'Padma Vibhushan's Chiranjeevi and Venkaiah Naidu: కేంద్రప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో మెగాస్టార్‌ చిరంజీవి, ఉపరాష్ట్రపతి  వెంకయ్య నాయుడుకి అరుదైన గౌరవం దక్కింది. వీరిద్దరితో పాటు మరో ఐదుగురికి పద్మవిభూషణ్‌ అవార్డు ప్రకటించింది కేంద్రం. భారతదేశంలోనే రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్‌ అవార్డుకు వారు ఎన్నికవ్వడం పట్ల తెలుగు వారు ఉప్పొంగిపోతున్నారు. దీంతో చిరంజీవి, వెంకయ్య నాయుడికి శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి.


ఇదిలా ఉంటే తాజాగా చిరంజీవి, వెంకయ్య నాయుడుని స్వయంగా కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం కలిసి ఇద్దరు పద్మవిభూషణులు ఇద్దరు పద్మ విభూషణులు ఒకరికి ఒకరు పరస్పర ఆత్మీయ అభినందనలు తెలుపుకున్నారు. ఇద్దరు పద్మవిభూషణులను ఒకే ఫ్రేంలో చూసి తెలుగువారంతా మురిసిపోతున్నారు. 


ఎన్టీఆర్, ఏఎన్ఆర్ రెండు కళ్లయితే.. చిరంజీవి 'త్రినేత్రుడు': వెంకయ్య నాయుడు


ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడారు. "నేను ఎప్పుడూ అంటుంటాను. తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు గార్లు రెండు నేత్రాలు అయితే చిరంజీవి మూడో నేత్రం. ఆయన త్రినేత్రుడు. చిరంజీవి గారు పద్మ విభూషణ్ పురస్కారానికి పూర్తిగా అర్హులు. ఈ అవార్డు అందుకోవడానికి ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయి. సరైన సమయంలో భారత ప్రభుత్వం ఆయనకు సముచిత గౌరవం ఇచ్చింది. చిరంజీవి గారిని చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది" అని అన్నారు.






చాలా విషయాల్లో వెంకయ్య నాయుడు గారు నాకు స్ఫూర్తి: చిరంజీవి


అనంతరం చిరంజీవి మాట్లాడారు. "పెద్దలు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిశా. ఆయన అంటే నాకు అపారమైన గౌరవం. విద్యార్థిగా ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన పిలుపుతో మేమంతా 'జై ఆంధ్ర' ఉద్యమంలో పాల్గొన్నాం. అప్పటి నుంచే ఆయన నాకు తెలుసు. అలాగే పార్లమెంట్‌లో మేమిద్దరం కొలీగ్స్ కూడా. ఆయన ప్రతి ఎదుగుదల, పెరుగుదల నేను గమనిస్తూ ఉన్నాను. చాలా విషయాల్లో వెంకయ్య నాయుడు గారిని నేను స్ఫూర్తిగా తీసుకుంటూ ఉంటాను.


ముఖ్యంగా తనను తాను మలుచుకుంటూ రాజకీయాల్లో స్వయం కృషితో ఎదిగారు. ఈ రోజు తెలుగు వారు అందరూ గర్వించే స్థాయికి చేరుకున్నారు. ఆయనను పద్మ విభూషణ్ అవార్డుతో భారత ప్రభుత్వం సత్కరించడం, గౌరవించడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరీ ముఖ్యంగా ఆయనతో పాటు నాకూ పద్మ విభూషణ్ రావడం అనేది మరింత ఆనందాన్ని ఇచ్చింది" అని వ్యాఖ్యానించారు.