Maharashtra Crime News: ఆ బాలిక వయసు 15 ఏళ్లు. సామాజిక మాధ్యమాల ద్వారా ఏర్పడిన ఓ వ్యక్తికి శారీరకంగా దగ్గర అయింది. ఆమెకు తెలియకుండానే గర్భం దాల్చడం నెలలు నిండడం జరిగిపోయింది. అయితే చాలా నెలల తర్వాత విషయం గుర్తించిన బాలిక.. విషయాన్ని ఎరికీ చెప్పలేదు. తల్లి అడిగినా ఆరోగ్యం బాగాలేని అబద్ధాలు చెప్పింది. యూట్యూబ్ లో వీడియోలు చూస్తూ.. తనకు తానే కాన్పు చేసుకోవాలనుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కాన్పు చేసుకుంది. పుట్టిన బిడ్డను పురిట్లోనే గొంతు నులిమి చంపేసింది. ఆపై చిన్నారి మృతదేహాన్ని ఓ పెట్టెలో పెట్టి పడుకుంది. ఇంటికి వచ్చిన తల్లి విషయం గుర్తించి నిలదీయగా... అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 


అసలేం జరిగిందంటే..?


మహారాష్ట్రలోని నాగ్ పూర్ నగరం అంబజారీ ప్రాంతానికి చెందిన ఓ 15 ఏళ్ల బాలిక తన తల్లిదండ్రులతో కలిసి ఇంట్లోనే నివాసం ఉంటోంది. అయితే ఆమెకు సామాజిక మాధ్యమాల ద్వారా ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్తా శారీరక సంబంధానికి దారి తీసింది. తరచుగా వాళ్లిద్దరూ కలుస్తుండడంతో కొంత కాలం తర్వాత బాలిక గర్భం దాల్చింది. అయితే చాలా రోజుల పాటు బాలికకు ఆ విషయం తెలియలేదు. ఆమెకు తెలిశాక ఇంట్లో కూడా చెప్పకుండా మేనేజ్ చేయడం ప్రారంభించింది. ఓ దశలో పొట్ట పెద్దగా కనిపించడంతో తల్లి ప్రశ్నించగా... అనారోగ్యమే కారణం అంటూ ఏమార్చింది. ఆస్పత్రికి వెళ్దామన్నా అడ్డు చెప్తూ.. ఇంట్లోనే రోజులు వెళ్లదీసింది. ఈ క్రమంలోనే యూట్యూబ్ లో కాన్పు ఎలా చేసుకోవచ్చో చూసింది. 


ఈనెల 2వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వెంటనే ఆ పసిగుడ్డును గొంతునులిమి చంపేసింది. ఇంట్లోనే ఓ పెట్టెలో మృతదేహాన్ని దాచి పెట్టింది. పని మీద బయటకు వెళ్లిన తల్లి తరిగి వచ్చేసరికి బాలిక అనారోగ్య పరిస్థితుల్లో కనిపించింది. దీంతో తల్లి భయపడిపోయి ఏమైందని గట్టిగా నిలదీసింది. దీంతో బాలిక అసలు విషయాన్ని తెలిపింది. పెట్టెలో పెట్టిన చిన్నారి మృతదేహాన్ని కూడా చూపించింది. వెంటనే సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించగా... బాలింతగా మారిన బాలికను కూడా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నారు.  



హన్మకొండ ప్రభుత్వ బడిలో బాలిక ప్రసవం..


ఇటీవలే హన్మకొండ జిల్లా కమలాపూర్ పాఠశాలలో విద్యార్థిని మగబిడ్డకు జన్మనివ్వడం కలకలం సృష్టించింది. అభంశుభం తెలియని ఓ విద్యార్థిని మగ బిడ్డకు జన్మనిచ్చింది. పాఠశాలలోని బాత్రూంలో విద్యార్థిని ప్రసవించింది. ఎలాంటి వైద్య సహాయం, వైద్యులు లేకుండానే ఆ విద్యార్థిని మగ బిడ్డకు జన్మనిచ్చింది.  హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ బాలికల పాఠశాలలో ఈ ఘటన జరిగింది.


ఆలస్యంగా వెలుగులోకి ఘటన


కొన్ని నెలల క్రితం కమలాపూర్ మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల బాలికల పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న ఓ బాలిక బాత్రూం గదిలో ప్రసవించి మగ బిడ్డకు జన్మనిచ్చింది. బాత్రూంకి వెళ్లిన ఆ బాలిక ఇంకా బయటికి రావడం లేదని అనుమానం వచ్చిన అక్కడి సిబ్బందికి బాత్రూంలోకి వెళ్లి చూసేసరికి ఆ బాలిక ప్రసవించి మగ బిడ్డకు జన్మనివ్వడంతో కంగారు పడ్డ సిబ్బంది ప్రిన్సిపాల్ కు విషయం తెలిపారు. వెంటనే ఆ పాఠశాల ప్రిన్సిపాల్ ఎంజేపీ సెక్రటరీ మల్లయ్య భట్టుకి విషయం తెలిపి ఆయన ఆదేశాల ప్రకారం అదే రోజు రాత్రి ఓ వాహనంలో ఆ బాలికతో పాటు పుట్టిన మగ బిడ్డను మరో చోటికి తరలించారు. గుట్టుచప్పుడు కాకుండా రాత్రికి రాత్రి విషయాన్ని బయటకి రాకుండా ప్రిన్సిపాల్ తగు జాగ్రత్తలు తీసుకున్నారు. పాఠశాలలో ప్రసవించిన ఆ బాలిక గర్భవతి ఎలా అయింది? ఆ బాలిక గర్భానికి కారకులు ఎవరు? పాఠశాలలోనే ప్రసవం జరిగే వరకు ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ సిబ్బంది ఏం చేస్తున్నారు? ఆ బాలిక గర్భవతిగా ఉన్నట్లు ఎందుకు కనిపెట్టలేకపోయారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.