Manipur Violence: హింసాత్మక ఘటనలతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ అట్టుడికిపోతోంది. రోజుకో దారుణమైన ఘటనతో వార్తల్లో నిలుస్తోంది. కొన్ని రోజుల క్రితం ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించి సామూహిక అత్యాచారానికి పాల్పడటం, స్వాతంత్ర్య సమరయోధుడి భార్యను సజీవ దహనం చేయడం లాంటి ఘటనలపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రంలో చెలరేగిన ఈ హింసను కట్టడి చేయడంలో భాగంగా మణిపూర్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. గత 80 రోజుల నుంచి మణిపూర్ లో అంతర్జాల సేవలు లేవు. ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఇంటర్నెట్ లేకపోవడం అంటే.. ప్రపంచంలో, మన దేశంలో, రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేని పరిస్థితి. అలాంటిది దాదాపు 3 నెలలుగా ఇంటర్నెట్ సేవలు లేకపోవడంతో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు అక్కడి ప్రజలు.
ప్రస్తుతం మణిపూర్ లో పాఠశాలలు, విద్యా సంస్థలు కూడా తెరచుకోకపోవడంతో చాలా మంది విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు. కరోనా సమయంలో ఆన్‌లైన్ చదువులకు విద్యార్థులంతా అలవాటు పడిపోయారు. కానీ అంతర్జాలం లేకపోవడంతో క్లాసులు వినలేని పరిస్థితి నెలకొంది. ఇంటర్నెట్ లేకపోవడంతో రోజువారీ జీవితంపై తీవ్ర ప్రభావం పడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అంతర్జాలం లేకపోవడంతో ఆన్‌లైన్ లావాదేవీలు కూడా చేసుకోలేని పరిస్థితి. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా యూపీఐ సేవలు గ్రామాల్లోకి కూడా విస్తరించాయి. ప్రస్తుతం ఇంటర్నెట్ లేకపోవడంతో ఈ-లావాదేవీలు చేసుకోలేని పరిస్థితి. అలాగే ఏటీఎంలు, బ్యాంకింగ్ సేవలకు కూడా ఇబ్బంది పడాల్సి వస్తోంది.
అందమైన రాష్ట్రంలో అలజడి..
22,327 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం. 30 లక్షల మంది జనాభా. మూడు తెగల ప్రజలు. ఇదీ క్లుప్తంగా మణిపూర్. మణిపూర్ (Manipur) అంటే బంగారు భూమి అని అర్థం. ముత్యాల నేల అని కూడా అంటారు. అంత అందమైందీ ప్రాంతం. ఈ రాష్ట్రంలో మొత్తం 39 తెగలున్నాయి. వీరిలో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు ఉన్నారు. ఇన్ని తెగలున్నప్పటికీ మెజార్టీ మాత్రం మైతేయి వర్గానిదే. 50%కిపైగా ఈ తెగ వాళ్లే ఉన్నారు. 43% మంది కుకీలు, నాగాలున్నారు. మైతేయిని మెజార్టీ కమ్యూనిటీ కాగా..కుకీలు, నాగాలు మైనార్టీలు. ఇప్పుడు గొడవ జరుగుతోంది మైతేయి, కుకీల మధ్య. మైతేయిలకు షెడ్యూల్ తెగ (ST)హోదా ఇవ్వాలని ఆ రాష్ట్ర హైకోర్టు ఎప్పుడైతే ప్రభుత్వానికి సూచించిందో అప్పటి నుంచి నిప్పు రాజుకుంది. అది క్రమంగా రాష్ట్రాన్ని మంటల్లోకి నెట్టేసింది.
ఇప్పుడు ST హోదా అనేది కేవలం ఓ కారణమే అయినా...మైతేయిలకు, కుకీలకు ఎప్పటి నుంచో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మైతేయి తెగ అధీనంలోనే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందని కుకీలు చాలా గట్టిగా నమ్ముతున్నారు. ఇందులో నిజానిజాలెంత అన్నది పక్కన పెడితే వాళ్లలో ఈ ఆలోచన బలంగా నాటుకుపోయింది. తమపై వివక్ష చూపిస్తున్నారని మండిపడుతున్నారు కుకీలు. "మా భూములు బలవంతంగా లాక్కుంటున్నారు. మమ్మల్ని రాష్ట్రం నుంచి వెళ్లగొడుతున్నారు" అని పలు సందర్భాల్లో కుకీలు ఆందోళన వ్యక్తం చేశారు. కొండ ప్రాంతంలో కుకీలదే మెజార్టీ. అక్కడ మైతేయి వర్గ ఆధిపత్యాన్ని అసలు సహించరు కుకీలు. మైతేయిలకు ST హోదా వస్తే ఈ కొండ ప్రాంతాల్లోని భూములనూ కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది. అంటే తమ "ఉనికి" కోల్పోతామని కుకీలకు భయం పట్టుకుంది. ఈ భయం నుంచే ఘర్షణ మొదలైంది.