Maratha Quota : మహారాష్ట్ర (Maharastra ) లో మరాఠా కోటా ఉద్యమం మళ్లీ రాజుకుంటోంది.  మరాఠా ఉద్యమ నేత మనోజ్ జరాంగే (Manoj Jarange )...ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. శనివారం ఉదయం 11 గంటలలోపు తమ డిమాండ్లను అంగీకరించాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేట్ జారీ చేశారు. మరాఠా కోటా అంశంలో ప్రభుత్వం వెంటనే ఆర్డినెన్స్ జారీ చేయాలని జరాంగే డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించకపోతే...మధ్యాహ్నం 12గంటలకు తన నిర్ణయం ప్రకటిస్తానని షిండే ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు.   మరాఠాల రిజర్వేషన్లపై సీఎం ఏక్ నాథ్ షిండే ( Eknath Shinde ),  ఉప ముఖ్యమంత్రులు అజిత్‌ పవార్‌ (Ajith Pawar), ఫడ్నవీస్‌ (Fadnavis) దృష్టి పెట్టాలని సూచించారు. మరాఠాలను మోసగించేందుకు ప్రయత్నిస్తే సహించబోనన్న జరాంగే...54 లక్షల మందికి ఓబీసీ సర్టిఫికెట్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేశారు.


నిరసనకారులను అడ్డుకున్న పోలీసులు
వేలాదిమంది మద్దతుదారులతో కలిసి మనోజ్ జరాంగే నవీ ముంబయికి చేరుకున్నారు. ఆందోళనకారులు నగరంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. నగరంలోకి ప్రవేశించేందుకు అనుమతి లేదని నిరసనకారులకు తెలిపారు. ఖర్‌గర్‌ ప్రాంతంలో ఉన్న ఇంటర్నేషనల్ కార్పొరేషన్ పార్క్‌లో నిరసన తెలపాలని నిరసనకారులకు జరాంగే సూచించారు. ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రాకపోతే ముంబయిలోని ఆజాద్ మైదానంలో నిరసనగా దిగుతామని ప్రభుత్వానికి మనోజ్ జరాంగే హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వం పంపిన ప్రతినిధుల బృందంతో చర్చల తర్వాత జరాంగే మాట్లాడారు. ఆ తర్వాత నవీ ముంబైలోని శివాజీ చౌక్‌లో నిరసనకారులను ఉద్దేశించి మాట్లాడారు. 


రిజర్వేషన్లు సాధించే వరకు వెనుకడుగు వేయం
రిజర్వేషన్లు సాధించే వరకు వెనకడుగు వేసేది లేదని మనోజా జరాంగే  స్పష్టం చేశారు. మరాఠా రిజర్వేషన్లపై మహారాష్ట్ర సర్కార్‌ ఆర్డినెన్స్ జారీ చేయని పక్షంలో...మద్దతుదారులతో కలిసి పెద్ద ఎత్తున ముంబయిలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యలో రిజర్వేషన్లు మంజూరు చేసే వరకు ఆందోళనను విరమించబోమన్నారు. మరోవైపు మనోజ్ జరాంగే ముంబయిలోకి రాకుండా ఒప్పించేందుకు మహా సర్కార్ ప్రయత్నిస్తోంది. మరాఠా ఉద్యమకారుల  డిమాండ్లను ఆమోదించినట్లు మంత్రి దీపక్ కేసర్కర్ వెల్లడించారు. ప్రభుత్వ విధానాల ప్రకారం వాటిని అమలు చేస్తామని స్పష్టం చేశారు. కుంబీ కులానికి చెందిన వారిని ఓబీసీలుగా పరిగణిస్తూ... ఇప్పటి వరకు 37 లక్షల సర్టిఫికెట్లను ఇచ్చామన్నారు. ఈ సంఖ్య త్వరలోనే 50 లక్షలకు చేరుకుంటుందని తెలిపారు. మంత్రి కేసర్కర్ వ్యాఖ్యలపై జరాంగే మాట్లాడారు. మంత్రుల బృందం తనకు కొన్ని పత్రాలు ఇచ్చిందని... వాటిపై మద్దతుదారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.


గతేడాది ఇద్దరు ఎమ్మెల్యేల ఇళ్లకు నిప్పు


గతేడాది మరాఠా వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్​ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల ఇళ్లకు నిప్పంటించారు. తొలుత బీడ్​ మజల్​గావ్​లోని శాసనసభ్యుడు ప్రకాశ్ సోలంకే నివాసంపై దాడి చేశారు. ఆయన ఇళ్లు, కార్లకు నిప్పంటించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే సందీప్ క్షీర్​సాగర్​ ఇంటికి, కార్యాలయానికి నిప్పంటించారు. అక్కడితో ఆగని నిరసనకారులు...మజల్‌గావ్ మున్సిపల్ కౌన్సిల్ భవనానికి నిప్పంటించారు. రిజర్వేషన్​లకు అనుకూలంగా నినాదాలు చేస్తూ భవనంలోకి దూసుకెళ్లారు. అనంతరం కార్యాలయంలోని సామగ్రిని ధ్వంసం చేసి నిప్పు పెట్టారు.