Manipur Violence: 


జూన్ 4న ఘటన..


మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు కొంత వరకూ తగ్గినట్టే కనిపిస్తున్నా...ఇంకా కొన్ని చోట్ల ఉద్రిక్తత కొనసాగుతోంది. వీటిలో కొన్ని కేసులను CBI దర్యాప్తు చేస్తోంది. వీటిలో ఓ కీలక కేసు కూడా ఉంది. కుకీ, మైతేయి తల్లిదండ్రులకు జన్మించిన ఓ 7 ఏళ్ల చిన్నారిని, తల్లి, అత్తతో సహా కలిపి సజీవ దహనం చేశారు కొందరు ఆగంతకులు. ఇది రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఈ కేసుని సీబీఐ తన చేతుల్లోకి తీసుకుంది. మే 3వ తేదీన మణిపూర్‌లో హింస మొదలవ్వగా..ఇప్పటి వరకూ 160 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. వేలాది మంది సొంత ఊరు వదిలి పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. జూన్ 4వ తేదీన ఓ ఆంబులెన్స్‌ పోలీసుల ఎస్కార్ట్‌తో వెళ్తున్న క్రమంలో మూక దాడి జరిగింది. ఆ ఆంబులెన్స్‌లో ఏడేళ్ల చిన్నారితో పాటు ఆ బాలుడి తల్లి, అత్త ఉన్నారు. పోలీసులపై రాళ్లు రువ్విన ఆందోళనకారులు ఆంబులెన్స్‌కి నిప్పంటించారు. ఈ ఘటనలో అందులో ఉన్న ముగ్గురు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనకు సంబంధించి రెండు FIRలు నమోదయ్యాయి. ఒకటి పోలీసులు నమోదు చేయగా..మరోటి చిన్నారి తండ్రి ఇచ్చిన కంప్లెయింట్. హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. ఆంబులెన్స్‌కి నిప్పంటించినప్పుడు డ్రైవర్, నర్స్ ఎలాగోలా బయటపడినా...మిగతా ముగ్గురు మాత్రం అందులోనే చిక్కుకున్నారు. చూస్తుండగానే మంటల్లో కాలిపోయి బూడిదయ్యారు. తమను వెళ్లనివ్వాలని ఎంత వేడుకున్నా ఆ ఆందోళనకారులు ఏ మాత్రం జాలి చూపించలేదు. 


2 వేల మంది దాడి..! 


ఓ రిలీఫ్ క్యాంప్‌లో తలదాచుకున్న చిన్నారికి బులెట్ గాయమైంది. మైతేయి వర్గానికి చెందిన వాళ్లు జరిపిన కాల్పుల్లో గాయమైనట్టు కుటుంబ సభ్యులు చెప్పారు. వెంటనే ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడాలని చూశారు. కానీ మధ్యలోనే కొందరు అడ్డుకుని ఆంబులెన్స్‌ని తగలబెట్టారు. అప్పటికే పోలీసులు భద్రత కల్పించినప్పటికీ...ఒకేసారి 2 వేల మంది వచ్చి దాడి చేశారు. ఈ కేసుని సీబీఐ విచారించాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ఆ మేరకు దర్యాప్తు సంస్థ కేసుని టేకప్ చేసింది. 


ప్రభుత్వం నుంచి ఆ పార్టీ ఔట్..


మణిపూర్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత మూడు నెలల నుంచి హింసాత్మక ఘటనలతో అట్టుడుకున్న మణిపూర్ లో బైరెన్ సింగ్ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్డీయే సర్కారు నుంచి కుకీ పీపుల్స్ అలయెన్స్ పార్టీ బయటకు వచ్చేసింది. రావణకాష్టంలా మండుతున్న మణిపూర్ లో అల్లర్లను అదుపు చేయడంలో బైరెన్ సింగ్ ప్రభుత్వం విఫలమైందని పేర్కొంటూ KPA పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకుంది. మొత్తం 60 మంది సభ్యులు ఉన్న మణిపూర్ అసెంబ్లీలో కుకీ పీపుల్స్ అలయెన్స్ పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ మేరకు కేపీఏ పార్టీ అధ్యక్షుడు టాంగ్ మాంగ్ హోకిప్ మణిపూర్ గవర్నర్ అనసూయ ఉయికేకు లేఖ రాశారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను కూలంకషంగా పరిశీలించిన తర్వాత బిరెన్ సింగ్ ప్రభుత్వానికి మద్దతు కొనసాగించడం సాధ్యం కాదని పార్టీ నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకుంటున్నామని,  ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని గవర్నర్ కు రాసిన లేఖలో కేపీఏ పార్టీ పేర్కొంది. 


Also Read: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో సచిన్ పైలట్‌కి చోటు, రాజస్థాన్‌ రగడకు ఫుల్‌స్టాప్ పెట్టడానికేనా?