SSC Junior Engineer Paper-1 Results: కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి నిర్వహించిన పేపర్‌-1 రాతపరీక్ష ఫలితాలను స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఆగస్టు 20న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. పీడీఎఫ్ ఫార్మాట్‌లో పేపర్-1 రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల రూల్ నెంబరు, పేరు వివరాలను పొందుపరిచింది. ఫలితాలకు సంబంధించి పేపర్-1 పరీక్షలో మొత్తం 16,223 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇందులో సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో 11,765 మంది అభ్యర్థులు; ఎలక్ట్రికల్/మెకానికల్ విభాగాల్లో 4,458 మంది అభ్యర్థులు పేపర్-2 పరీక్షకు అర్హత సాధించారు. 


కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో 1,765 జూనియర్‌ ఇంజినీర్ (జేఈ) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మార్చి 28న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా జూనియర్ ఇంజినీర్ (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్) పోస్టులను భర్తీ చేయనున్నారు.  ఈ పోస్టుల భర్తీకి సంబంధించి మార్చి 28 నుంచి ఏప్రిల్ 18 వరకు దరఖాస్తులు స్వీకరించారు. తాజా పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌కార్డులను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెల్లడించింది. జూన్ 5 నంచి 7 వరకు పరీక్షలు నిర్వహించారు. తాజాగా ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. ఉద్యోగాలకు ఎంపికైన వారికి సెవెన్త్‌ పే స్కేలు ప్రకారం రూ.35,400- రూ.1,12,400 జీతం ఇస్తారు. పేపర్‌-1 పరీక్షలో అర్హత సాధించినవారికి తర్వాతి దశలో పేపర్‌-2 రాతపరీక్షలు, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.


జూనియర్‌ ఇంజినీర్‌ పేపర్-1 (సివిల్) ఫలితాల కోసం క్లిక్ చేయండి..


జూనియర్‌ ఇంజినీర్‌ పేపర్-1 (ఎలక్ట్రికల్/మెకానికల్) ఫలితాల కోసం క్లిక్ చేయండి..




✦ పేపర్-2 పరీక్ష విధానం..
మొత్తం 300 మార్కులకు పేపర్-2 రాతపరీక్ష నిర్వహిస్తారు. స‌ంబంధిత బ్రాంచ్‌లో డిప్లొమా/ ఇంజినీరింగ్‌ సిలబస్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు సివిల్ & స్ట్రక్చర‌ల్ లేదా ఎల‌క్ట్రిక‌ల్ లేదా మెకానిక‌ల్ విభాగాల్లో ఏదో ఒక విభాగంలో ప‌రీక్ష రాయాల్సి ఉంటుంది. పరీక్ష సమయం 2 గంట‌ల‌ు. పేపర్‌-2 పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో కాకుండా ప్రతి ప్రశ్నకు రాతపూర్వకంగా సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఈ ప్రశ్నలకు నెగెటివ్‌ మార్కింగ్‌ ఉండదు. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేసి పరీక్షలు నిర్వహిస్తారు.


దేశంలోని నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గుడ్ న్యూస్ తెలిపింది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో జూనియర్‌ ఇంజినీర్ (JE) పోస్టుల సంఖ్యను స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) భారీగా పెంచిన సంగతి తెలిసిందే. నోటిఫికేషన్ సమయంలో 968 పోస్టులను ప్రకటించగా.. తాజాగా ఆ సంఖ్యను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. నోటిఫికేషన్ సమయంలో మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీస్ పోస్టులను ప్రకటించలేదు. తాజాగా ఆ పోస్టులను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఈ విభాగంలో 839 పోస్టులను కేటాయించింది.  ఇందులో సివిల్ విభాగంలో 489 పోస్టులు, ఎలక్ట్రికల్ & మెకానికల్ విభాగాల్లో 350 పోస్టులను జతచేసింది. అయితే సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌లో ఎలక్ట్రికల్ విభాగంలో గతంలో 121 పోస్టులను 92కి, సివిల్ విభాగంలో 217 పోస్టులను 206కు తగ్గించింది. అంటే 40 పోస్టులు తగ్గాయి. దీంతో నోటిఫికేషన్‌లో పేర్కొన్న 966 పోస్టులకు అదనంగా 799 పోస్టులు కలిపినట్టయింది. ఈ కారణంగా మొత్తం ఖాళీల సంఖ్య 1765కి చేరింది. 


పోస్టుల పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..