Telangana BJP : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయాన్ని టార్గెట్‌గా పెట్టుకున్న బీజేపీ.. అదే సమయంలో తెలంగాణలోను సమాంతరంగా ప్రచారం చేయాలని నిర్ణయింుకుంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు ప్రతీ నెలా ఒక అగ్రనేత తెలంగాణలో పర్యటించేలా భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ప్రధాని నరేంద్రమోడీ, హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారా మన్, పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా తో సహా ముఖ్యనేతలంతా రాష్ట్రంలో తిరిగేలా వ్యూహం రచిస్తోంది.కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసి ఫలితాల ప్రకటన తర్వాత కేంద్ర మంత్రులు, ముఖ్య నేతలు,భాజపా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు తెలంగాణాలో మకాం వేసి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో తిరిగి ప్రచారం నిర్వహించేలా ప్లాన్ రెడీ చేసుకున్నారు.
వరుసగా తెలంగాణ పర్యటనకు మోదీ, అమిత్ షా !
ఈ నెల 8 న ప్రధాని మోడీ తెలంగాణ వస్తున్నారు. ఆధునీకరించిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రారంభం, సికింద్రాబాద్-తిరుపతి నడుమ ప్రవేశపెడుతున్న వందే భారత్ ఎక్సప్రెస్ రైలు ఇతర అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు,శంఖు స్థాపనలు చేస్తారు. సికింద్రాబాద్ పెరేడ్ మైదానంలో జరిగే బహిరంగసభలో అయన ప్రసంగిస్తారు.అసెంబ్లీ ఎన్నికలు,భవిష్యత్ ప్రణాళికలపై ప్రధాని రాష్ట్ర నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు.హైదరాబాద్ పర్యటన ముగించుకుని తిరిగి ఢిల్లీ వెళ్లే ముందు బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలతో సమావేశం అవుతారు.
మే నెలలో అమిత్ షా పర్యటిస్తారని భాజపా రాష్ట్ర నాయకులు చెబుతున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణకు పొరుగున ఉన్న రాయచూర్, బీదర్, గుల్బార్గా, సింధనూర్, కొప్పోల్ వస్తారని పనిలో పనిగా తెలంగాణలోనూ పర్యటించేలా కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు.
చేరికల సంగతి పక్కన పెట్టి కేంద్ర మంత్రుల ప్రచారాలకు ప్రాధాన్యత
వచ్చే నెలలోనే పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల వేడి మొదలయ్యాక కేంద్రమంత్రులు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు ప్రచారం నిర్వహించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా ఒక్కో కేంద్ర మంత్రికి ఒక్కో జిల్లా ప్రచార బాధ్యతలను కట్టబెట్టేలా వ్యూహం రచిస్తున్నట్టు- సమాచారం. ముక్యంగా హైదరాబాద్ సికింద్రాబాద్ జంటనగరాలు జీహెచ్‌ఎం సి ప్రాంతాల్లో అగ్రనేతలను పెద్ద ఎత్తున మోహరించేందుకు సిద్ధమవుతోంది. భాగ్యనగరం లో 13 రాష్ట్రాలకు చెందిన ఓటర్లు ఉండడంతో ఆయా రాష్ట్రాల మంత్రులు ముఖ్య నేతలను ఇక్కడికి రప్పించి ఆత్మీయ సమావేశాలను నిర్వహించాలన్న ఆలోచనతో పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, పశ్చిమ బంగా, పంజాబ్, బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారు ఎప్పుడో ఇక్కడికి వచ్చి స్థిరనివాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. వారి ఓట్ల కోసం ప్రత్యేక వ్యూహంతో రంగంలోకి దిగనున్నారు.
కర్ణాటకలో గెలిస్తే అడ్వాంటేజ్ అవుతుందన్న ధీమా!
పొరుగు రాష్ట్రం కర్ణాటకలో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంటే తెలంగాణలోనూ ప్లస్ అవుతుంది. అందుకే సమాంతరంగా కర్ణాటకతో పాటు తెలంగాణలోనూ ప్రచారం చేస్తూ.. ఆ టెంపోను కొనసాగించాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవలి కాలంలో బీజేపీ అగ్రనాయకత్వం తెలంగాణపై పెద్దగా దృష్టి పెట్టడం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. కానీ ఇక నుంచి మాత్రం ... తెలంగాణలో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నట్లుగా చెబుతున్నారు.