కావాలనే పక్కన పెడుతున్నారు..


దళిత నేత, యూపీ మంత్రి దినేశ్ ఖతిక్ రాజీనామా చేశారు. స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్‌ నుంచి తన రాజీనామా లేఖను పంపారు. జలవనరుల శాఖ మంత్రిగా ఉన్న ఆయన ఉన్నతాధికారులెవరూ తన మాట వినడం లేదని, తన మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఏ సమాచారాన్నీ ఇవ్వటం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కారణంగానే రాజీనామా చేస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దినేశ్‌కు గతేడాది సెప్టెంబర్‌లో జలవనరుల మంత్రిత్వశాఖా మంత్రిగా బాధ్యతలు అప్పగించారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. అయితే తన రాజీనామా లేఖను సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు కాకుండా, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు రాశారు. ఈ కారణంగానే...ఈ రాజీనామా పార్టీలో చర్చనీయాంశమైంది. యూపీలో భాజపా గెలవటానికి ఓబీసీలతో పాటు దళితులు కూడా కారణమే. ఆ ఓటుబ్యాంకు కాషాయ పార్టీవైపు మళ్లటం వల్లే గెలుపు సులభతరమైంది. కానీ ఇప్పుడు "దళితులను పక్కన పెట్టే ప్రయత్నం జరుగుతోంది" అంటూ ఆరోపణలు చేశారు దినేష్ ఖతిక్. జలశక్తి శాఖ మంత్రి స్వతంత్ర దేవ్ సింగ్‌ పేరు నేరుగా ప్రస్తావించకపోయినా, పరోక్షంగా ఆయనపై విమర్శలు చేశారు. "మంత్రులెవరైనా సరే ప్రభుత్వం తరపున ఓ అధికారిక కారుని తప్ప మరేదీ ఎక్స్‌పెక్ట్ చేయకూడదు" అని సెటైర్లు వేశారు. 


మధ్యలోనే కాల్ కట్ చేసి అవమానించారు..


తాను దళితుడన్న కారణంగానే పక్కన పెడుతున్నారని, డిపార్ట్‌మెంట్ మీటింగ్స్‌ కూడా తనను ఆహ్వానించటం లేదని ఆరోపించారు. డిపార్ట్‌మెంట్‌లో అవకతవకలపై ఫిర్యాదు చేసినా, అధిష్ఠానం పట్టించుకోలేదని విమర్శించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను బదిలీ చేయాలని చెప్పినా, నిర్లక్ష్యం వహించారని అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరపున ఈ విషయమై చర్చించేందుకు ఎవరూ ముందుకు రాలేదని వెల్లడించారు. "అవినీతి విషయంలో సహించేదే లేదన్న యోగి ఆదిత్యనాథ్‌ ఆలోచనలకు అనుగుణంగానే నేను ఫిర్యాదు చేశాను. కొందరి బదిలీలకు సంబంధించిన సమాచారం కావాలని స్వయంగా నేనే అడిగాను. కానీ ఆ వివరాలు నాకు అందలేదు" అని మండిపడ్డారు దినేశ్ ఖతిక్. ఈ విషయమై ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడాలని ప్రయత్నించినా, మధ్యలోనే కాల్ కట్ చేశారని, ఓ మంత్రిగా ఇది తనకు తీరని అవమానమని అన్నారు. ఈ రాజీనామాపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ స్పందించారు. "గౌరవం లేని చోట రాజీనామా చేయటమే ఉత్తమం" అని అభిప్రాయపడ్డారు.