Monsoon 2023 Deaths:
624 మంది మృతి
ఈ ఏడాది రుతుపవనాలు కాస్త ఆలస్యం అయ్యాయని బాధ పడేలోపే ఒక్కసారిగా కుండపోత వర్షాలు కురిశాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే వరదలు ముంచెత్తుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, ఢిల్లీలో ఎటు చూసినా వరద నీరే కనిపిస్తోంది. మరి కొన్ని రాష్ట్రాల్లోనూ వరదల ధాటికి భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కేంద్రహోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన లెక్కల ప్రకారం..జూన్ నుంచి మొదలైన వర్షాలతో దేశవ్యాప్తంగా 624 మంది మృతి చెందారు. గతేడాదితో పోల్చి చూస్తే...ఇది 32% తక్కువే. ప్రాణనష్టంతో పాటు ఆస్తినష్టం ఎంత వాటిల్లిందో కూడా లెక్కలు వేసింది హోంశాఖ. అయితే....హిమాచల్‌ప్రదేశ్‌లో వరదల కారణంగా ఎక్కువ మంది చనిపోయారు. గత 50 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా భారీ వర్షపాతం నమోదైంది ఈ రాష్ట్రంలో. ముఖ్యంగా సోలాన్, ఉనా ప్రాంతాల్లో 223 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయింది. మాన్‌సూన్ సీజన్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకూ హిమాచల్‌ప్రదేశ్‌లో 99 మంది చనిపోయారు. గతేడాది ఈ సంఖ్య 187గా ఉంది. ఇక గుజరాత్ విషయానికొస్తే...హిమాచల్ కన్నా ఎక్కువ ప్రాణనష్టం నమోదైంది. ఇదంతా బిపార్‌జాయ్ తుపాను కారణంగా గుజరాత్ అతలాకుతలమైంది. కేంద్రహోం శాఖ లెక్కల ప్రకారం ఈ రాష్ట్రంలో వర్షాల కారణంగా 103 మంది ప్రాణాలు కోల్పోయారు.
లక్షల హెక్టార్ల పంట నష్టం..
కర్ణాటకలో 87 మంది, రాజస్థాన్‌లో 36 మంది ప్రాణాలు కోల్పోయారు. పంజాబ్‌లోనూ ఈ సారి వర్షాల ప్రభావం గట్టిగానే కనిపించింది. ఈ వానలు సృష్టించిన బీభత్సానికి 11 మంది చనిపోయారు. అటు హరియాణాలోనూ 19 మంది ప్రాణాలు కోల్పోయారు. పంజాబ్‌లోని లుధియానా, పటియాలాతో పాటు హరియాణాలోని యమునానగర్, కర్నాల్ ప్రాంతాలు ఇంకా వరద నీటిలోని చిక్కుకుని ఉన్నాయి. అసోంలో 38 మంది, మణిపూర్‌లో 8 మంది, మధ్యప్రదేశ్‌లో 92, మహారాష్ట్రలో 92 మంది వర్షాలకు బలి అయ్యారు. అయితే...ఈ సారి దాదాపు 12 రాష్ట్రాల్లో అనుకున్న స్థాయి కన్నా తక్కువగానే వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. అందులో తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఉన్నాయి. ఈ వర్షాల కారణంగా దేశవ్యాప్తంగా 2 లక్షల హెక్టార్ల పంట నష్టం జరిగింది. గతేడాది ఇది 2.48లక్షల హెక్టార్లుగా ఉంది. గతేడాదితో పోల్చుకుంటే ఆస్తి నష్టం కూడా తక్కువే నమోదైంది. 2013 నుంచి చూస్తే ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో వేలాది మంది వర్షాలకు బలి అయ్యారు. అప్పటి నుంచి ఒక్క ఏడాది కూడా తక్కువ వర్షపాతం నమోదు కాలేదు. పంట నష్టం భారీగా నమోదు కావడం వల్ల దిగుబడి పూర్తిగా తగ్గిపోనుంది. ఇది ధరలపైనా ప్రభావం చూపే అవకాశాలున్నాయి. ఇప్పటికే పలు కూరగాయల ధరలు భారీగా పెరిగిపోయాయి. ఇక దేశరాజధాని ఢిల్లీలోనూ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. యమునా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటం వల్ల అన్ని ప్రాంతాలూ నీటమునిగాయి.
Also Read: సుప్రీంకోర్టుని ఆశ్రయించిన రాహుల్, గుజరాత్ కోర్టు తీర్పుని సవాల్ చేస్తూ పిటిషన్