Manipur Viral Video: 



మణిపూర్ వైరల్ వీడియో కేసులో సీబీఐ FIR నమోదు చేసింది. రెండ్రోజుల క్రితమే సుప్రీంకోర్టులో కేంద్రం ఓ అఫిడవిట్ దాఖలు చేసింది. ఇకపై ఈ కేసుని CBI విచారిస్తుందని అందులో పేర్కొంది. ఇప్పుడు అధికారికంగా FIR నమోదు చేసింది. ఈ నెల 27వ తేదీన కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి అఫిడవిట్ సమర్పించింది. ఈ కేసుని సీబీఐ విచారిస్తుందని వెల్లడించింది. మహిళలపై ఇలాంటి అఘాయిత్యాలను సహించేది లేదని తేల్చి చెప్పింది. వీలైనంత వేగంగా ఈ కేసుని విచారించేలా చూడాలని కేంద్ర హోంశాఖ సుప్రీంకోర్టుని విజ్ఞప్తి చేసింది. మణిపూర్‌లో కాకుండా వేరే రాష్ట్రానికి కేసుని బదిలీ చేసి విచారణ కొనసాగించాలని కోరింది. మే 4న ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో ఇటీవలే వెలుగులోకి వచ్చి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సర్వోన్నత న్యాయస్థానం...ఈ కేసుని సుమోటోగా స్వీకరించింది. ఈ కేసుని 28వ తేదీనే విచారించాల్సి ఉన్నా...CJI అందుబాటులో లేకపోవడం వల్ల వాయిదా పడింది. అయితే...ఇప్పటికే చీఫ్ జస్టిస్ చంద్రచూడ్‌, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం కేంద్రానికి నోటీసులు ఇచ్చింది. మణిపూర్ ప్రభుత్వానికీ నోటీసులు పంపింది. వైరల్ వీడియో కేసులో నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆదేశించింది. ఇప్పటి వరకూ ఈ కేసులో ఏడుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. INDIA కూటమికి చెందిన 21 మంది ఎంపీలు మణిపూర్ పర్యటనకు వెళ్లిన నేపథ్యంలోనే CBI FIR నమోదు చేయడం ఆసక్తికరంగా మారింది.