,000కి పెంచారు. ఇది కాకుండా, సూపర్‌ సీనియర్ సిటిజన్ (75 ఏళ్లు పైబడిన వాళ్లు) పన్ను చెల్లింపుదార్లు ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయాల్సిన అవసరం లేదు.