CRDA Amaravati: నిరుపేద ప్రజల సొంతింటి కల సాకారానికి ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. అమరావతిలోని సీఆర్డీఏ పరిధిలో నిర్మించబోతున్న 50 వేలకుపైగా ఇళ్ల నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. వనమహోత్సవంలో భాగంగా మొక్కలు కూడా నాటారు. కృష్ణాయపాలెం లేఅవుట్‌లో పైలాన్‌ను కూడా ఆవిష్కరించారు. దీని తర్వాత ముఖ్యమంత్రి గుంటూరు పర్యటనకు బయలుదేరారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
పేదలకు మేలు చేయాలన్న స్థిర సంకల్పంతో సీఎం జగన్ నేడు ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. అలాగే ఎంపీ నందిగాం సురేష్ మాట్లాడుతూ.. పేదల సొంతింటి కల నెరవేరిందన్నారు. పెత్తందార్ల ఓటమికి, పేదవాడి విజయానికి ఇది నిదర్శనం అన్నారు. రాజధానిలో పేద ప్రజలు ఉండకూడదనేది చంద్రబాబు కుట్ర అని ఆరోపించారు.
సీఆర్డీఏ పరిధిలో 1,402.58 ఏకరాల్లో మొత్తం 25 లేఅవుట్ లు నిర్మించి 50 వేల 793 మంది పేద ప్రజలకు ఈ ఏడాది మే 26వ తేదీన ఉచితంగా ఇళ్ల పట్టాలు అందించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఒక్కో ప్లాట్ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల విలువ చేసే రూ.1,371.41 కోట్ల ఖరీదైన భూమిని పేదలకు ఉచితంగా పంపిణీ చేయడమే కాకుండా ఆయా లేఅవుట్లలో రూ.384.42 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించబోతున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. విద్య, ఆరోగ్య సేవలు అందించేందుకు రూ.73.74 కోట్లతో 11 అంగన్వాడీ కేంద్రాలు, 11 పాఠాలలు, 11 డిజిటల్ లైబ్రరీలు, 12 ఆస్పత్రుల నిర్మాణం కూడా చేపట్టనున్నట్టు తెలిపింది. లేఅవుట్ల పరిధిలో పచ్చదనాన్ని పెంపొందించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసేందుకు రెండు దశల్లో రూ.1.68 లక్షలతో 28 వేల మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు తీసుకోనున్నారు. ఇళ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల ఏర్పాటుతో ఒక్కో పేద అక్కచెల్లమ్మ చేతుల్లో దాదాపు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలకు పైగా విలువైన స్థిరాస్తిని పెట్టబోతుంది. ఈ లెక్కన ఏపీ గృహ నిర్మాణ సంస్థ ద్వారా సీఆర్డీఏలోని ఈడబ్ల్యూఎస్ లేఅవుట్లలో రూ.1,829.57 కోట్ల వ్యయంతో పేదలకు పక్కా గృహాలను సమకూరుస్తోంది.