ముఖ్యమంత్రి పదవితోపాటు ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసినట్టు ఉద్దవ్ ఠాక్రే ప్రకటించారు. తనకు మద్దతు ఇచ్చిన ప్రజలకు, కాంగ్రెస్, ఎన్సీపీ లీడర్లు కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తన హయాంలో నగరాల పేర్లు మార్చినందుకు చాలా సంతృప్తినిచ్చిందని అభిప్రాయపడ్డారు. ఇవాళే సమావేశమైన కేబినెట్‌ ఔరంగాబాద్‌ని శంభాజీ నగర్‌గా, ఉస్మానాబాద్‌ను ధరాశివ్‌గా మార్చారు. 


ఊహించని రీతిలో అధికారంలోకి వచ్చానని... అదే పద్ధతిలో వెళ్తున్నానని అన్నారు ఠాక్రే. శాశ్వతంగా వెళ్ళిపోవడం లేదని.. ఇక్కడే ఉంటానన్నారు. మరోసారి శివసేన భవన్‌లో కూర్చుంటానని... ప్రజలందరినీ సమీకరించుకుంటానని ధీమా వ్యక్తం చేశారు. 






ముఖ్యమంత్రిగా ఉద్దవ్ ఠాక్రే రాజీనామాతో దేవేంద్ర ఫడ్నవీస్‌ ఉండే ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది. భారీగా చేరుకున్న నేతలు, కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. మహారాష్ట్ర బీజేపీ చీఫ్‌ చంద్రకాంత్ పాటిల్ ఫడ్నవీస్‌కు స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ముంబయిలోని తాజ్‌ ప్రెసిడెంట్‌ హోటల్‌లో జరిగిన శాసనసభ పక్ష సమావేశంలో ఈ దృశ్యం కనిపించింది. 






దేవంద్ర ఫడ్నవీస్‌... కాబోయే ముఖ్యమంత్రిగా ప్రచారం జరుగుతోంది. రేపు ప్రమాణం స్వీకారం చేసే ఛాన్స్ ఉన్నట్టు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఇవాల్టి శాసనసభ సమావేశంలో కూడా దీనిపే నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 






క్యాంప్‌లో ఉన్న శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు విమానాశ్రయం నుంచి నేరుగా అసెంబ్లీకి వచ్చేలా ఏర్పాట్లు చేశారు. భద్రతను  కట్టు దిట్టం చేశారు. ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు సమావేశాన్ని నిషేధిస్తూ CrPC సెక్షన్ 144ని కూడా పోలీసులు విధించారు. భద్రతను నిర్ధారించే ప్రయత్నంలో, దక్షిణ ముంబైలోని విధాన్ భవన్, పరిసర ప్రాంతాల సమీపంలో ఎవరూ గుమిగూడేందుకు అనుమతించడం లేదు. తిరుగుబాటుదారులతో కూడిన బస్సులు ఎలాంటి అడ్డంకులు లేకుండా సురక్షితంగా విధాన్ భవన్‌కు చేరుకునేలా ట్రాఫిక్ పోలీసులు చూస్తారు. తిరుగుబాటు ఎమ్మెల్యేల నివాసాలు, కార్యాలయాల వద్ద ముంబై, మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలలో భద్రతను పెంచినట్లు పోలీసు అధికారి ఒకరు ఏఎన్‌ఐకి చెప్పారు.