జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీ అధినాయకత్వంతో భేటీ కానున్నారు. హోంమంత్రి అమిత్‌షాతోపాటు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కూడా సమావేశం కానున్నారు. ఉదయపూర్‌లో జరిగిన ఓ ఫంక్షన్‌కు వెళ్లిన పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగానే ఆయనతో బీజేపీ నాయకత్వం ప్రత్యేకంగా భేటీ కానున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
దక్షిణాదిలో పాగా వేయాలని ఎప్పటి నుంచో బీజేపీ చాలా గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే తొలిసారిగా కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది. దాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది బీజేపీ. అక్కడి ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలన్న టార్గెట్‌తో వ్యూహాలను రచిస్తోంది బీజేపి.
కర్ణాటక ఎన్నికల్లో విజయం కోసం ఉన్న అవకాశాలన్నింటినీ వాడుకోవాలని చూస్తోంది భారతీయ జనతాపార్టీ. అందులో భాగంగానే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ని కూడా ప్రచారంలోకి దించాలని భావిస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో జనసేన, బీజేపీ పొత్తులో ఉన్నాయి. ఈ స్నేహంతోనే కర్ణాటకలో ప్రచారం చేయాలని రిక్వస్ట్ చేసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఆయన్ని ఢిల్లీకి పిలిపించి మాట్లాడబోతున్నట్టు సమాచారం.
ఉత్తర కర్ణాటకలో చాలా వరకూ తెలుగు ప్రాబల్యమే ఎక్కువ. బళ్లారి దగ్గర మొదలుపెట్టి రాయచూరు, సింధనూరు, గంగావతి, దవణగిరి, గుల్బర్గ, బీదర్ వరకూ అయితే ఆంధ్రా, లేదంటే తెలంగాణ సెటిలర్స్ ది కీలక వర్గం. మరి ఆ తెలుగు ఓట్లను ప్రభావితం చేసేలా స్టార్ క్యాంపెయినర్ గా పవన్ ఉపయోగపడతారు అనేది బీజేపీ భావన. అందుకే ఆయన్ని స్టార్ క్యాంపెయినర్‌గా దించాలని బీజేపీ ప్లాన్.
2014 జనరల్ ఎలక్షన్స్ టైమ్‌లో జనసేన, టీడీపీ, బీజేపీ అలయన్స్‌లో ఉన్నాయి. అప్పుడు ప్రధాని మోదీ ఆదేశాల మేరకు పవన్ కల్యాణ్ కర్ణాటక ఎన్నికల్లో ప్రచారాన్ని నిర్వహించారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు ప్రభావితమయ్యేలా ఉద్వేగభరిత ప్రసంగాలను చేసి ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి మేలు చేశారు. 2019 ఎలక్షన్స్ టైమ్ నాటికి బీజేపీ, టీడీపీల దోస్తానాకు కట్ చెప్పిన పవన్ కల్యాణ్, వామపక్షాలు బీఎస్పీతో కలిసి ఏపీ ఎన్నికల్లో బరిలోకి దిగారు. అంతకు ఏడాది ముందు జరిగిన కర్ణాటక ఎన్నికల్లోనూ ప్రచారానికి వెళ్లకుండా వ్యూహాత్మకంగా సైలెంట్ అయిపోయారు పవన్ కల్యాణ్.
ఈ మధ్యే కర్ణాటక ఎలక్షన్స్ షెడ్యూల్ వచ్చింది. 224 అసెంబ్లీ స్థానాలకుగానూ మే 10న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ABP C Voter Opinion Poll వెల్లడించింది. దాదాపు అన్ని కీలకప్రాంతాల్లో ఈ పార్టీకే మెజార్టీ దక్కుతుందని తెలిపింది. సీట్ల పరంగా చూస్తే...గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 80 సీట్లు వచ్చాయి. బీజేపీ 104 చోట్ల విజయం సాధించింది. జేడీఎస్ 37 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్, జేడీఎస్ కలిసి అప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. ఆ తరవాత బీజేపీ చేతుల్లోకి అధికారం మారిపోయింది. అయితే...ప్రస్తుత అంచనాల ప్రకారం చూస్తే...కాంగ్రెస్‌కు 121 సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. బీజేపీకి 74,JDSకి 29 సీట్లు దక్కనున్నట్టు ఈ సర్వేలో తేలింది. మొత్తంగా చూస్తే...కాంగ్రెస్‌కు 115 నుంచి 127 సీట్లు, బీజేపీకి 68 నుంచి 80,JDSకి 23 నుంచి 35 సీట్లు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.