Salman Khan Latest News: గత ఏప్రిల్‌ నెలలో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ ఖాన్‌ ఇంటిపైన జరిగిన తుపాకీ కాల్పుల కేసు దర్యాప్తులో నమ్మలేని నిజాలు బయటికి వచ్చాయి. సల్మాన్ ఖాన్‌ను హత్య చేసేందుకు వీరు ప్రయత్నించినట్లుగా గుర్తించారు. మొత్తం ఐదుగురు నిందితులపై నవీ ముంబయి పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేయగా.. ఇందులో కళ్లు బయర్లుకమ్మే విషయాలను పోలీసులు ప్రస్తావించారు.


ఈ ఐదుగురు అనుమానితులు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన వారని గుర్తించారు. ఏప్రిల్ 14న ఇద్దరు అనుమానితులు మోటారు సైకిల్ పై వచ్చి బాంద్రాలోని సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద పలుసార్లు తుపాకీతో కాల్పులు జరిపారు. సల్మాన్ ఖాన్ ను హత్య చేయడం కోసం బిష్ణోయ్ గ్యాంగ్‌కు దాదాపు రూ.25 లక్షల కాంట్రాక్టు వచ్చిందని పోలీసులు ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు. 


ఇందుకోసం సదరు గ్యాంగ్ అధునాత తుపాకులను సమకూర్చుకుంది. ఏకే 47, ఏకే 92, ఎం 16 రైఫిల్లు, టర్కీలో తయారైన జింగానా పిస్టళ్లు తదితర ఆయుధాలను సమకూర్చుకున్నారు. ఈ పిస్టళ్లను 2022లో జరిగిన పంజాబీ సింగర్ సిద్దూ మూసేవాలా హత్య కోసం వినియోగించారు. కేవలం ఆయుధాలను సమకూర్చుకోవడమే కాకుండా నిఘా ఆపరేషన్ ను కూడా నిందితులు పూర్తి చేశారు. దాదాపు 60 నుంచి 70 మంది వరకూ వివిధ సందర్భాల్లో సల్మాన్ ఖాన్ ఇంటిని వివిధ సందర్భాల్లో పర్యవేక్షిస్తూ ఆయన రాకపోకలు, కదలికలను తెలుసుకునేవారని చార్జిషీటులో పోలీసులు వివరించారు. సినిమా షూటింగ్‌లు లేదా పన్వేల్‌ ఫామ్‌హౌస్‌కు సల్మాన్‌ రాకపోకలు సాగిస్తున్నప్పుడు ఈ కుట్రను అమలు చేయాలనుకున్నారు.


ఛార్జిషీట్‌లో ఉన్న వివరాల ప్రకారం.. ఈ హత్యాయత్నం కోసం మైనర్లను కూడా వాడారు. ఈ బాలురు దాడి చేయడం కోసం తమ బాస్‌లు అయిన గోల్డీ బ్రార్, ఆన్మోల్ బిష్ణోయ్ ల నుంచి ఆర్డర్స్ కోసం వేచి ఉన్నారు. ఈ ఇద్దరు బాస్‌లు ఉత్తర అమెరికాలో ఉన్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ గ్యాంగ్‌ లోని వ్యక్తులు దాదాపు 15 నుంచి 16 మందితో ఒక వాట్సాప్‌ గ్రూపు కూడా ఏర్పాటు చేసుకున్నారు. హత్య కుట్ర గురించి వారు ఎప్పటికప్పుడు అందులోనే సమాచారం అందించుకుంటూ ఉన్నారు. ఈ గ్రూపులో అన్మోల్‌ బిష్ణోయ్‌, గోల్డీబ్రార్‌, అజేయ్‌ కశ్యప్‌, వినోద్‌ భాటియా, రిజ్వాన్‌ హసన్‌, వాస్పి మహమ్మద్‌ ఖాన్‌ లాంటి వారు ఉన్నట్లుగా ఛార్జిషీటులో రాశారు.