Wrong Transactions:
పెరిగిన డిజిటల్ పేమెంట్స్..
డిజిటల్ పేమెంట్స్‌కి అందరమూ అలవాటు పడిపోయాం. ATMలకు వెళ్లి డబ్బులు తీసుకురావడం చాలా వరకూ తగ్గిపోయింది. కరోనా కారణంగా చాలా మంది డిజిటల్ చెల్లింపుల వైపు మళ్లారు. ఫలితంగా చిన్న చిన్న టీ షాప్‌ల నుంచి బడా షాపింగ్ కాంప్లెక్స్‌ల వరకూ అన్ని చోట్లా UPI పేమెంట్స్ పెరిగాయి. ఆన్‌లైన్ బ్యాంకింగ్ కూడా పెరిగింది. చాలా మంది ఆన్‌లైన్‌లోనే డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. ఇలా చేసే క్రమంలోనే కొందరు పొరపాటున ఓ బ్యాంక్ అకౌంట్‌కి బదులు మరో అకౌంట్‌కి పంపిస్తుంటారు. ఆ తరవాత తప్పు తెలుసుకుని తెగ బాధ పడిపోతారు. ఆ అకౌంట్‌లో నుంచి మళ్లీ డబ్బు ఎలా వెనక్కి తీసుకురావాలన్నది పెద్ద క్వశ్చన్. దీనికి సొల్యూషన్ ఉన్నప్పటికీ అందరికీ తెలియకపోవచ్చు. ఓ SBI యూజర్‌కి ఇదే అనుభవం ఎదురైంది. పొరపాటున వేరే అకౌంట్‌కి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఏం చేయాలో అర్థం కాక ట్విటర్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. ఈ సమస్యకు పరిష్కారం చూపించాలంటూ SBIని ట్యాగ్ చేశాడు.
"నేను పొరపాటున ఓ అకౌంట్‌కి డబ్బులు పంపాను. నాకు దగ్గర్లోని బ్రాంచ్‌కి వెళ్లి ఇదే విషయం చెప్పాను. వాళ్లు అన్ని వివరాలు అడిగితే ఇచ్చాను. కానీ...ఇప్పటి వరకూ బ్రాంచ్ సిబ్బంది నాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఆ డబ్బులు వెనక్కి వస్తాయో లేదో చెప్పడం లేదు. దయచేసి నాకు హెల్ప్ చేయండి"
- ఓ బాధితుడు
ఈ ట్వీట్‌కి SBI స్పందించింది. అఫీషియల్ ట్విటర్ అకౌంట్ ద్వారా పోస్ట్‌లు పెట్టింది. పొరపాటున వేరే అకౌంట్‌కి డబ్బులు పంపినప్పుడు ఏం చేయాలో స్టెప్ బై స్టెప్ వివరించింది.
"ఎప్పుడైనా పొరపాటున వేరే అకౌంట్‌కి డబ్బులు పంపినప్పుడు వెంటనే దగ్గర్లోని బ్రాంచ్‌ని విజిట్ చేయండి. అక్కడి సిబ్బందికి మీ సమస్య చెప్పండి. మీరు డబ్బులు పంపిన ఆ అకౌంట్ ఏ బ్యాంక్‌దో చెబితే వాళ్లతో మా సిబ్బంది మాట్లాడుతుంది. దీనికి ఎలాంటి ఫీజ్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ సమస్య పరిష్కారం కాకపోతే...https://crcf.sbi.co.in/ccf సైట్‌లో కంప్లెయింట్ చేయొచ్చు. అక్కడి కామెంట్ బాక్స్‌లో మీ ప్రాబ్లమ్ ఏంటో చెప్పండి. అది చూసిన తరవాత ఓ టీమ్ వెంటనే మీ సమస్యను కన్సిడర్ చేసి పరిష్కారం చూపిస్తుంది"
- SBI
అయితే...ఏదైనా అకౌంట్‌కి డబ్బులు పంపే ముందు వెరిఫై చేసుకోవాలని సూచించింది SBI.వెరిఫికేషన్ చేసుకున్న తరవాతే డబ్బులు పంపాలని, తప్పుడు లావాదేవీలకు బ్యాంక్ ఎలాంటి బాధ్యత వహించదని వెల్లడించింది. RBI గైడ్‌లైన్స్ ప్రకారం కస్టమర్సే ఇందుకు బాధ్యులు అని వివరించింది.