Monkeypox Alert: మంకీపాక్స్‌ వేగంగా వ్యాపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వైరస్‌ ప్రబలుతోంది. పొరుగుదేశాల్లోనూ కేసులు నమోదవడంతో... కేంద్రం మరింత అప్రమత్తమైంది. దాయాది దేశం పాకిస్తాన్‌లో నాలుగు కేసులు నమోదయ్యాయి. అంతేకాదు..  పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే)లోనూ ఒక ఎంపాక్స్‌ కేసు వెలుగుచూసింది. సౌదీ నుంచి పీఓకే (POK)కి వచ్చిన ఒక వ్యక్తిలో మంకీపాక్స్‌ లక్షణాలు కనిపించాయి. దీంతో.. కేంద్రం హైలర్ట్‌ ప్రకటించింది. ఎయిర్‌పోర్టులు, దేశ సరిహద్దుల్లో ముమ్మర  తనిఖీలు చేపడుతోంది. మంకీపాక్స్‌ లక్షణాలతో వచ్చే ప్రయాణికుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. దేశంలో ఎంపాక్స్‌ కేసులు బయటపడితే.. చికిత్స కోసం మూడు ఆస్పత్రులను నోడల్‌ వైద్య కేంద్రాలుగా ప్రకటించారు. వాటిలో  ఢిల్లీలోని రామ్‌మనోహర్‌ లోహియా ఆస్పత్రి ఒకటి. రెండోది సఫ్దార్‌గంజ్‌ ఆస్పత్రి, మూడోది లేడీ హార్డింగ్‌ హాస్పిటల్‌. ఈ ఆస్పత్రుల్లో.. మంకీపాక్స్‌కు చికిత్స అందించనున్నారు. అందు కోసం ఐసోలేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రాల్లోనూ  నోడల్‌ కేంద్రాలను గుర్తించి... ఎంపాక్స్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్రం సూచించింది. 


దేశంలో ఎంపాక్స్‌ విజృంభిస్తుందా..?
భారత్‌ దేశంలో గతంలో ఎంపాక్స్‌ కేసులు నమోదయ్యాయి. అయితే... ప్రపంచవ్యాప్తంగా వైరస్‌ ప్రబలుతున్న ఈ దశలో కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. గత ఏడాది జులై నాటికి.. దేశంలో 27 మంకీపాక్స్‌ కేసులు ఉన్నాయని...  పార్లమెంట్‌లో నాటి కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి సింగ్‌ బఘేల్‌ ప్రకటించారు. ఈ 24లో... 15 కేసులు ఢీల్లోలో... 12 కేసులు కేరళలో ఉన్నట్టు చెప్పారు. అయితే... ఇప్పుడు మళ్లీ వైరస్‌ విజృంభిస్తోంది. ఎంపాక్స్‌ ప్రమాదకరంగా మారిందని  ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ క్రమంలో.. దేశంలో మళ్లీ ఎంపాక్స్‌ కేసులు విజృంభించే అవకాశాలు ఉన్నాయి. అందుకే కేంద్రం అలర్ట్‌ అయ్యింది. వ్యాధి లక్షణాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని... వైరస్‌ను ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన  చర్యలపై ఫోకస్‌ పెట్టింది. 


వైరస్‌ వ్యాప్తిని ఎలా అడ్డుకోవాలి...?
దేశంలో వైరస్‌ వ్యాపి కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికుల ట్రావెల్‌ హిస్టరీని నమోదు చేయడం చాలా అవసరం. ముఖ్యంగా.. ఎంపాక్స్‌ కేసులు ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చే వారిపై ప్రత్యేక  దృష్టి పెట్టాలి. వాళ్లలో ఎవరికైనా ఎంపాక్స్‌ లక్షణాలు అంటే... జ్వరం, ఒంటిపై దద్దర్లు వంటిని ఉన్నాయేమో టెస్ట్‌ చేయాలని. అందుకు.. ఎయిర్‌పోర్టుల్లో టెస్టింగ్‌ సెంటర్లు పెంచాలి. 


మంకీపాక్స్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్తోంది...?
ఎంపాక్స్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఊరటనిచ్చే విషయం చెప్పింది. కోవిడ్‌లా... మంకీపాక్స్‌ ప్రమాదకర వైరస్‌ కాదని తెలిపింది. ఈ వైరస్‌ వ్యాపిని నియంత్రించే అవకాశాలు ఉన్నాయిని చెప్పింది. కోవిడ్‌ సమయంలో వ్యవహరించినట్టే.. ఎంపాక్స్‌  విషయంలోనూ అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటించింది. ముందస్తు జాగ్రత్తలు తీసుకుని.. వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయగలిగితే.. ఎంపాక్స్‌ను కూడా తరిమేయొచ్చని చెప్పింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. 


మంకీపాక్స్‌ లక్షణాలు ఏంటి..?
మంకీపాక్స్‌ సోకిన వాళ్లకు కనిపించే ముఖ్యమైన లక్ష్యం ఒంటిపై దద్దుర్లు. జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, కండరాల నొప్పులు, వెన్నునొప్పి, మనిషి బలహీనపడటం, రోగ నిరోధక శక్తి తగ్గడం వంటివి ఉంటాయి. ఒంటిపై దద్దుర్లు పండుగా మారి...  చీముతో నిండిన గాయంగా మారుతుంది. పుండ్ల మానిపోయి కొత్త చర్మం ఏర్పడే వరకు.. ఈ వ్యాధి ఇతరకు వ్యాపించే అవకాశం ఉంటుంది. కొంతమందిలో ఒంటిపై దద్దుర్లు ముందుగా కనిపిస్తే... మరికొందరిలో మరో లక్ష్యం బయటపడుతుంది.  వ్యాధి సోకిన వారికి సన్నిహితంగా ఉంటే... వారిలో వారం రోజుల్లో వైరస్‌ లక్షణాలు కనిపిస్తాయి. కొంతమందిలో 21 రోజుల్లో కూడా కనిపించవచ్చు. వైరస్‌ సోకిన తర్వాత రెండు నుంచి నాలుగు వారాల పాటు.. వ్యాధి లక్షణాలు ఉంటాయి.