Anarock survey: భారతీయులకు బంగారం అంటే అమిత ప్రేమ. ముఖ్యంగా భారతీయ మహిళలకు ఈ ప్రేమ ఇంకాస్త ఎక్కువే ఉంటుంది. వాళ్ల దగ్గర డబ్బు ఉంటే చిన్నపాటి బంగారు ఆభరణమైన కొనుక్కుంటారు. లేదా, ఆ డబ్బుకు మరికొంత అప్పు కలిపి, ఇంకాస్త పెద్ద పసిడి వస్తువు తెచ్చుకుంటారు. అటు ఆభరణంగాను, ఇటు ఆపద సమయాల్లో ఆదరువుగానూ ఉండడం వల్ల బంగారం అంటే మక్కువ ఎక్కువ.    


అయితే, మారుతున్న కాలంతో పాటు మహిళల మనోగతం కూడా మారుతోంది. ముఖ్యంగా, కరోనా కాలం తర్వాత అతివల అభిప్రాయాల్లో వైవిధ్యం కనిపిస్తోంది. మన దేశంలోని మహిళలు ఇప్పుడు బంగారం, వెండి ఆభరణాల కంటే స్థిరాస్తి కోసం పెట్టుబడులు పెట్టడానికే ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్‌ మీద కూడా పెద్దగా ఇంట్రెస్ట్‌ చూపడం లేదు. రియల్ ఎస్టేట్ కంపెనీ కన్సల్టెంట్ అనరాక్ (Anarock) సర్వేలో ఈ విషయాలు వెల్లడడ్టాయి. మహిళలు ఇష్టపడే పెట్టుబడి ఎంపికలకు సంబంధించి అనరాక్‌ సంస్థ సర్వే జరిపింది.     


వినియోగదార్ల సర్వేలో వెల్లడైన విషయాలు ఇవి       
వినియోగదార్ల సర్వే ‍‌(consumer survey) నివేదిక ప్రకారం... 65 శాతం మంది మహిళలు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడుల వైపు మొగ్గు చూపారు. 20 శాతం మంది స్టాక్స్‌ను ప్రిఫర్‌ చేశారు. 8 శాతం మంది మాత్రమే బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇష్టపడ్డారు. 7 శాతం మంది ఇంతులు ఫిక్స్‌డ్ డిపాజిట్లలో (fixed deposits) పెట్టుబడులు పెట్టేందుకు తమ డబ్బును వినియోగిస్తామన్నారు. ఈ వినియోగదార్ల సర్వేలో సుమారు 5,500 వేల మందిని ప్రశ్నించగా, వారిలో 50 శాతం మంది మహిళలు ఉన్నారు.  


మహిళలకు ఎలాంటి ఇల్లు కావాలట?     
అన్‌రాక్‌ సర్వే నివేదిక ప్రకారం...  రూ. 45 లక్షల కంటే ఎక్కువ విలువైన ఇంటి కోసం 83 శాతం మంది మహిళలు చూస్తున్నారు. 36 శాతం మంది మహిళలు రూ. 45-90 లక్షల మధ్య 'బడ్జెట్‌ రేంజ్‌'లో ఉన్న ఇంటిని ఇష్టపడుతున్నారు. అలాగే,  రూ. 90 లక్షల నుంచి రూ. 1.5 కోట్ల ధర ఉన్న 'ప్రీమియం హౌస్‌' ఉంటే బాగుంటుందని 27 శాతం మంది అన్నారు. రూ. 1.5 కోట్ల కంటే ఎక్కువ ధర ఉన్న 'లగ్జరీ హోమ్‌' 20 శాతం మంది ఛాయిస్‌గా ఉంది. రూ. 45 లక్షల లోపు ఇళ్లను కొనుగోలు చేయాలనే కోరికను వ్యక్తం చేసిన మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉంది.


అనరాక్ గ్రూప్ విశ్లేషణ ఏంటి?     
వినియోగదార్ల సర్వే ఆధారంగా అనరాక్ గ్రూప్ వైస్ చైర్మన్ సంతోష్ కుమార్ ఏం విశ్లేషించారంటే.. "గత 10 సంవత్సరాలుగా, రెసిడెన్షియల్‌ రియల్ ఎస్టేట్ ప్రధాన కొనుగోలుదార్లుగా మహిళలు ఎదిగారు. వీరిలో పట్టణ ప్రాంతాల్లోని మహిళలు కూడా ఉన్నారు. పెద్ద పెద్ద ఇళ్ల నుంచి, గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్ల వరకు మహిళలు ప్రాధాన్యత ఇస్తున్నారు. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టే మహిళల సంఖ్య పెరుగుతోంది. నివాస సంబంధిత పెట్టుబడులతో ఇళ్లు కొనుగోలు చేసే వారి నిష్పత్తి 82:18 నుంచి 77:23 కి మారింది".