Animal OTT Disappoints for Fans and Audiences : 'అర్జున్ రెడ్డి' మూవీ ఫేమ్ సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన 'యానిమల్' మూవీ గత ఏడాది డిసెంబర్లో విడుదల ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. బాలీవుడ్ స్టార్ రణ్ బీర్ కపూర్, నేషనల్ రష్మిక మందన జంటగా నటించిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టించింది. డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా గత ఏడాది బాలీవుడ్ లో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఫుల్ రన్ లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సుమారు రూ. 915 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించింది.


ఈ సినిమాతో దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగ పేరు ఇండియా వైడ్ గా మార్మోగిపోయింది. ఈ సినిమాకు విమర్శలు ఎదురైనా కూడా తాను మాత్రం అందరికీ సమాధానం ఇస్తూ 2023లోనే అతిపెద్ద హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. దీంతో మరోసారి టాలీవుడ్‌లో మాత్రమే కాకుండా బాలీవుడ్‌లో కూడా సందీప్ రెడ్డి వంగా అనే పేరు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. ఇదిలా ఉంటే ‘యానిమల్’ మూవీని ఓటీటీలో చూడడానికి ప్రేక్షకులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. థియేటర్ రన్ టైం కంటే మరింత ఎక్కువ నిడితో యానిమల్ ఓటీటీ రిలీజ్ ఉంటుందని చాలా రోజులుగా వార్తలు వినిపించాయి.


యానిమల్ 3 గంటల 21 నిమిషాల నిడివితో థియేటర్లలో విడుదలయ్యింది. అయితే అందులో తనకు ఇష్టం లేకపోయినా కొన్ని సీన్స్‌ను కట్ చేశానని, ఆ సీన్స్‌ను ఓటీటీ రిలీజ్‌లో యాడ్ చేశానని సందీప్ ముందే అనౌన్స్‌మెంట్ ఇచ్చేశాడు. ఇక ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవ్వడానికి సిద్ధమవ్వడంతో మరో 8 నిమిషాలను కూడా దీనికి జతచేసినట్లు చెప్పారు. అంటే మొత్తంగా 3 గంటల 29 నిమిషాలతో 'యానిమల్' స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యినట్లు వార్తలు వచ్చాయి. జనవరి 26 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో ‘యానిమల్’ స్ట్రీమ్ అవుతుందని స్పెషల్ పోస్ట్ ద్వారా అనౌన్స్ చేసింది నెట్‌ఫ్లిక్స్ టీమ్. చేసినట్టుగానే జనవరి 26 అర్ధ రాత్రి నుంచే యానిమల్ నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.


అయితే ఓటీటీలో ఈ సినిమాని చూసిన ఆడియన్స్ డిసప్పాయింట్ అయ్యారు. అందుకు కారణం ముందుగా చెప్పినట్లు యానిమల్ ఓటీటీ వెర్షన్ లో అదనపు సన్నివేశాలు లేకపోవడమే. సేమ్ థియేటర్లో రిలీజ్ అయిన 3 గంటల 21 నిమిషాల రన్ టైం తోనే ఓటీటీలో రిలీజ్ చేశారు. దీంతో ఆడియన్స్ యానిమల్ మేకర్స్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒక్క సినిమా అనే కాదు చాలా సినిమాల విషయంలో ఇదే జరిగింది.


ఓటీటీ రిలీజ్ కి ముందు మేకర్స్ అనవసరంగా ఎక్స్టెంటెడ్ వెర్షన్ ని చేస్తున్నామని, థియేటర్లో కట్ చేసిన సీన్స్ ఓటీటీలో యాడ్ చేస్తున్నామని చెబుతూ అనవసరమైన హైప్ క్రియేట్ చేస్తున్నారు. షారుఖ్ ఖాన్ 'జవాన్' సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. జవాన్ ఓటీటీ మరింత ఎక్కువ రన్ టైమ్ తో ఉంటుందని రిలీజ్ కు ముందు ప్రచారం జరిగింది. చూస్తే ఓటీటీ వెర్షన్ లోనూ థియేటర్ రన్ టైం తోనే సినిమాని రిలీజ్ చేశారు.


Also Read : కష్టపడ్డాడు, కోట్లు కూడబెట్టాడు - విజయ్ సేతుపతి ఆస్తుల చిట్టా తెలిస్తే షాకవుతారు