Andaman Airport: అండమాన్ పోర్ట్ బ్లెయిర్ లోని వీర్ సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్ని కొన్ని రోజుల క్రితం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇటీవల కురిసిన వర్షానికి ఈ టెర్మినల్ ఫాల్స్ సీలింగ్ ఊడిపోయింది.
ఈ అంశంపై బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. విమానాశ్రయ సీలింగ్ వర్షానికి ఊడిపోవడంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. దీనిపై స్పందించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా జైరాం రమేష్ కు కౌంటర్ ఇచ్చారు. సీసీటీవీల ఏర్పాటు కోసం ఉద్దేశపూర్వకంగానే సీలింగ్ ను లూజ్ చేసినట్లు సింధియా తన ట్వీట్ లో పేర్కొన్నారు.
జైరాం రమేష్ తన ట్వీట్ లో 'ఈ రోజుల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ఏదైనా కట్టడం, నిర్మాణం అసంపూర్తిగా ఉన్నా, నాసిరకమైన మౌలిక సదుపాయాలతో నిర్మించినా.. వాటిని ప్రారంభిస్తున్నారు' అంటూ గాలికి ఊగుతున్న ఫాల్స్ సీలింగ్ ప్యానెల్ వీడియోను పోస్టు చేశారు. జైరాం రమేష్ ట్వీట్ పై తాజాగా జ్యోతిరాదిత్య సింధియా ట్విట్టర్ వేదికగానే స్పందించారు. 'తదుపరి సారి 'తదుపరి సారి.. ఏమీ లేకున్నా సంచలనాల కోసం ప్రయత్నించే ముందు వివరణ అడగండి' అంటూ ట్వీట్ చేశారు. ఈ ఫాల్స్ సీలింగ్ నిర్మాణం టెర్మినల్ వెనక బయట ఉందని, అలాగే సీసీటీవీల ఏర్పాటు కోసం ఉద్దేశపూర్వకంగానే ఫాల్స్ సీలింగ్ లో కొత్త భాగాన్ని వదులు చేసినట్లు చెప్పుకొచ్చారు. భారీ గాలుల (సుమారు 100 కి.మీ/గం) వల్ల ఫాల్స్ సీలింగ్ ప్యానెళ్లు ఊగిపోయినట్లు చెప్పుకొచ్చారు. ఏమీలేని చోట సంచలనాల కోసం వెంపర్లాడే ముందు వివరణ తీసుకోవాలంటూ ట్విట్టర్ పోస్టులో రాసుకొచ్చారు.