ముఖ్యమంత్రి ఇంటికి ఎదురుగానే ఇల్లు. ఇక పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు కదా. ఇంటి చుట్టూ గన్‌మెన్లు, సెక్యూరిటీ, సీఎం కోసం వచ్చే వారు, వెళ్లే వారు నిత్యం రద్దీగానే ఉంటుంది. ముఖ్యమంత్రిని కలిసేందుకు పెద్ద పెద్ద కార్లులో మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, పార్టీ నేతలు ప్రముఖులు వస్తూనే ఉంటారు. అలాంటి వారితో ఆ ప్రాంతంలో ఎప్పుడు సందడిగానే ఉంటుంది. దీంతో చుట్టుపక్కల వారి ఇళ్ల ముందు కార్లు క్యూలో ఉంటాయి. వాటితో ఆ ఇంట్లో వారు బయటకు రాకుండా బంధించినట్లు ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇబ్బందికరంగానే ఉంటుంది కదా. సాధారణంగా ఎక్కువ శాతం మంది సీఎంతో మనకు ఎందుకులే అనుకుంటూ వారిని ఏం అనకుండా తమ పని చూసుకుంటూ ఉంటారు. అయితే అందరిలా కాకుండా సీఎం ఇంటి ముందు నివసించే ఓ వ్యక్తి ఏకంగా తనకు కలుగుతున్న ఇబ్బందిని ముఖ్యమంత్రిని వివరించేందుకు సీఎం కాన్వాయ్‌నే ఆపేస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇలాంటి పరిస్థితే కర్ణాటక సీఎం సిద్ధారామయ్య ఇంటి పక్కనే ఉంటుున్న వ్యక్తికి ఎదురైంది. దీంతో సమస్య పరిస్కరించాలని సీఎం కాన్వాయ్‌ను అడ్డుకున్నాడు.


బెంగళూరులో సీఎం సిద్ధరామయ్య నివసించే ఇంటికి ఎదురుగా నరోత్తమ్‌ అనే వృద్ధుడు ఉంటున్నాడు. సీఎం ఇంటికి వచ్చేవారి కారుల పార్కింగ్‌తో ఆయన సమస్య ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్తున్న సీఎం సిద్ధరామయ్య కాన్వాయ్‌ని నరోత్తం అడ్డుకున్నాడు. సెక్యూరిటీ సిబ్బంది ఆయను ఆపేశారు. సీఎంతో మాట్లాడాలని కోరడంతో అధికారులు అనుమతించారు. సీఎం దగ్గరికి వెళ్లిన నరోత్తమ్ తాను ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించాడు. సీఎం ఇంటికి వచ్చేవారు కార్లు, వాహనాలు ఇష్టం వచ్చినట్లు పార్కింగ్ చేయడంతో తనకు అసౌకర్యంగా ఉందని వాపోయాడు. తమ కార్లను ఇంటి నుంచి బయటికి తీయలేకపోతున్నామని, బయటి నుంచి ఇంట్లో పార్కింగ్ చేయలేకపోతున్నామని వాపోయాడు. కారు పార్కింగ్ చేసుకునేందుకు కూడా స్థలం ఉండడం లేదని గోడు వెళ్లబోసుకున్నాడు. ఐదేళ్ల నుంచి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వివరించాడు. ఇకపై భరించలేమని కార్లు, వాహనాల పార్కింగ్‌ సమస్యకు పరిష్కారం చూపాలని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సిద్దారామయ్య సైతం సానుకులంగా స్పందించాడు. తన ఇంటి చుట్టుపక్కల వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పార్కింగ్‌కు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.


ఇటీవల కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సిద్ధారామయ్య సీఎం అధికారిక నివాసానికి మారలేదు. ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు ఉన్న ఇంట్లోనే ప్రస్తుతం ఉంటున్నారు. ప్రభుత్వ అధికారిక బంగ్లాను మాజీ సీఎం యడియూరప్ప ఖాళీ చేయకపోవడంతో.. సిద్ధరామయ్య ప్రస్తుతం తన పాత ఇంట్లోనే నివాసం ఉంటున్నారు. ఇటీవలే యడియూరప్ప అధికారిక బంగ్లాను ఖాళీ చేశారు. దీంతో ఆగస్టు నెలలో సిద్ధరామయ్య అందులోకి మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.







ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial