Chandrayaan 3 Update: భారత అంతరిక్షణ పరిశోధన సంస్థ- ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మంగా చేపట్టిన ప్రయోగం చంద్రయాన్-3. జులై 14వ తేదీన శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగం కేంద్రం నుంచి నింగిలోకి దూసుకెళ్లింది చంద్రయాన్-3. జులై 20, 2023 న 4వ కక్ష్యలోకి ప్రవేశించింది. ప్రస్తుతం భూమి చుట్టూ 71351కి.మీ X 233 కి.మీ కక్ష్యలో చంద్రయాన్ -3 పరిభ్రమిస్తున్నట్లు ఇస్రో ధృవీకరించింది. క్రమంగా కక్ష్యను పెంచుకుంటూ ప్రణాళికాబద్ధంగా ప్రయోగం సాగుతున్నట్లు ఇస్రో ప్రకటించింది. జులై 14వ తేదీన ప్రయోగం చేపట్టగా.. జులై 15వ తేదీన మొదటి కక్ష్యలోకి చేరుకుంది. జులై 16వ తేదీన రెండో కక్ష్యలోకి ప్రవేశించింది. జులై 18వ తేదీన మూడోది, జులై 20వ తేదీన 4వ కక్ష్యలోకి ప్రవేశించి భూమి చుట్టూ పరిభ్రమిస్తోంది చంద్రయాన్-3. ఒక్కో కక్ష్యలోకి ప్రవేశించే సమయంలో ఇంజిన్ ను కాస్తంత ఎక్కువగా మండించి క్రమంగా భూమి నుంచి దూరం జరుగుతూ వస్తోంది. 


చంద్రయాన్-3 తదుపరి దశ ఏంటంటే..


4వ కక్ష్యలో పరిభ్రమిస్తున్న చంద్రయాన్-3 తదుపరి దశ 5వ కక్ష్యలోకి ప్రవేశించడం. జులై 25వ తేదీన మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య ఈ కక్ష్య మార్పు జరగనుంది. ప్రణాళికబద్ధంగా ఈ కక్ష్య మార్పు చేపట్టనున్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ చివరాఖరి కక్ష్యలో పరిభ్రమించిన తర్వాత స్పేస్‌క్రాఫ్ట్ ఇంజిన్ ను మండించి, వేగాన్ని పెంచి.. భూగురుత్వాకర్షణ పరిధి నుంచి చంద్రుని గురుత్వాకర్షణ పరిధిలోకి ప్రవేశింపజేస్తారు. ఆ తర్వాత చంద్రుని గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించుకుంటూ.. క్రమంగా కక్ష్యలు మార్చుకుంటూ చంద్రుడికి చేరువగా వెళ్తుంది చంద్రయాన్-3. చంద్రుడి ఉపరితలానికి 30 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లిన తర్వాత అసలు పరీక్ష ప్రారంభమవుతుంది. దక్షిణ ధృవ ప్రాంతంలో సాఫ్ట్- ల్యాండింగ్ చేపట్టనున్నారు. 


అనుకున్నది అనుకున్నట్లు ప్రణాళికబద్ధంగా జరిగితే చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాల్గోదేశంగా భారత్ నిలవనుంది. రష్యా, అమెరికా, చైనా తర్వాత చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన 4వ దేశంగా భారత్ రికార్డులకెక్కనుంది. 


ఈ నెల 30న పీఎస్ఎల్వీ సీ56 ప్రయోగం చేపట్టనున్న ఇస్రో


భారత అంతరిక్షణ పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధం అవుతోంది. ఈ నెల 30వ తేదీన పీఎస్ఎల్వీ సీ56 ప్రయోగాన్ని చేపట్టేందుకు అన్ని సిద్ధం చేసింది. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఈ నెల 30వ తేదీన ఉదయం 6.30 గంటలకు ఈ ప్రయోగం చేపట్టనుంది. ఈ ప్రయోగం ద్వారా సింగపూర్ కు చెందిన డీఎస్-ఎస్ఏఆర్ శాటిలైట్ తో పాటు మరో ఆరు ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్నట్లు ఇస్రో సోమవారం ప్రకటించింది. సింగపూర్ ప్రభుత్వ ఏజెన్సీలకు ఉపగ్రహ ఛాయాచిత్రాల అవసరాల నిమిత్తం డీఎస్-ఎస్ఏఆర్ ను ప్రయోగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. డీఎస్-ఎస్ఏఆర్ తోపాటు టెక్నాలజీ డెమాన్ స్ట్రేషన్ మైక్రో శాటిలైట్ వెలాక్స్-ఏఎం, ఎక్స్‌పెరిమెంటల్ శాటిలైట్ ఆర్కేడ్, 3యూ నానోశాటిలైట్ స్కూబ్-2, ఐవోటీ కనెక్టివిటీ నానోశాటిలైట్ నూలయన్, గలాసియా-2, ఓఆర్బీ-12 స్ట్రైడర్ శాటిలైట్లను కూడా రోదసిలోకి పంపనుంది ఇస్రో.