రెండు వారాల విరామంతో ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఆదివారం ఉదయం ఏడు సింగపూర్ ఉపగ్రహాలతో కూడిన రాకెట్ ప్రయోగించనుంది. ఈ మేరకు శ్రీహరికోట రాకెట్ పోర్టులో శనివారం ఉదయం 5.01 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. ఆదివారం ప్రయోగించే ఈ రాకెట్ మిషన్ 2023లో ఇస్రోకు మూడో వాణిజ్య మిషన్ అవుతుంది. భారత అంతరిక్ష సంస్థ తన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్‌ఎల్‌వీ)ని ఉపయోగించి జూలై 30 ఆదివారం ఉదయం 6.30 గంటలకు ఏడు సింగపూర్ ఉపగ్రహాలను ప్రయోగించనుంది. మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. మిషన్ విజయవంతం అయితే ఇస్రో రికార్డు సృష్టించనుంది. 1999 నుంచి 36 దేశాలకు చెందిన 431 విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించినట్లు రికార్డులకు ఎక్కుతుంది. 


2023లో ఏడాది వెనక్కి తిరిగి చూసుకుంటే ఇస్రో ఇప్పటికే రెండు వాణిజ్య ప్రయోగాలను విజయవంతంగా ప్రయోగించింది. మొదటిది మార్చిలో LVM3 రాకెట్‌తో UK ఆధారిత వన్‌వెబ్‌కు చెందిన 36 ఉపగ్రహాలను ప్రయోగించింది. ఏప్రిల్‌లో రెండో ప్రయోగం చేసింది. PSLV రాకెట్‌తో సింగపూర్ TeLEOS-2, Lumilite-4 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.  మూడో ప్రయోగం ఆదివారం జరిగే మూడో ప్రయోగంలో  PSLV-C56 కోడ్‌తో కూడిన PSLV రాకెట్ సింగపూర్‌కు చెందిన 360 కిలోల బరువున్న DS-SAR ఉపగ్రహాన్ని తీసుకెళ్లనుంది. దానితో పాటు మరో చిన్న ఉపగ్రహాలను ప్రయోగించనుంది. ఇందులో నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీకి చెందిన వెలాక్స్-AM, ARCADE, SCOOB-II, NuSpace Pte Ltdకి చెందిన NuLION, నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్‌‌కు చెందిన Galassia-2,  Aliena Pte సంస్థకు చెందిన ORB-12 STRIDER ఉపగ్రహాలు ఉన్నాయి. 


PSLV-C56 రాకెట్ ప్రారంభ ఫ్లైట్ దశలో కోర్-అలోన్ మోడ్‌లో కాన్ఫిగర్ చేసినట్లు ఇస్రో తెలిపింది. ఇది DS-SAR ఉపగ్రహాన్ని 5 డిగ్రీల వంపుతో 535 కి.మీ ఎత్తులో నియర్-ఈక్వటోరియల్ ఆర్బిట్ (NEO)లోకి ప్రవేశపెడుతుంది. DS-SAR ఉపగ్రహాన్ని DSTA(సింగపూర్ ప్రభుత్వ సంస్థ), ST ఇంజనీరింగ్ మధ్య భాగస్వామ్యంతో అభివృద్ధి చేశారు. విజయవంతం అయితే సింగపూర్ ప్రభుత్వంలోని వివిధ ఏజెన్సీలకు ఉపగ్రహ చిత్రాలను అందిస్తుంది. ST ఇంజనీరింగ్ సంస్థ వారి వాణిజ్య వినియోగదారులకు బహుళ-మోడల్ చిత్రాలు, జియోస్పేషియల్ సేవలను దీని ద్వారా అందించనుంది. DS-SAR ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ (IAI)చే అభివృద్ధి చేయబడిన సింథటిక్ ఎపర్చరు రాడార్ (SAR) పేలోడ్‌ను కలిగి ఉంటుంది. ఇది రోజులో అన్ని వాతావరణ వివరాలు  అందిస్తుంది.  


