ABP  WhatsApp

Shanghai Covid-19 cases: నిండిపోయిన ఆసుపత్రులు, పిచ్చెక్కిపోతున్న వైద్యులు- చైనాలో మళ్లీ కరోనా కథ మొదలు

ABP Desam Updated at: 05 Apr 2022 04:17 PM (IST)
Edited By: Murali Krishna

కరోనా కారణంగా చైనాలో మళ్లీ పరిస్థితులు తలకిందులయ్యాయి. రోగులతో ఆసుపత్రులు నిండిపోయాయి.

నిండిపోయిన ఆసుపత్రులు, తిండి లేక పాట్లు- చైనాలో మళ్లీ కరోనా కథ మొదలు

NEXT PREV

కరోనా కారణంగా చైనాలో పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. సోమవారం ఒక్కరోజే 16,412 కేసులు నమోదయ్యాయి. చైనాలో కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం. ముఖ్యంగా ఆర్థిక రాజధాని షాంఘై నగరంలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు లాక్‌డౌన్ విధించారు. కేవలం మెడికల్ ఎమెర్జెన్సీ అయితేనే ఎవరినైనా ఇంటి నుంచి బయటకు పంపుతున్నారు.


వీలైనన్నీ ఎక్కువ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు అధికారులు. నగరంలో ఉన్న మొత్తం 2.6 కోట్ల మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ముఖ్యంగా ఇక్కడి ప్రజలకు న్యూక్లిక్ యాసిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇది కరోనా వైరస్‌ను మిస్ కాకుండా గుర్తించగలదు. స్వల్పంగా కరోనా ఉన్నా ఈ పరీక్షలో తెలిసిపోతుంది.


సైన్యం


షాంఘైలో కరోనా పరిస్థితులను అదుపులో ఉంచేందుకు ఏకంగా సైన్యాన్ని కూడా రంగంలోకి దింపింది ప్రభుత్వం. 2 వేల మందికి పైగా సైనికులు షాంఘై నగరంలో ఉన్నారు. షాంఘై నగర విమానాశ్రయాల్లో సైనిక విమానాలు ల్యాండ్ అవుతూనే ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.


మార్చి 28, 29 నుంచి ఇక్కడికి సైన్యం వస్తున్నట్లు వారు తెలిపారు. నిరంతరం విమానాల రాకపోకలతో ఎయిర్‌పోర్ట్‌ పరిసరాల్లో ఉండేవారికి నిద్ర కూడా లేకుండా పోయిందని తెలిపారు.


కఠిన లాక్‌డౌన్‌ అమలు అవుతోన్న వేళ ప్రజలు నిరసనలకు దిగితే అదుపులో ఉంచేందుకు పోలీసులు కూడా నిరంతరం పహారా కాస్తున్నారు. భారీ ఆయుధాలను చేతబట్టుకుని పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నట్లు స్థానికులు వెల్లడించారు.


కిక్కిరిసిన ఆసుపత్రులు


షాంఘైలో కరోనా పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, కనీసం ఆసుపత్రులు, అంబలెన్స్‌లు కూడా ఖాళీ లేవు. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) అధికారి, ఓ వ్యక్తికి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ వైరల్ అయింది. 



ఆసుపత్రిలో వార్డులన్నీ నిండిపోయాయి. ఐసోలేషన్ సెంటర్‌లో కూడా ఖాళీ లేదు. అంబులెన్స్‌లు కూడా ఖాళీ లేవు.. ఎందుకంటే రోజుకు వందల సంఖ్యలో ఫోన్లు వస్తున్నాయి. అందుకే పాజిటివ్ వచ్చిన కరోనా టెస్ట్ ఫలితం కూడా నెగెటివ్ అని చెప్పేస్తున్నాం. నిపుణులు, వైద్యులకు ఏం చేయాలో తెలియక పిచ్చెక్కుతోంది.                                       - సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) అధికారి


ఆహారం కూడా


చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ చెప్పిన జీరో కొవిడ్ పాలసీపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే షాంఘై నగరంలో ప్రజలకు తినడానికి తిండి, తాగడానికి నీరు కూడా అయిపోతున్నాయని చెబుతున్నారు. కనీసం ఇతర నగరాల నుంచి డెలివరీ కూడా షాంఘైలో అనుమతించడం లేదు.


మాయం


అయితే ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే.. షాంఘై నగరంలో కరోనా బాధితులు కనిపించకుండా పోతున్నారు. కరోనా వచ్చిన వారిని ఇక్కడ ఉంచేందుకు ఐసోలేషన్ కేంద్రాలు సరిపోకపోవడంతో వారిని వేరే నగరాలకు తరలిస్తున్నారు. 1000 నుంచి 2 వేల మందిని వేరే నగరాలకు పంపుతున్నట్లు సమాచారం. 


Also Read: Covid-19 New Variant XE: గుబుల్ గుబుల్‌గా గుండెలదరగా- కొత్త వేరియంట్ XE, 10 రెట్లు ఫాస్ట్ గురూ!


Also Read: Kerala News: ప్రాణం తీసిన పోస్ట్ వెడ్డింగ్ షూట్- నదిలో కొట్టుకుపోయిన నవ జంట

Published at: 05 Apr 2022 04:03 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.