Hathras stampede death: ఉత్తరప్రదేశ్‌లో (Uttarpradesh) మంగళవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హాథ్రస్ (Hathras) జిల్లాలోని ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఒక్కసారిగా తోపులాట జరగ్గా పదుల సంఖ్యలో మృతి చెందారు. ఇప్పటివరకూ అధికారిక లెక్కల ప్రకారం 116 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడగా.. వీరిలో చిన్నారులు, మహిళలు ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అధికారులు ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఇటా ఆస్పత్రికి తరలించారు. రతీభాన్‌పూర్‌లో శివారాధనకు సంబంధించిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ముగియగానే స్థానికులు ఒక్కసారిగా గుంపులుగా వెళ్లారు. దీంతో ఒక్కసారి తోపులాట జరిగి దుర్ఘటన చోటు చేసుకుంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
ఘటనపై దర్యాప్తునకు ఆదేశం
ఈ దుర్ఘటనపై సీఎం యోగీ ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని.. ఘటనా స్థలం వద్ద సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. జిల్లా అధికార యంత్రాంగం ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేస్తోందని కలెక్టర్ ఆశీష్ కుమార్ తెలిపారు. 'ఇప్పటివరకూ 87 మంది వరకూ మృతి చెందినట్లు వైద్యులు చెబుతున్నారు. క్షతగాత్రులు, మృతుల కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తాం. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో ఈ విషాదం చోటు చేసుకుంది' అని పేర్కొన్నారు.
ఇప్పటివరకూ పలు మృతదేహాలను పోస్టుమార్టం కోసం తీసుకువచ్చారని.. గాయపడ్డ వారికి చికిత్స అందిస్తున్నట్లు ఇటా చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఉమేశ్ త్రిపాఠి వెల్లడించారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారని చెప్పారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడవుతాయని అన్నారు.
రాష్ట్రపతి తీవ్ర దిగ్భ్రాంతి
ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హాథ్రాస్‌లో అధిక సంఖ్యలో భక్తులు మరణించడం తీవ్ర బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు ఆమె ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు అధికారిక ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.
అమిత్ షా దిగ్భ్రాంతి
ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందిస్తున్నట్లు చెప్పారు.
కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 'యూపీలోని హాథ్రాస్ జిల్లాలో జరిగిన తొక్కిసలాట ఘటన చాలా బాధాకరం. ఇందులో తమ వారిని కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడ్డ వారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. బాధితులకు ప్రభుత్వం యంత్రాంగం అన్ని విధాలా సహాయం చేస్తోంది.' అని ట్వీట్ చేశారు.