మరోవైపు, VELOX-AM, 23 కిలోల సాంకేతిక ప్రదర్శన మైక్రోసాటిలైట్. ARCADE ఒక ప్రయోగాత్మక ఉపగ్రహం. SCOOB-II, 3U నానోశాటిలైట్లు ఎగురగలిగే సాంకేతికత ఉన్నవి.  NuLION  పట్టణ & మారుమూల ప్రాంతాలకు అవాంతరాలు లేకుండా నిరంతరాయంగా IoT కనెక్టివిటీని అందించే అధునాతన 3U నానోశాటిలైట్. గెలాసియా-2 సైతం మరో 3U నానోశాటిలైట్, ఇది తక్కువ భూ కక్ష్యలో తిరుగుతుంది.  ORB-12 STRIDER ఉపగ్రహం అంతర్జాతీయ సహకారంతో అభివృద్ధి చేయబడింది. రెండు వారాల వ్యవధిలో ఇస్రో రెండో ప్రయోగం చేపడుతోంది. జులై 14  ఇస్రో రాకెట్ LVM3 చంద్రయాన్-3 అంతరిక్ష నౌకను కక్ష్యలోకి ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. సింగపూర్ ఉపగ్రహాలను ప్రయోగించడానికి న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (NSIL) అంతరిక్ష శాఖ వాణిజ్య విభాగం PSLV-C56 రాకెట్‌ను కొనుగోలు చేసింది. 


దీని తరువాత ఇస్రో మరో గ్రహాంతర మిషన్ చేపట్టనుంది.  సౌర వాతావరణాన్ని అధ్యయనం చేసేందుకు ఇస్రో తన ఆదిత్య ఎల్1 అనే  ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌లో ఆగస్టు చివరి నాటికి పంపనుంది. ISRO ప్రకారం సౌరవ్యవస్థలో సూర్య, భూమి మధ్య దూర ప్రాంతం L1 చుట్టూ ఒక కక్ష్యలో ఈ ఉపగ్రహాన్ని ఉంచనున్నారు. L1 పాయింట్ చుట్టూ ఉన్న ఈ ఉపగ్రహం  సూర్యుడిని నిరంతరం పరిశీలిస్తుంది. చంద్రయాన్-3 స్పేస్‌క్రాఫ్ట్ మోసుకెళ్తున్న ల్యాండర్‌ను చంద్రుడి నేలపై ల్యాండ్ చేసిన తరువాత కొద్ది రోజులకే  ఆదిత్య ఎల్1 మిషన్ జరగనుంది. ఆ తర్వాత అన్వేష ఉపగ్రహం, XPoSATలను ఇస్రో స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (SSLV) ద్వారా ఎక్స్-రే పొలారిమీటర్ శాటిలైట్ కక్ష్యలో ప్రవేశపెడతారు. 


ఇది దేశం కోసం అంకితమైన పోలారిమెట్రీ మిషన్ అని ప్రభుత్వం తెలిపింది.  ప్రకాశవంతమైన ఖగోళ ఎక్స్-రే మూలాల గతిశీలతను అధ్యయనం చేయడానికి దీనిని ఉపయోగిస్తారు.  PSLV రాకెట్‌లో రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహం- RISAT-1B  ప్రయోగాన్ని 2023 రెండవ భాగంలో ప్రయోగించనున్నారు. GSLVతో INSAT-3DS, రెండు IDRSS ఉపగ్రహాలను కక్ష్యలో ఉంచాలని ఇస్రో యోచిస్తోంది. ఈ రాకెట్ మిషన్లు కాకుండా, ఇస్రో మొదటి మానవ రహిత అంతరిక్ష మిషన్ కోసం దాని LVM3 రాకెట్‌లోకి వెళ్లే వివిధ వ్యవస్థలను పరీక్షిస్తోంది.