Palnadu News: పల్నాడు జిల్లా అచ్చంపేట అంబడిపూడి కృష్ణా నదిలో గ్రామస్థులు పురాతన విగ్రహాలను గుర్తించారు. నది గర్భంలో విష్ణుమూర్తి, శివలింగంతో పాటు రెండు నందుల రాతి విగ్రహాలు బయట పడ్డాయి. కృష్ణానది ఎగువ భాగం నుంచి కొట్టుకుని వచ్చాయా లేక ఇసుక తవ్వకాల వల్ల నది అడుగు భాగాన ఉన్న శిలలు ప్రస్తుతం బయటపడ్డాయా అనే విషయం తెలియాల్సి ఉంది. రక్షిత మంచినీటి పథకం కాలువ వద్దకు చేర్చిన విగ్రహాలను తిలకించెందుకు గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. కొందరు అయితే ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కొబ్బరి కాయలు తీసుకొచ్చి దేవుళ్లకు కొడుతున్నారు. నది పక్కనే వాటికి గుడి కట్టిస్తే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా తమ గ్రామ ప్రజల కోసమే దేవుడు కొలువుదీరాడంటూ కొందరు చెప్పుకొస్తున్నారు. ఈ దేవుళ్ల రాకతో తమ గ్రామం చల్లగా ఉంటుందని మరికంత మంది అంటున్నారు. ఏది ఏమైనా ఈ విగ్రహాలు ఇక్కడకు ఎలా వచ్చాయో తెలియాలంటే పురావస్తు శాఖ అధికారులు రావాల్సిందే. వారు వచ్చి విగ్రహాలను తీసుకెళ్తారా లేక గ్రామస్థులే ఈ విగ్రహాలను ప్రతిష్టించి ప్రత్యేకంగా ఆలయం నిర్మిస్తారా అనేది తెలియాలంటే ఇంకా కొంత కాలం వేచి చూడాల్సిందే.
ఇటీవలే తెలంగాణలో సీతారాముల విగ్రహాలు వెలుగులోకి
మంచిర్యాల జిల్లా జిల్లాలో అరుదైన సంఘటన జరిగింది. జన్నారం మండల కేంద్రంలోని తపాలపూర్ చెక్ పోస్ట్ దగ్గర ఉపాధి హామీ పనుల్లో భాగంగా శుక్రవారం ఉదయం పని చెయ్యడానికి వెళ్లిన స్థానికులకు శ్రీరాముడు సీతాదేవి విగ్రహాలు మట్టి తవ్వుతుంటే దొరికాయి. ఇట్టి విషయాన్ని అదే గ్రామానికి చెందిన యువకులు సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల ప్రజలు ఆ విగ్రహాలని చూడడానికి వెళ్ళారు.
అక్కడ అంతా హడావుడి ఉండటంతో విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు విగ్రహాలను పరిశీలించారు. పంచనామా నిర్వహించి, లా అండ్ ఆర్డర్ సమస్య ఉన్నందున భద్రత నిమిత్తం తపాలాపుర్ లోని శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో భద్రపరచడం జరిగిందని తహసిల్దార్ కిషన్ తెలిపారు. అయితే ఈ విషయం మీద నిజాం కాలేజీ హిస్టరీ విద్యార్థి, ప్రైవేట్ పురావస్తు పరిశోధకులు నితిన్ మాట్లాడుతూ.. ఇట్టి విగ్రహాల విషయం విశ్వసనీయవర్గాల సమాచారం వచ్చిందని, ఆ విగ్రహాలు పంచలోహ విగ్రహాలుగా అనుమానం ఉంది. వెంటనే ఆ విగ్రహాలను ప్రభుత్వ పురావస్తు శాఖ అధికారులు స్వాధీనం చేసుకుని పూర్తి అధ్యయనం చేయాలని అన్నారు.
భూమి తవ్వుతుండగా.. విగ్రహాలు వెలుగులోకి
తపాలపూర్ చెక్ పోస్ట్ వద్ద ఉపాధి హామీ కూలీలు పని చేస్తుండగా ఒక్క సారిగా ఏదో తగిలినట్టు అనిపించింది. దాంతో ఏంటో చూద్దామని మరికొంచెం లోతుకు తవ్వగా రెండు విగ్రహాలు ఉపాధి హామీ కూలీలకు కనిపించాయి. విగ్రహాలను బయటికి తీసి చూడగా సీతారాములను పోలినట్లు గుర్తించారు. ఆ విగ్రహాలు 16వ శతాబ్దం నాటి సీతారాముల విగ్రహాలు అయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇలా ఏదో ఓ చోట దేవుళ్ల విగ్రహాలు మన దేశంలో దొరుకుతూనే ఉంటాయి.