Congress Reshuffle:
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ..
లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కాంగ్రెస్ జోరు పెంచింది. గ్రౌండ్ లెవెల్ నుంచి కసరత్తులు మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC)లోనూ మార్పులు చేసింది. ఇందులో మొత్తం 39 మంది సభ్యుల పేర్లు ఖరారు చేసింది కాంగ్రెస్. వీరిలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే ఉన్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే...ఈ సభ్యుల్లో రాజస్థాన్ నేత సచిన్ పైలట్ ఉండడం. సొంత ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తూ హైకమాండ్‌ని ఇబ్బంది పెడుతున్న సచిన్ పైలట్‌ని వర్కింగ్ కమిటీ సభ్యుడిగా నియమించడం ఆసక్తికరంగా మారింది. మరో ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఉంది. కాంగ్రెస్ అధ్యక్ష రేసులో ఖర్గేతో పోటీ పడిన శశి థరూర్‌కీ ఈ కమిటీలో చోటు దక్కింది.
సీనియర్లకు పార్టీలో గౌరవం లేదంటూ 23 మంది లీడర్లు G23 పేరుతో సోనియా గాంధీకి లేఖ రాయడం అప్పట్లో సంచలనమైంది. ఇప్పుడు ఈ G 23 టీమ్‌లో ఉన్న లీడర్స్‌కీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో చోటిచ్చింది హైకమాండ్. నిజానికి చాలా కాలంగా ఈ కమిటీలో మార్పులు చేయాలని చూస్తోంది హైకమాండ్. ఇప్పుడు అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో సంస్కరణలు చేపట్టారు. అయితే...భారీ మార్పులు ఉంటాయని భావించినా...కొంత మేర మార్పులు చేశారు ఖర్గే. దీనిపై ఎన్నో నెలలుగా చర్చలు జరుగుతున్నాయి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో విడతల వారీగా చర్చలు జరిపిన మల్లికార్జున్ ఖర్గే...లిస్ట్‌ని ఫైనలైజ్ చేశారు. ఈ 39 మందిలో మన్మోహన్ సింగ్, ఏకే ఆంటోని, అంబికా సోని, అధిర్ రంజన్ చౌదరి, దిగ్విజయ్ సింగ్, చరణ్‌జిత్ సింగ్ చన్నీ, ఆనంద్ శర్మ కూడా ఉన్నారు. వీరితో పాటు 32 శాశ్వత సభ్యులు, 9 మంది ప్రత్యేక సభ్యులు, యూత్ కాంగ్రెస్, NSUI,మహిళా కాంగ్రెస్, సేవా దళ్ అధ్యక్షులకూ చోటు దక్కింది.
రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌గా సచిన్ పైలట్..?
సచిన్ పైలట్‌ని ఓ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌గానూ నియమించే అవకాశాలున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ మార్పులపై శశి థరూర్ స్పందించారు. మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ తనను నామినేట్ చేయడం చాలా సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు.
"కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో నన్ను నామినేట్ చేయడం చాలా గొప్ప విషయం. అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు హైకమాండ్ తీసుకున్న ఈ నిర్ణయం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. గత 138 సంవత్సరాలుగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కీలక పాత్ర పోషించింది. ఇంత చరిత్ర ఉన్న కమిటీలో చోటు దక్కడం గొప్ప విషయం. పార్టీకి ఎలాంటి సేవలు అందించడానికైనా సిద్ధంగా ఉన్నాను. లక్షలాది మంది కార్యకర్తల నిబద్ధత పార్టీని ముందుకు నడిపిస్తోంది"
- శశి థరూర్, కాంగ్రెస్ ఎంపీ