Chandrayaan 3 Landing Date Time:
భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగంపై మరో కీలక అప్ డేట్ వచ్చేసింది. చంద్రుడిపై చంద్రయాన్ 3 ల్యాండింగ్ జరగనున్న, డేట్, టైమ్ ను ఇస్రో శాస్త్రవేత్తలు నిర్ణయించారు. 23 ఆగస్టు సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు జాబిల్లిపై చంద్రయాన్ 3 ల్యాండర్ విక్రమ్ దిగనుంది. మద్దతుగా నిలిచిన, సక్సెస్ కావాలని ఆకాంక్షిస్తున్న అందరికీ ఇస్త్రో శాస్త్రవేత్తలు ధన్యవాదాలు తెలిపారు.
చంద్రయాన్-3 ప్రయోగంలో భాగంగా ఇటీవల ఆర్బిటర్ నుంచి విడిపోయిన ల్యాండర్ మాడ్యుల్ విక్రమ్‌కు రెండోసారి ఆఖరి డీబూస్టింగ్ ప్రక్రియను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) విజయవంతంగా చేపట్టింది. తాజా విన్యాసంతో ల్యాండర్ విక్రమ్ మాడ్యుల్ 25 కి.మీ x 135 కి.మీ. కక్ష్యకు తగ్గించారు. ఆగస్టు 19 అర్ధరాత్రి దాటాక (ఆగస్టు 20)న 1.50 ప్రాంతంలో ఈ డీబూస్టింగ్ ప్రక్రియ చేపట్టామని ఇస్రో వెల్లడించింది. జాబిల్లిపై దిగడానికి ముందు చెకింగ్ లో భాగంగా ఇక ల్యాండర్ మాడ్యుల్ విక్రమ్ అన్ని చెకింగ్ దశలను పూర్తి చేసుకుంది. చంద్రుడిపై సూర్యోదయం తర్వాత నిర్దేశిత ప్రాంతంలో ల్యాండ్ అవుతుందని ఇస్రో వర్గాలు చెబుతున్నాయి. ఆగస్టు 23న విక్రమ్ అనే ల్యాండర్ చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ అవుతుందని తెలిసిందే. అయితే సరిగ్గా 6.04 గంటల ప్రాంతంలో చంద్రయాన్ 3కి చెందిన విక్రమ్ అనే ల్యాండర్ జాబిల్లిపై అడుగు పెట్టనుందని ఆదివారం మధ్యాహ్నం ఇస్రో ప్రకటించింది.
ఆగస్టు 17న వేరుపడ్డ ల్యాండర్ విక్రమ్..
చంద్రయాన్ 3 లో కీలకమైన ల్యాండర్ మాడ్యుల్ విక్రమ్ ప్రొపల్షన్ మాడ్యుల్ నుంచి గురువారం (ఆగస్టు 17) విజయవంతంగా విడిపోయింది. ఈ ల్యాండర్ విక్రమ్ అప్పటినుంచి తనంతతానుగా చంద్రుని చుట్టూ పరిభ్రమిస్తూ మరింత దిగువ కక్ష్యలోకి వచ్చింది. విడిపోయేటప్పుడు ‘థ్యాంక్స్ ఫర్ ద రైడ్, మేట్’ అని ల్యాండర్ ప్రొపల్షన్ మాడ్యుల్ కి చెప్పినట్లుగా ఇస్రో వెల్లడించింది. చంద్రుడి 153x163 కిలో మీటర్ల కక్ష్యలో సపరేషన్ ప్రక్రియ జరగగా.. తాజాగా ఇస్రో చేసిన డీబూస్టింగ్ ప్రక్రియ అనంతరం 25 కి.మీ x 135 కి.మీ. కక్ష్యలోకి ల్యాండర్ విక్రమ్ చేరుకుని జాబిల్లికి అతి తక్కువ దూరానికి వచ్చింది.
ల్యాండర్ విక్రమ్ వేగం, ఎత్తు ఎలా తగ్గుతుంది?
ల్యాండర్ ఎత్తును, వేగాన్ని తగ్గించడానికి ఇస్రో శాస్త్రవేత్తలు దాని ఇంజన్లను మండిస్తారు వ్యతిరేక దిశలో మండడం వల్ల ల్యాండర్ కాస్త నెమ్మదిస్తుంది. ఈ క్రమంలో ల్యాండర్ నిర్దేశిత ప్రదేశానికి వచ్చిన తర్వాత జాబిల్లపై సాఫ్ట్ ల్యాండింగ్ దశ ప్రారంభం కానుంది. చంద్రయాన్ 2లో ఇక్కడే ప్రతికూల ఫలితం వచ్చింది. విక్రమ్ ల్యాండర్ చివరి నిమిషంలో సాఫ్ట్ ల్యాండ్ కాలేదు, తరువాత కనెక్షన్ కట్ అయింది. చంద్రయాన్ 3లోనూ ఇస్రోకు ఇది అత్యంత కష్టతరమైన దశ. చంద్రుడికి 25 నుంచి 30 కి.మీ ఎత్తులో ల్యాండర్ విక్రమ్ స్పీడ్ తగ్గుతూ.. నెమ్మదిగా చంద్రుడి ఉపరితలంపై దిగాలి. చంద్రుడిని తాకే సమయంలో ల్యాండర్ విక్రమ్ వర్టికల్ వెలాసిటీ సెకనుకు 2 మీటర్లు, హారిజాంటల్ వెలాసిటీ సెకనుకు 0.5 మీటర్ల కన్నా తక్కువగా ఉండేలా చేస్తే సాఫ్ట్ ల్యాండింగ్ సక్సెస్ అవుతుంది.