అనారోగ్యంతో ఉన్న తన భార్యను ఎండలో ఓ వృద్ధుడు బండిలో పడుకోబెట్టి లాక్కొని ఆసుపత్రికి తీసుకువెళ్తోన్న ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో ప్రభుత్వం దృష్టికి రావడంతో యూపీ డిప్యూటీ సీఎం బ్రజేశ్ పాతక్ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు.
ఏం జరిగింది?
బల్లియాలోని చిల్‌కర్ బ్లాక్ అందౌర్ గ్రామానికి చెందిన సకుల్ ప్రజాపతి.. తన భార్య జోగిని (55)ని మార్చి 28న ఆసుపత్రికి తీసుకువెళ్లాల్సి వచ్చింది. అయితే అంబులెన్స్ లేకపోయేసరికి ఎద్దులబండిని తానే లాక్కొని 3 కిమీ దూరంలో ఉన్న హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లాడు. ఈ వీడియో, ఫొటోలు వైరల్ అయ్యాయి. దీంతో దీనిపై దర్యాప్తు చేయాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు.
ఫలితం శూన్యం
అయితే అంత కష్టపడి తన భార్యను ఆసుపత్రికి తీసుకువెళ్లినా ఆ పెద్దాయనకు బాధే మిగిలింది. తన భార్యకు మందులు ఇచ్చి జిల్లా ఆసుపత్రిలో చేర్చాలని వైద్యులు, ఆయనకు తెలిపారు. దీంతో ఆమెను ఆసుపత్రిలోనే విడిచి పెట్టి మళ్లీ ఇంటికి వెళ్లి డబ్బులు, బట్టలు తీసుకువచ్చాడు ప్రజాపతి. ఆ తర్వాత మినీ ట్రక్‌లో జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. ఆ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది.
ఆ తర్వాత
ప్రజాపతి భార్య రాత్రి 11 గంటల సమయంలో చనిపోయింది. అప్పుడు మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లేందుకు అంబులెన్స్‌ను కోరగా రాత్రి వేళల్లో సేవలు లేవని ఆసుపత్రి చెప్పింది. దీంతో రూ.1100 ఇచ్చి ఓ ప్రైవేట్ అంబులెన్స్‌లో తన భార్య మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లాడు.
అఖిలేశ్ విమర్శలు
ఈ ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ స్పందించారు. యోగి నేతృత్వంలోని ప్రభుత్వం.. ప్రజలకు కనీస ఆరోగ్య సేవలు అందించలేకపోతుందని విమర్శించారు.