2024 ఎన్నికల మెగా బ్యాటిల్‌కు ప్రజల మద్దతును పొందేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ‘మాస్ ఇంటరాక్షన్ స్ట్రాటజీ’ని రచించారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి ఒక్కరికీ ఉమ్మడి సందేశాన్ని చేరవేసేందుకు ‘జగనన్నే మా భవిష్యత్తు’  పేరుతో పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. 


ఎన్నికలకు ఏడాది ముందు నుంచే ఎన్నికల ప్రచారానికి వైఎస్ఆర్సీపీ సమరశంఖం పూరించబోతోంది. ‘జగనన్నే మా భవిష్యత్తు’ పేరుతో ఇప్పటివరకు కనీవినీ ఎరగని రీతిలో సరికొత్త ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతోంది. మొదటి దశ ఏప్రిల్ 7 నుంచి 20వరకు అంటే రెండు వారాల పాటు ఈ క్యాంపెయిన్ కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ లోని ఇంటింటికి ఈ ప్రచారాన్ని తీసుకెళ్లేందుకు ప్రణాళిక రూపొందించినట్టు తెలుస్తోంది. 


వైఎస్ఆర్సీపీ వర్గాలు అందిస్తున్న సమాచారం ప్రకారం రెండువారాల పాటు అంటే ఏప్రిల్ 7-14వరకు  ‘జగనన్నే మా భవిష్యత్తు’  క్యాంపెయిన్ స్టార్ట్ అవుతుంది. కొత్తగా నియమితులైన జగనన్న సచివాలయం కన్వీనర్లు, గృహ సారథిలు ఇందులో ప్రధానంగా పాల్గొంటారు. దాదాపు 7లక్షల మంది జగనన్న సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులతో కలిసి ఆంధ్రప్రదేశ్ లోని 1.65 కోట్ల ఇళ్లకు వెళ్లి ఈ ప్రచారం నిర్వహించనున్నట్లు వైఎస్సార్‌సీపీ నేతలు తెలిపారు.






రాజకీయ వర్గాల్లో ప్రతిధ్వనించేలా వైఎస్‌ఆర్‌సీపీ క్యాడర్ ఏకగ్రీవంగా సందేశాన్ని ప్రసారం చేస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ అట్టడుగు వర్గాలకు రెండు కీలక సందేశాలను పంచుతుందని నాయకులు వివరించారు. ఇంటింటికీ ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్సీపీ బృందాలు కరపత్రాలు, పుస్తకాలు, స్టిక్కర్లు పంపిణీ చేస్తారు. "గతంలో ఏం చేశారు ఇప్పుడేం చేస్తున్నారని కరపత్రంలో ముద్రించి అందిస్తారు. 2019లో జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన తరువాత చేసిన అభివృద్ధి-సంక్షేమ పనులు, చంద్రబాబునాయుడు హయాంలో చేసిన పనులను పోలుస్తూ తయారు చేసిన పాంప్లెట్లను ఇంటింటికి పంచుతారు. 


‘ప్రజా మద్దతు పుస్తకం’ కింద ప్రశ్నాపత్రాన్ని పూరించి, నివాసితులకు రసీదు ఇస్తారు. 'డోర్, మొబైల్ స్టిక్కర్లను అందిస్తారు. కుటుంబ యజమాని అనుమతితో ఫోన్, డోర్‌పై అతికిస్తారు. ‘మిస్డ్ కాల్’ కార్యక్రమం కింద, జగనన్న పాలనకు తమ మద్దతును తెలియజేయడానికి 8296082960 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలని వారు ఇంటింటా అభ్యర్థిస్తారు.  ఈ వినూత్న ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ నేరుగా ప్రజలతో మమేకం కావడానికి సహాయపడుతుందని వైఎస్ఆర్సీపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.