Maharashtra Floor Test:  మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ధాకరేకు సుప్రీంకోర్టులో   ఊరట లభించలేదు. గవర్నర్ ఆదేశించినట్లుగా గురువారం అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.  బలపరీక్షపై స్టే విధించాలని శివసేన చీఫ్ విప్ దాఖలుచేసిన పిటిషన్ విషయంలో జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితులు కనిపించలేదని ధర్మాసనం అభిప్రాయ పడింది. ఒక వేళ ఫ్లోర్ టెస్ట్ నిబంధనలకు అనుగుణం జరగలేదని భావిస్తే తాము జోక్యం చేసుకుంటామని హామీ ఇచ్చింది. 





 11వ తేదీ తర్వాతే బలపరీక్షపై నిర్ణయం తీసుకోవాలని శివసేన వాదనలు


ఒక్క రోజులోనే బల నిరూపణ చేసుకోవాలని గవర్నర్ ఆదేశించడాన్ని సవాల్ చేస్తూ   శివసేన చీప్ విప్ సునీల్‌ప్రభు సవాలు చేశారు. సునీల్‌ప్రభు పిటిషన్‌పై సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. శివసేన  తరపున అభిషేక్ మను సింఘ్వీ   వాదనలు వినిపించారు.  16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత అంశం తేలాకే బలపరీక్షకు అనుమతివ్వాలని ఆయన వాదించారు. బలపరీక్ష గురించి తమకు ఈ రోజే సమాచారం అందిందని, బలనిరూపణకు ఒకరోజు మాత్రమే ఇవ్వడం అన్యాయమని సింఘ్వీ కోర్టుకు వాదన వినిపించారు. గురువారమే అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని గవర్నర్ ఆదేశించడం చాలా హడావిడిగా తీసుకున్న నిర్ణయమని, అపవిత్రమని ఆయన అన్నారు.   రెబల్ ఎమ్మెల్యేలను కాపాడేందుకే తెరపైకి బలపరీక్షను తీసుకొచ్చారని, తమ ఎమ్మెల్యేలు కొంత మంది విదేశాల్లో ఉన్నారని, ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా సోకిందని సింఘ్వీ సుప్రీంకు వివరించారు. ఈ పరిస్థితిలో బలపరీక్ష ఎలా నిర్వహిస్తారని సింఘ్వీ ప్రశ్నించారు. బలపరీక్షపై జులై 11న నిర్ణయాన్ని వెల్లడించాలని సుప్రీంకోర్టును సింఘ్వీ కోరారు.


తక్షణం బలపరీక్షపై నిర్ణయం తీసుకోవాలన్న ఏక్‌నాథ్ షిండే తరపు లాయర్ వాదనలు !


ఏక్‌నాథ్ షిండే తరపులాయర్ కూడా వాదనలు వినిపించారు. స్వతంత్ర ఎమ్మెల్యేలు రాసిన లేఖ ఆధారంగా గవర్నర్ బలపరీక్ష నిర్ణయం తీసుకున్నారని ఆయన రాజ్యంగపరమైన విధిని ఆయనను చేయనివ్వాలని విజ్ఞప్తి చేశారు.   షిండే తరఫు న్యాయవాది నీరజ్ కృష్ణ కౌల్  అసెంబ్లీలో బలపరీక్షను ఎప్పుడూ జాప్యం చేయకూడదని, రాజకీయ జవాబుదారీతనానికి, బేరసారాలు జరక్కుండా నిరోధించేందుకు బలపరీక్ష నిర్వహించడమే ఏకైక మార్గమని వాదించారు.  ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం జాప్యమవుతోందన్న కారణం చూపించి బలపరీక్షను వాయిదా వేయాల్సిన అవసరం లేదని అన్నారు.
 
అసమ్మతి ఎమ్మెల్యేల లేఖలను గవర్నర్ పరిగణనలోకి తీసుకున్నారన్న గవర్నర్ లాయర్!


ప్రభుత్వం మైనార్టీలో పడిపోయిందని పలువురు ఎమ్మెల్యేలు రాసిన లేఖలను గవర్నర్ పరిగణనలోకి తీసుకున్నారని.. ఈ విషయంలో ఆయన సంతృప్తి చెందినందునే బలపరీక్షకు ఆదేశించారని మహారాష్ట్ర గవర్నర్ తరపు లాయర్ వాదించారు. జరుగుతున్న పరిణామాలను పరిశీలించి నిర్ణయం తీసుకునే అధికారం గవర్నర్‌కు ఉందన్నారు. అనర్హతా ఎమ్మెల్యేలకు డిప్యూటీ స్పీకర్ 24 గంటలు మాత్రమే సమయం ఇచ్చారని.. ఇప్పుడు అదే తరహాలో గవర్నర్ బలపరీక్షకు ఆదేశిస్తే ప్రశ్నిస్తున్నారన్నారు. ఎమ్మెల్యేలకు బెదిరింపులు వస్తున్నాయని మీడియాలో వస్తున్న కథనాలను గవర్నర్ తరపు లాయర్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గవర్నర్ నిర్ణయాన్ని చాలెంజ్ చేయడాన్ని అపరిపక్వతగా అభివర్ణించారు. 


అందరి వాదనలను మూడున్నర గంటల పాటు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం.. గవర్నర్ నిర్ణయాన్ని సమర్థించింది. గురువారమే బలపరీక్ష ఎదుర్కోవాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.