CM Jagan Meeting: నేడు (ఏప్రిల్ 3) ఎమ్మెల్యేలతో సీఎం జగన్ సమావేశం నిర్వహిస్తున్నారు. తాజా రాజకీయ పరిస్థితులు, గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని తీరుపై చర్చించటంతో పాటు, ఈ కార్యక్రమంలో అంతగా రెస్పాండ్ అవ్వని ఎమ్మెల్యేలు, కొంతమందికి ముఖ్యమంత్రి జగన్ క్లాస్ తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం ఉంది. అంతే కాదు మంత్రి వర్గ మార్పులుపై కూడా చర్చించనున్నారు. వచ్చే వారం నుంచి జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం ప్రారంభించే అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు.
ఎమ్మెల్యేలు కేటగిరీలుగా
పార్టీలోని శాసనసభ్యులను నాలుగు వర్గాలుగా విభించి వారిని ఆయా వర్గాల వారీగా ట్రీట్ చేయాలని సీఎం జగన్ భావిస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది. ఇందులో మొదటి కేటగిరి, సీట్ ఇస్తే గెలిచేవారు. రెండో ది సీట్ ఇస్తే ఓడిపోయేవాళ్లు, మూడోది సీట్ ఇవ్వకపోతే వేరే పార్టీలో చేరేవారు...నాలుగోది పార్టీ లోనే ఉండి నష్టం కలిగించేవారు. ఇలా నాలుగు రకాలుగా ఎమ్మెల్యేల విభజన చేపట్టి వారిని ఆయా పరిస్థితులకు అనుగుణంగా పనిచేయించుకోవటం, లేదంటే ఎన్నికల సమయంలో పూర్తిగా పక్కన పెట్టటం వంటి పరిస్థితులపై జగన్ ఈ సమావేశంలో శాసనసభ్యులకు ప్రత్యక్షంగా పరోక్షంగా స్పష్టం చేయనున్నారని అంటున్నారు. తాజా సర్వేల ఆధారంగా ఎమ్మెల్యేలపై అంచనా చేసినట్లుగా చెబుతున్నారు. అందులో 45 మంది ఎమ్మెల్యేలపై జగన్ మోహన్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారని కూడా పార్టీలోని నాయకులు అంటున్నారు.
సిట్టింగ్ లలో మార్పులు
ఈ సమావేశం తరువాత కొందరు సీనియర్ ఎమ్మెల్యేలకు సంబంధించిన సిట్టింగ్ స్థానాలపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వారి స్థానాల మార్పునకు జగన్ నిర్ణయించారని అంటున్నారు. ఇందులో భాగంగా సీట్ మార్పు శాసనసభ్యులకు జూన్ వరకు కొంత టైం ఇచ్చే అవకాశం కూడా లేకపోలుదని చెబుతున్నారు. ఇప్పటి వరకు ఉన్న సర్వేల ఆధారంగా సమాచారం తెప్పించుకున్న జగన్ 30 మంది ఎమ్మెల్యేకు తిరిగి టిక్కెట్ ఇచ్చే విషయంలో డౌట్ గా ఉన్నారని పార్టీ వర్గాలు అంటున్నారు.
ఏప్రిల్ లో ముహూర్తం ఫిక్స్
ఏప్రిల్ లో జరిగే సమావేశం ద్వారా నేతల పనితీరుపై ఒక నిర్ణయానికి వస్తానని గతంలోనే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. దీంతో ఈసారి సమావేశంలో ఎవరి భవిష్యత్ ఏంటనే దానిపై సీఎం ఓ క్లారిటీ ఇచ్చేస్తారంటున్నారు పార్టీ నేతలు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంతో పాటు సచివాలయ కన్వీనర్లు, గృహసారథుల పనితీరు పైనా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉందంటున్నారు పార్టీ నేతలు.
దిల్లీ పర్యటన తరువాత సీఎం దూకుడు
సీఎం జగన్ దిల్లీ టూర్ తో కేబినెట్ లో మార్పులు తప్పవనే ప్రచారం తెర మీదకు వచ్చింది. అదే సమయంలో శాసనసభ్యులతో సమావేశంలో జగన్ దూకుడుగా నిర్ణయాలు ప్రకటించనున్నారు. ఇటీవల కాలంలో జగన్ గవర్నర్ తో సమావేశం ఆ తరువాత వరుసగా రెండు సార్లు దిల్లీ పర్యటన తరువాత పరిస్థితుల్లో మార్పులు స్పష్టంగా ఉన్నాయని పార్టీ వర్గాలు అంటున్నాయి. మొదటి కేబినెట్ లో పనిచేసిన ఇద్దరికి తిరిగి అవకాశం ఇవ్వటంతో పాటుగా, కొత్తగా కొంతమందికి మంత్రి వర్గంలో చోటు ఇవ్వొచ్చని చర్చ జరుగుతుంది.