మనుషులు కన్నా ఇప్పుడు కుక్కలే ఆత్మీయంగా విశ్వాసంగా ఉంటాయి. అందుకే చాలా మంది కుక్కల్ని ప్రాణంగా చూసుకుంటూ ఉంటారు. చనిపోయే వరకూ ఏ లోటు లేకుండా పెంచుకుంటారు. అయితే చనిపోయిన తర్వాత కూడా గుర్తు పెట్టుకునేవారు కొంత మందే ఉంటారు. అలాంటి వారిలో ఒకరు తమిళనాడుకు చెందిన ముత్తు. ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైరైపోయిన ఆయన తన పెంపుడు శునకం టామ్ తో ఎక్కువగా గడిపేవారు. అయితే హఠాత్తుగా దానికి జబ్బు చేసింది. చికిత్సకు స్పందించలేదు. చివరికి కన్నుమూసింది. జాతస్యం మరణం ధృవమ్.. అంటే పుట్టిన వారు గిట్టక తప్పదని భగవద్గీతలో చెప్పింది మనుషులకే కాదు జంతువులకూ వర్తిస్తుందని మనసు దిటవు చేసుకున్నాయి. 


కానీ ఎంత కాలం అయినా మర్చిపోలేకపోతూండటంతో ఇలా కాదులే .. ఓ రోజు ఓ శిల్పి దగ్గరకు వెళ్లిపోయాడు. మంచి పాలరాతిని సెలక్ట్ చేసి..తన టామ్ ఫోటోను శిల్పికి ఇచ్చాడు. అచ్చంగా టామ్‌లానే శిల్పం చేయాలని కోరాడు. ఆ శిల్పి అప్పటి వరకూ చాలా శిల్పాలు చేశాడు.... అనేక జంతువుల బొమ్మలు కూడా చెక్కాడు కానీ.. అవి వేర్వేరు కారణాలతో చెక్కాడు. కానీ ముత్తు మాత్రం వచ్చింది.. తన టామ్‌ను సజీవమైన శిల్పంలో చూసుకోవడానికి. అందుకే.. ఆ శిల్పి కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుని అచ్చంగా టామ్ ఎలా ఉంటుందో అలాగే చెక్కి ఇచ్చాడు. ముత్తు కూడా తమ టామ్ పాలరాతి విగ్రహాన్ని చూసి మురిసిపోయాడు. 81 ఏళ్ల ముత్తు ఇక దాన్ని చూసుకుంటూ బతికేయవచ్చని అనుకున్నాడు. 






తన ఇంటి దగ్గర పొలంలో చిన్న స్థూపం కట్టించి దాని మీద ఈ టామ్ విగ్రహాన్ని పెట్టించాడు. రోజూ శుభ్రం చేసి చిన్న కండువా టామ్ మెడలో వేసి.. పూలు కూడా ఉంచుతున్నాడు. ఆయన ఇందు కోసం దాదాపుగా రూ. ఎనభై వేలు ఖర్చు చేశాడు. ఆయన ఇష్టాన్ని ఇంట్లో వాళ్లు కూడా ఎవరూ కాదనలేదు. ఎందుకంటే వారు కూడా డాగ్ లవర్స్. మొత్తంగా ప్రతి కుక్కకీ ఓ రోజు వస్తుందని అంటారు.. అలా  టామ్‌కు ముత్తు దగ్గర ఉన్నన్ని రోజులు ప్రతీ రోజూ టామ్‌వే. చనిపోయిన తర్వాత కూడా టామ్‌ కోసమే రోజులు కేటాయిస్తున్నాడు ముత్తు. ఎంతైనా జంతు ప్రేమికుల హృదయాలు చాలా సున్నితంగా ఉంటాయి మరి