రాహుల్ విమర్శలు..


ప్రధాని మోదీ అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో దాదాపు రెండు గంటల పాటు ప్రసంగించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సహా విపక్ష కూటమిపై విమర్శలు చేశారు. ముఖ్యంగా రాహుల్‌ గాంధీపై సెటైర్లు వేశారు. మణిపూర్‌ అంశంపైనా ప్రకటన చేశారు. మోదీ స్పీచ్‌ని ఇప్పటికే విపక్షాలు ఖండించగా...ఇప్పుడు రాహుల్ స్పందించారు. ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో ప్రధానిపై విమర్శలు చేశారు. మణిపూర్‌ మంటల్లో తగలబడిపోతున్నా...మోదీ వాటిని చల్లార్చే ప్రయత్నం చేయడం లేదని అన్నారు. మణిపూర్‌లో భరత మాతను హత్య చేశారన్న వ్యాఖ్యలపై దుమారం రేగినప్పటికీ...అవే వ్యాఖ్యల్ని మరోసారి చేశారు రాహుల్. ఎంతో ఆవేదనతో ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని వివరించారు. రెండు గంటల పాటు ప్రసంగించిన ప్రధాని...జోక్‌లు వేయడం, నవ్వడం తప్ప మరేమీ చేయలేదని విమర్శించారు. మణిపూర్‌లో హింసను ఎలా అదుపులోకి తీసుకురావాలన్నదే అసలైన చర్చ అని...అది తప్ప అన్నీ మాట్లాడారని అసహనం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో భరత మాత గురించి మాట్లాడడం కూడా తప్పైపోయిందని అన్నారు. ప్రధానికి మణిపూర్‌ని కాపాడే ఉద్దేశమే లేదని తేల్చి చెప్పారు రాహుల్ గాంధీ. ప్రధాని ఆ రాష్ట్రానికి ఓ సారైనా వెళ్లి ఉండాల్సిందని తెలిపారు. 


"ప్రధాని మోదీ లోక్‌సభలో రెండు గంటల పాటు మాట్లాడారు. చివర్లో కాసేపు మణిపూర్ గురించి ప్రస్తావించారు. ఆ రాష్ట్రంలో మూడు నెలలుగా హింసాకాండ కొనసాగుతూనే ఉంది. ప్రజలు హత్యకు గురవుతున్నారు. మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. కానీ...ప్రధాని నరేంద్ర మోదీ జోక్‌లు చేస్తున్నారు. నవ్వుతున్నారు. ఇది ఏ మాత్రం సరికాదు"


- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ 






ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగితే రెండ్రోజుల్లోనే పరిస్థితులు అదుపులోకి వస్తాయని, కానీ ప్రధాని మోదీకి అక్కడి మంటలు ఆర్పడం ఇష్టం లేదని విమర్శించారు. మణిపూర్ పౌరులతో ఓ సారైనా మాట్లాడి భరోసా ఇచ్చే ప్రయత్నమే చేయలేదని మండి పడ్డారు. ప్రధాని ఓ పొలిటీషియన్‌గా కాకుండా దేశాధినేతగా బాధ్యతాయుతంగా మాట్లాడి ఉంటే బాగుండేదని సెటైర్లు వేశారు. 


"నా 19 ఏళ్ల రాజకీయ అనుభవంలో మణిపూర్‌లో ఇంత దారుణమైన పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు. మణిపూర్‌లో భరతమాతను హత్య చేశారని అన్నాను. ఇవి ఉత్తి మాటలు కావు. ఆ రాష్ట్రంలో పర్యటించినప్పుడు అక్కడి ప్రజలతో మాట్లాడాను. మైతేయి వర్గాన్ని కలిసినప్పుడు సెక్యూరిటీలో ఎవరైనా కుకీలు ఉన్నారా అని వాళ్లు అడిగారు. ఉంటే తమను చంపేస్తారని భయపడ్డారు. కుకీలున్న ప్రాంతానికి కూడా వెళ్లాం. అక్కడ ఎవరైనా మైతేయిలు కనిపిస్తే చంపేస్తామని చెప్పారు. అంటే మణిపూర్‌ అనధికారికంగా రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. ఆ బాధలోనే ఆ వ్యాఖ్యలు చేశాను"


- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ 



ప్రధాని మణిపూర్‌ గురించి చాలా మాట్లాడతారని ఆశించినా...ఆయనకు ఆ ఉద్దేశం లేదని అర్థమైందని అన్నారు రాహుల్. అక్కడి సమస్య పరిష్కారానికి ఎన్నో మార్గాలున్నా...వాటిని మోదీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆయన ఏమీ చేయకపోగా...లోక్‌సభలో నవ్వుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాని కూడా నియంత్రిస్తున్నారని మండి పడ్డారు. 


"మణిపూర్‌లో రెండు వర్గాల మధ్య అసలు చర్చ అన్న మాటే వినిపడడం లేదు. వీలైనంత త్వరగా ఈ హింసను ఆపేయాలని కోరుకుంటున్నాం. ఇది ప్రధాని మోదీ చేతుల్లోనే ఉంది. అయినా ఆయన ఆ పని చేయడం లేదు. పైగా లోక్‌సభలో జోక్‌లు చెబుతూ నవ్వుతున్నారు. రాజ్యసభ, లోక్‌సభ టీవీలనూ నియంత్రిస్తున్నారని నాకు తెలుసు. కానీ నా పని నేను చేసుకుంటున్నాను. భరత మాతపై ఎక్కడ దాడి జరిగితే అక్కడ నేనుంటాను గుర్తు పెట్టుకోండి"


- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