Manipur Violence:
విదేశీ కుట్ర..
మణిపూర్ హింసాకాండపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న క్రమంలో ఆర్మీ మాజీ చీఫ్, జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అల్లర్లలో విదేశీ కుట్ర ఉందన్న అనుమానం వ్యక్తం చేశారు. విదేశీ కుట్ర ఉందన్న ఆరోపణల్ని కొట్టిపారేయలేమని తేల్చి చెప్పారు. దేశ సరిహద్దుల్లోని రాష్ట్రాల్లో శాంతి భద్రతలు అదుపు తప్పడం దేశ భద్రతకు మంచిది కాదని అన్నారు రిటైర్డ్ జనరల్ ఎమ్ఎమ్ నరవణే. అంతే కాదు. మణిపూర్‌లో ఇలా తగలబడిపోవడానికి కారణం చైనా కూడా ఓ కారణమై ఉండొచ్చని ఆరోపించారు. భారత్‌లో అంతర్గతంగా ఇలాంటి అల్లర్లు సృష్టించాలని కావాలనే చైనా కుట్రు చేసే అవకాశాలున్నాయని అన్నారు. ఢిల్లీలో India International Centerలో దేశ భద్రతా అంశాలపై మాట్లాడిన ఆయన..ఈ వ్యాఖ్యలు చేశారు.
"మణిపూర్‌లో విదేశీ కుట్ర ఉందన్న ఆరోపణల్ని తీసిపారేయలేం. ముఖ్యంగా చైనా ఈ విషయంలో జోక్యం చేసుకుంటుందన్న అనుమానం ఉంది. ఏదేమైనా సరిహద్దు ప్రాంతాల్లోని రాష్ట్రాల్లో ఇలాంటి దారుణాలు జరగడం మన దేశ భద్రతకు మంచిది కాదు. అధికారంలో ఉన్న ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల్ని తీసుకుంటోంది. అక్కడ శాంతిని నెలకొల్పేందుకు చేయాల్సిన ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఇదంతా విదేశీ సంస్థల కుట్రేననడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక్కడి అతివాద సంస్థలకు చైనా సాయం అందిస్తోంది. చాలా సంవత్సరాలుగా ఇదే చేస్తోంది"
- మనోజ్ ముకుంద్ నరవణే, ఆర్మీ మాజీ చీఫ్, జనరల్
భద్రత అందరి బాధ్యత..
దేశభద్రతపై ప్రతి పౌరుడికీ బాధ్యత ఉంటుందని తేల్చి చెప్పిన నరవణే...మణిపూర్‌లో చాలా ఏళ్లుగా డ్రగ్ ట్రాఫికింగ్ జరుగుతోందని వెల్లడించారు. కొన్నేళ్లుగా ప్రభుత్వం ఈ దందాను నియంత్రించేందుకు గట్టిగానే కృషి చేస్తోందని చెప్పారు. మయన్మార్‌లో ఆర్మీ రూల్ కారణంగానే డ్రగ్ ట్రాఫికింగ్ బాగా పెరిగిపోయిందని...అది మణిపూర్‌లోని ప్రభావం చూపిస్తోందని అభిప్రాయపడ్డారు.