Pilli Subhash Chandra Bose vs Minister Venu: రామచంద్రపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  పంచాయితీ మరోసారి తాడేపల్లి వేదిక అయింది. పార్టీ మారతానంటూ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కామెంట్ చేయడంతో రాజకీయం రసవత్తరంగా మారింది..
సీఎం క్యాంప్ కార్యాలయం వేదికగా..
రామచంద్రపురం నియోజకవర్గంలో మంత్రి వేణు, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ ముందే రాజ్యసభ సభ్యుడు పిల్లి సుబాష్ చంద్రబోస్ తన వాదన వినిపించారు. ఎట్టి పరిస్థితుల్లో రామచంద్రాపురం నియోజకవర్గంలో తన కుమారుడికి సీటు కావాలని బోస్ స్వయంగా ముఖ్యమంత్రికి వివరించారు. అయితే మరోవైపు పార్టీ పరంగా మరోసారి మంత్రి చెల్లుబోయిన వేణుకు మాత్రమే సీటు ఉంటుందని పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డి వెల్లడించారు. దీనిపై సుభాష్ చంద్రబోస్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.


పార్టీ మారటంపై చర్చ...
మంత్రి వేణుకు మరోసారి రామచంద్రాపురం నియోజకవర్గ సీటును కేటాయించేందుకు పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోవటం పట్ల రాజ్యసభ ఎంపీ  పిల్లి సుభాష్ చంద్రబోస్ తీవ్ర అసహనంతో ఉన్నారు. అదే జరిగితే తాను ఇండిపెంటెండ్ గా అయినా సరే వచ్చే ఎన్నికల్లో రామచంద్రాపురం నుంచి బరిలోకి దిగుతానని బోస్ ప్రకటించారు. దీంతో అప్రమత్తం అయిన పార్టీ నాయకత్వం ప్రస్తుత పరిస్థితులపై అంచనాలు వేస్తోంది. పార్టీలో అత్యంత సీనియర్ గా ఉన్న బోస్ కు జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఎమ్మెల్సీ గా ఎంపిక చేసి ఆ తరువాత ఎవ్వరూ ఊహించని విధంగా రాజ్యసభకు పంపారు. అలాంటిది ఇప్పుడు పార్టి నాయకత్వానికి వ్యతిరేకంగా పిల్లి సుభాష్ చంద్రబోస్ వ్యాఖ్యలు చేయడం ఫ్యాన్ పార్టీలో కలకలం రేపుతోంది.


తాడేపల్లిలో పంచాయితీ..
బోస్ వ్యవహారంపై గోదావరి జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ మిదున్ రెడ్డితో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల సమావేశం అయ్యారు. రామచంద్రపురం నియోజకవర్గంలో పరిస్తితుల పై ఇరువురు నేతలు చర్చించారు. మంత్రి చెల్లుబోయిన వేణుకు సీటు ఇస్తే పార్టిలో కూడ ఉండబోనని, స్వతంత్ర అభ్యర్దిగా బరిలోకి దిగుతానంటూ పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రకటన వెనుక కారణాలు గురించి నేతలు ఆరా తీస్తున్నారు. ఈ వ్యవహరం సీరియస్ గా మారటంతో మరోసారి ముఖ్యమంత్రి జగన్ ముందే పంచాయితీ పెట్టాలని నాయకులు భావిస్తున్నారు. రామచంద్రపురం నియోజకవర్గం నుంచి మూడు సార్ల శాసన సభ్యుడిగా గెలుపొందిన తోట త్రిమూర్తులు, మిథున్ రెడ్డికి జగన్ పూర్తి స్థాయి భాద్యతలను అప్పగించారని అంటున్నారు. 


ఇలా అయితే ఎలా..
పిల్లి సుభాష్ చంద్రబోస్ కు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఎమ్మెల్సీ పదవి నుండి నేరుగా రాజ్యసభకు సైతం పంపారు. ఎమ్మెల్సీ స్దానాలను రద్దు చేయాలని జగన్ తీసుకున్న నిర్ణయం తరువాత బీసీ వర్గానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఎవ్వరూ ఊహించిన విధంగా పిల్లిని రాజ్య సభకు జగన్ ఎంపిక చేయటం సంచలనం అయ్యింది. పిల్లి వంటి సీనియర్ నేతలు, జగన్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా నోరు విప్పటం కూడా ఇప్పుడు చర్చనీయాశంగా మారింది.