Assam CM Himanta Sarma Meets Union Minister Amit Shah: 
ఇటీవల ఎన్నికలు జరిగిన త్రిపుర, నాగాలాండ్‌ రాష్ట్రాల్లో ప్రభుత్వాల ఏర్పాటు, కేబినెట్ మంత్రుల వివరాలపై బీజేపీ నేతలు ఫోకస్ చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారిక నివాసానికి వెళ్లడంతో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చ కోసమే వచ్చారని తెలుస్తోంది. అమిత్ షాతో సమావేశానికి నాగాలాండ్ ముఖ్యమంత్రి నిఫ్యూ రియో కూడా హాజరయ్యారని సమాచారం.  భేటీ అనంతరం ఆదివారం రాత్రి జేపీ నడ్డా, హిమంత బిస్వా శర్మలు కేంద్ర హోం మంత్రి నివాసం నుంచి వెళ్లిపోయారని జాతీయ మీడియా ఏఐన్ఐ రిపోర్ట్ చేసింది. నేషనల్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (NDPP)తో కలిసి కూటమిగా బరిలోకి దిగిన BJP త్రిపురలో తిరిగి అధికారం సొంతం చేసుకుంది. 


మార్చి 8న జరగనున్న సీఎంల ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతారని బీజేపీ త్రిపుర ధ్యక్షుడు రాజీబ్ భట్టాచర్జీ ఇదివరకే వెల్లడించారు. త్రిపురలో కొత్త సర్కార్ ఏర్పాటు, మంత్రివర్గం ప్రమాణ స్వీకారోత్సవం మార్చి 8వ తేదీన నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షాతో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కార్యక్రమానికి హాజరు కానున్నారు. దేశం నలువైపుల నుంచి ప్రజలు త్రిపురకు వచ్చి సంతోషంగా హోలీ ఆడతారని భట్టాచర్జీ చెప్పారు.






బీజేపీ సంపూర్ణ మెజారిటీ సాధించి త్రిపుర రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వచ్చింది. భారత ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం, బీజేపీ దాదాపు 39 శాతం ఓట్లను సొంతం చేసుకోగా 32 అసెంబ్లీ సీట్లు గెలుచుకుంది. త్రిపుర మోత పార్టీ 13 సీట్లతో రెండో స్థానానికి పరిమితమైంది. గతంలో రాష్ట్రంలో కంచుకోటగా ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI) 11 స్థానాల్లో విజయం సాధించగా, కాంగ్రెస్ పార్టీ మూడు సీట్లకు పరిమితమైంది. ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీఎఫ్‌టీ) ఒక్క సీటు గెలిచింది. 


త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా శుక్రవారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్ర గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్యకు సమర్పించారు. త్రిపురలో నూతన ప్రభుత్వ ఏర్పాటు, కేబినెట్ ప్రమాణ స్వీకారోత్సవం అగర్తలలోని వివేకానంద మైదానంలో నిర్వహించనున్నారని పీటీఐ పేర్కొంది. 


బీజేపీ హవా 


త్రిపుర, నాగాలాండ్‌లో ఎన్నికల ఫలితాల్లో బీజేపీ కూటమి హవా కొనసాగింది. త్రిపురలో బీజేపీ కూటమి 33 చోట్ల గెలుపుకి ఓ అడుగు దూరంలో ఉంది. నాగాలాండ్‌లోనే మేజిక్ ఫిగర్ 31 మార్క్‌ను దాటింది బీజేపీ కూటమి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. అయితే త్రిపురలో తిప్రా మోత పార్టీ నుంచి బీజేపీ కూటమికి గట్టి పోటీ ఎదురైంది.