Meerut Building Collapse: మేరఠ్ నగరంలో ఓ భవనం కుప్పకూలిపోయిన ఘటనలో పలువురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. అత్యధిక జనాభా నివసించే నగరంలోని జాకీర్ కాలనీలో ఓ భవనం కూలిపోయింది. ఇది ఓ డెయిరీ నిర్వాహకుడికి చెందిన మూడంతస్తుల ఇల్లు అని చెబుతున్నారు. నేలమట్టమైన ఈ భవన శిథిలాల కింద దాదాపు 12 మంది సమాధి అయ్యారు. కొన్ని పశువులు కూడా ఈ శిథిలాల కింద చిక్కుకుపోయాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 8 మంది మృతి చెందినట్లు చెబుతుండగా.. చనిపోయిన వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. అధికారులు సహాయక చర్యలు కొనసాగుతున్నారు. 


ఈ ప్రమాదంలో ఈ ఇంట్లో నివసిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన 12 మంది శిథిలాల కింద సమాధి అయ్యారు. ప్రమాదానికి గురైన ఇల్లు 90 ఏళ్ల వృద్ధ మహిళ నాఫోకు చెందినదని చెబుతున్నారు. ఈ ఇంట్లో నఫో ఇద్దరు కుమారులు సాజిద్, గోవింద భార్యాపిల్లలతో కలిసి ఉంటున్నారు. ఫ్యామిలీ మొత్తం శిథిలాల కింద చిక్కుకుపోయింది. ఈ ఇంట్లో నివాసం ఉంటున్న కుటుంబం పాల వ్యాపారం చేస్తుంది. కింది అంతస్తులో గేదెలను కట్టి ఉంచుతుండగా.. కుటుంబం పైరెండు అంతస్తులలో ఉంటోంది.


తొలుత ముగ్గురు వ్యక్తులు మరణించినట్లుగా అధికారులు తెలిపారు. వారిలో ఒక వ్యక్తి, ఒక మహిళ, మరో బిడ్డ కూడా ఉన్నారు. క్రమంగా చనిపోయిన వారి సంఖ్య పెరిగింది. ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రిలో చేర్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వీరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. నలుగురు వ్యక్తులు శిథిలాల కింద ఉండి ఉంటారని భావిస్తున్నారు. ఆ భారీ శిథిలాలను తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.


ఈ భవన ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులతో పాటు, మున్సిపాలిటీ సిబ్బంది కూడా అక్కడకు చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఏడీజీ ధృవకాంత్ ఠాకూర్, కమిషనర్ సెల్వ కుమారి జె., ఐజీ నచికేత ఝా, ఎస్‌ఎస్పీ డాక్టర్ విపిన్ తండా, ఇతర అధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. వీరి సూచనల మేరకు సహాయక చర్యలు ప్రారంభించారు. ఎన్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక దళం, పోలీసు బృందాలు సంఘటనా స్థలంలో సహాయక చర్యలలో నిమగ్నమై ఉన్నాయి. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం 5:15 గంటలకు జకీర్ కాలనీలోని మూడు అంతస్తుల ఇల్లు అకస్మాత్తుగా కూలిపోయింది.