Maharashtra Political News: శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. శివసేన పార్టీపై ఆధిపత్యం కోసం ఇరు వర్గాలు దాఖలు చేసిన పిటిషన్ల విచారణను ఆగస్టు 1కి సుప్రీం కోర్టు వాయిదా వేసింది. అప్పటిలోగా మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందే వర్గం ప్రమాణపత్రం దాఖలు చేయాలని ఆదేశించింది.




ఆగండి


అలానే ఎమ్మెల్యేల అనర్హత విషయానికి సంబంధించి స్పీకర్‌ కూడా అప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కోర్టు స్పష్టం చేసింది. ఈ పిటిషన్లలోని కొన్ని విషయాలను పరిశీలిస్తే వీటి విచారణకు విస్తృత ధర్మాసనం అవసరం అవుతుందని బలంగా నమ్ముతున్నట్లు సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ అన్నారు. దీంతో ఈ పిటిషన్ల కోసం ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక ధర్మానాన్ని ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది.


మరోవైపు శిందే వర్గం మాత్రం శివసేన పార్టీ తమదేనని వాదిస్తోంది. 20మంది ఎమ్మెల్యేలు కూడా మద్దతివ్వని వ్యక్తిని కోర్టుల సాయంతో అధికారంలో కూర్చోబెట్టే దుస్థితిలో మనం ఉన్నామా అంటూ శిందే తరఫు న్యాయవాది హరీశ్ సాల్వే కోర్టులో కీలక వ్యాఖ్యలు చేశారు.


మాదే పార్టీ


మరోవైపు ఎమ్మెల్యేల తిరుగుబాటుతో అధికారం కోల్పోయిన ఠాక్రేకు మరో షాక్‌ తగిలింది. పార్లమెంట్‌లోనూ శివసేన పార్టీ చీలిక దిశగా సాగుతోంది. లోక్‌సభలో ఆ పార్టీకి చెందిన 12 మంది ఎంపీలు ఠాక్రేపై తిరుగుబాటు చేసి ప్రత్యేక బృందంగా ఏర్పడ్డారు. తాజాగా వీరికి కేంద్ర ప్రభుత్వం భద్రత కల్పించింది.


శివసేన పార్టీకి లోక్‌సభలో 19 మంది ఎంపీలు ఉన్నారు. వీరిలో డజను మంది మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందేతో టచ్‌లో ఉన్నారు. ఇదే సమయంలో కేంద్ర హోం శాఖ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఠాక్రేపై తిరుగుబాటు చేసి ప్రత్యేక వర్గంగా ఏర్పడిన 12 మంది శివసేన ఎంపీలకు 'వై' కేటగిరీ భద్రత కల్పిస్తూ మంగళవారం నిర్ణయం తీసుకుంది.


Also Read: Smriti Irani Attacks on Rahul Gandhi: రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ ఫైర్- ప్రశ్నించే దమ్ములేదని విమర్శ


Also Read: Sri Lanka New President: శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే