AP CM Jagan: ఉండేందుకు ఇళ్లు లేని ప్రజలకు స్థలాలు ఇస్తామని, ఇళ్లు కట్టిస్తామని ముందుకెళ్తుంటే అడుగడుగునా అడ్డు తగిలిన ప్రబుద్ధులు కొంతమంది ఉన్నారంటూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు, దత్త పుత్రుడు పవన్ కల్యాణ్, టీవీ5, ఈనాడు, ఆంధ్రజ్యోతి.. ఇలా అంతా కలిసి పేదలకు ఇళ్లు రాకుండా చాలానే కష్టపడ్డారని ఆరోపించారు. ఇంతటి దౌర్భాగ్య స్థితి ఒక్క ఆంధ్రరాష్ట్రంలో తప్ప మరెక్కడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు కృష్ణాయపాలెంలో ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి పట్టాలు అందించారు. అలాగే మోడల్ హౌస్‌లను పరిశీలించారు. వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటి పైలాన్ ను ఆవిష్కరించారు. అనంతరం వెంకటపాలెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఈరోజు రాష్ట్ర చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచిపోయే రోజు అని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు పేదలందరికీ ఈరోజు చాలా ప్రత్యేకమైనదని చెప్పుకొచ్చారు. ఇది శత్రువులపై పేదలు సాధించిన విజయం అంటూ వ్యాఖ్యానించారు. 


గతంలో చంద్రబాబు నాయుడు పేదలకు ఇళ్లు కట్టిస్తానని చెప్పి మోసం చేశారని ఏపీ సీఎం జగన్ గుర్తు చేశారు. హామీలు నెరవేర్చకపోయినా పర్లేదు కానీ.. అతను చేయని పనులను వైసీపీ ప్రభుత్వం చేస్తుంటే అడ్డు తగులుతున్నారని ఫైర్ అయ్యారు. పేదలకు ఇళ్లు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు దాకా వెళ్లి మరీ ప్రయత్నించారని అన్నారు. ఇలాంటి పరిస్థితి మరెక్కడా రాకూడదని చెప్పారు. పేదల వ్యతిరేకులంతా కలిసి మొత్తం 18 కేసులు వేశారని.. పేద ప్రజల కోసం తాము మూడేళ్లు పోరాటం చేసి ఈ ఇళ్లు నిర్మించబోతున్నట్లు తెలిపారు. పేద ప్రజల కోసం ఏం చేస్తున్నా సపోర్ట్ చేయకుండా అడ్డు పుల్లలు వేసే వాళ్లు మీకు అవసరమా అంటూ సీఎం జగన్ ప్రజలను ప్రశ్నించారు. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీషు మీడియం తీసుకొస్తే కూడా వద్దని వారించారని గుర్తు చేశారు. అలాంటి వాళ్లంతా తమ పిల్లల్ని మాత్రం ప్రైవేటు బడుల్లో ఇంగ్లీషు మీడియంలోనే చదివించుకుంటారని అన్నారు. చంద్రబాబుకు పేదలు బాగుపడుతుంటే చూడడం అస్సలే ఇష్టం ఉండదంటూ తీవ్ర విమర్శలు చేశారు. 


పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తే రాజధాని అభివృద్ధి చెందదని చెప్పిన వాళ్లు కూడా చాలా మందే ఉన్నారని అన్నారు. రాజధానిలో పేదలు ఉండకూడదనే ఉద్దేశంతోనే ఇలాంటి కామెంట్లు చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాకే పేద ప్రజల స్థితిగతులు మారుతున్నాయని.. ముఖ్యంగా మహిళా సాధికారతకు చాలా ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. అక్కచెల్లమ్మల పేరిటే ఇళ్ల స్థలాలు అందజేస్తున్నామన్నారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.70 లక్షల ఖర్చు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. 793 ఇళ్ల నిర్మాణం కోసం రూ.1,370 కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు. అన్ని సౌకర్యాలతో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తున్నామని పేర్కొన్నారు. నాలుగేళ్లుగా ఎంతో మంచి చేశామన్నారు. మొత్తం రూ.1829.57 కోట్ల వ్యయంతో 50 వేల మందికి పైగా పేదలకు స్థిర నివాసాలు ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకోసం 1,402.58 ఎకరాల్లో 50,793 మంది పేదలకు ఉచితంగా ఇళ్ల పంపిణీ చేసేందుకు ఏపీ సర్కారు సిద్ధమైంది.