Modi Interview: ఉక్రెయిన్ - రష్యా యుద్ధం విషయంలో భారత్ తటస్థ వైఖరి అవలంబిస్తోందంటూ పశ్చిమ దేశాలు వ్యాఖ్యలు చేస్తున్నాయని తెలిసిందే. అయితే తాజాగా ఈ అంశంపై మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. రష్యా - ఉక్రెయిన్ యుద్ధంలో తాము తటస్థంగా లేమని, తమ వైఖరి ఏంటన్నది తేల్చి చెప్పారు. తాము శాంతి వైపే ఉన్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఇవాళ అమెరికా పర్యటనకు బయల్దేరారు. అంతకు ముందు యూఎస్ పత్రిక అయిన వాల్ స్ట్రీట్ జర్నల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సందర్భంలో మోదీ యుద్ధంపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. 


'మేము తటస్థ వైఖరి అవలంబిస్తున్నామని కొందరు అంటున్నారు. కానీ మేం ఉక్రెయిన్- రష్యా యుద్ధం అంశంలో తటస్థంగా ఏమీ లేము. శాంతి వైపు నిలబడుతున్నాం. దేశాల సార్వభౌమత్వాన్ని, అంతర్జాతీయ చట్టాలను ప్రతి దేశం కచ్చితంగా గౌరవించి తీరాలి. చర్చలు, దౌత్యపరమైన మార్గాల ద్వారా మాత్రమే వివాదాలను పరిష్కరించుకోవాలి. అంతేగానీ యుద్ధంతో కాదు. ఇరు దేశాల మధ్య సమస్య పరిష్కారం కోసం రష్యా అధినేత పుతిన్ తో, ఉక్రెయిన్ అధినేత జెలెన్ స్కీతో పలుమార్లు మాట్లాడాను. భారత్ ఏం చేయగలదో అన్నీ చేస్తోంది. ఘర్షణలను పరిష్కరించి ఇరు దేశాల మధ్య శాంతిని, స్థిరత్వాన్ని తీసుకు వచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం, అలాంటి ప్రయత్నాలను సమర్థిస్తున్నాం' అని ప్రధాని మోదీ తెలిపారు. 


'బంధం నిలబడాలంటే సరిహద్దుల్లో శాంతి నెలకొనాలి'


భారత్ - చైనా మధ్య సంబంధాల గురించి మాట్లాడిన మోదీ.. ద్వైపాక్షిక బంధాలు నిలబడాలంటే.. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి నెలకొనాలని, నిశ్చలమైన పరిస్థితులు రావాలని పేర్కొన్నారు. సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత, వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడంపై విశ్వాసం ఉందని తెలిపారు. అదే సమయంలో భారత్ తన గౌరవాన్ని, సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు సంసిద్ధంగా ఉందని మోదీ పేర్కొన్నారు. 


'సరైన స్థానాన్ని దక్కించుకోవాలని కోరుకుంటున్నాం'


భారత్ - అమెరికా మధ్య బంధం గతం గంటే మరింత బలంగా ఉందని ప్రధాని అన్నారు. ఇరు దేశాల నాయకుల మధ్య అమితమైన విశ్వాసం ఉందని తెలిపారు. అలాగే.. ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో విస్తృతమైన పాత్ర పోషించేందుకు భారత్ అర్హమైనదేనని పేర్కొన్నారు. విద్య, మౌళిక సదుపాయాల్లో భారత్ విస్తృత పెట్టుబడులు పెడుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల పరిస్థితుల్లో తయారీ, సరఫరా చైన్ ను పెంపొందించేందుకు మల్టీ నేషనల్ కంపెనీలు భారత్ వైపు చూస్తున్నట్లు మోదీ తెలిపారు. అయితే భారత్ ఏ దేశ స్థానాన్నీ భర్తీ చేయాలనుకోవట్లేదని, కేవలం ప్రపంచంలోనే సరైన స్థానాన్ని దక్కించుకోవాలని మాత్రమే కోరుకుంటున్నామని వెల్లడించారు. 


Also Read: అమెరికా పర్యటనకు బయలుదేరే ముందు కాంగ్రెస్‌కు థాంక్స్ చెప్పిన ప్రధాని మోదీ


'స్వతంత్ర భారత్‌లో పుట్టిన తొలి ప్రధాని నేనే'


స్వాతంత్ర్య భారత దేశంలో పుట్టిన తొలి ప్రధాన మంత్రిని నేనే అని మోదీ అన్నారు. అందుకే ఆలోచనా విధానాలు, ప్రవర్తన అన్నీ.. దేశ చరిత్ర, సంప్రదాయాల నుంచి ప్రేరణ పొందినట్లుగానే ఉంటాయని చెప్పారు. అదే తన బలమని, దాన్నే ప్రపంచానికి పరిచయం చేస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial