శ్రీకాకుళం కాశీబుగ్గలో కొలువైన వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో అపచారం జరిగింది. ఆలయ ఆవరణలో ఆర్యవైశ్య సంఘ నాయకుడికి క్షీరాభిషేకం చేయడం స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. ఆలయ ఆవరణలో ఇలా ఓ వ్యక్తికి పాలాభిషేకం చేయడం అపచారమని ఆంధ్రప్రదేశ్‌ సాధుపరిషత్తు అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతి అన్నారు. అమ్మవారి సన్నిధిలో ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించకూడదని సూచించారు.
అసలేం జరిగిందంటే..
గతంలో ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడిగా కె.రమేష్‌ పని చేశారు. ఆ సమయంలో సంఘ నిధుల ఖర్చుల్లో వ్యత్యాసం ఉందని ఒక సభ్యుడు ఆరోపణలు చేశారు. వాస్తవం తేల్చేందుకుగానూ అప్పట్లోనే నిజ నిర్ధారణ కమిటీ వేశారు. ఆ కమిటీ సభ్యులు దస్త్రాలు పరిశీలించి ఆరోపణల్లో వాస్తవం లేదని 2019లోనే నిర్ధారించారు. ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో రమేష్‌ సోదరుడు సంఘ అధ్యక్షుడిగా గెలుపొందారు. ఈ ఈ క్రమంలో రమేష్‌కు కన్యకాపరమేశ్వరి ఆలయంలో పలువురు సంఘ ప్రతినిధులు క్షీరాభిషేకం చేశారు. అయితే ఆలయ ఆవరణలో ఇలా ఓ వ్యక్తికి పాలాభిషేకం చేయడం అపచారమని పలువురు ఆక్షేపిస్తున్నారు. అమ్మ సన్నిధిలో ఇలాంటివి చేయడం విరుద్ధమని, దీన్ని అంతా ఖండించాలని ఆంధ్రప్రదేశ్‌ సాధు పరిషత్తు అధ్యక్షుడు, ఆనందాశ్రమ పీఠాధిపతి స్వామి శ్రీనివాసానంద సరస్వతి పేర్కొన్నారు.


దేవాదాయ శాఖ వారిపై చర్యలు తీసుకోవాలి 
కాశీబుగ్గలో హిందూ ధర్మానికి చెడ్డపేరు తెచ్చే దారుణమైన పని జరిగిందన్నారు స్వామి శ్రీనివాసానంద సరస్వతి. కోటి రమేష్ అనే వ్యక్తి ఆలయ ప్రాంగణంలో పాలాభిషేకం చేసుకోవడంపై మండిపడ్డారు. కనీస ఆలోచన లేదా అని ప్రశ్నించారు. గతంలో తాను ఆలయాన్ని సందర్శించానని తెలిపారు. ఆలయంలో ధ్వజస్తంభాలకు, దేవతామూర్తులకు ఆరాధనలో భాగంగా అభిషేకాలు నిర్వహిస్తుంటారు. కానీ ధ్వజస్తంభం దగ్గర ఓ వ్యక్తికి క్షీరాభిషేకం చేయడం సరికాదన్నారు. దేవుడికి తప్ప వ్యక్తులకు ఆలయంలో పాలాభిషేకాలు చేయడం హిందూ సనాతన ధర్మానికి హానికరం, చెడ్డ పేరు అన్నారు. ఇలాంటి దుష్ట పద్ధతి, సంప్రదాయాలను వ్యతిరేకించాలన్నారు. ప్రతి హిందువు ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించాలన్నారు. ఆ వ్యక్తి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేవాదాయ శాఖ తప్పనిసరిగా ఆ వ్యక్తికి, దీనికి సంబంధించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు.  


ఉదయాస్తమాన సేవ ప్రారంభించిన స్వరూపానందేంద్ర సరస్వతి 
కాణిపాకం ఆలయంలో లక్ష మోదక లక్ష్మీ గణపతి హోమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశాఖ శారదా పీఠం స్వరూపానంద సరస్వతి స్వామి నేటి నుంచి కాణిపాకంలో ఉదయాస్తమాన సేవను ప్రారంభించారు. ఈ సేవ టికెట్ ధర లక్ష రూపాయలుగా ఆలయ అధికారులు, పాలక మండలి నిర్ణయించింది. అనంతరం చైర్మన్ గెస్ట్ హౌస్ లో ఉన్న స్వరూపా నందేంద్ర సరస్వతి, స్వత్మ నరేంద్ర సరస్వతి వారిని దర్శించుకోవడానికి పలువురు రాజకీయ నేతలు వచ్చారు. చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, తిరుపతి ఎంపీ గురుమూర్తి, జిల్లా పరిషత్ ఛైర్మన్ శ్రీనివాసులు, చిత్తూరు ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు, కొంత మంది ప్రముఖులు స్వామి వారిని మర్యాద పూర్వకంగా కలశారు. వారి ఆశీర్వాదం తీసుకున్నారు. కాణిపాకం ఆలయానికి సంబంధించి పబ్లిక్ రిలేషన్ ఆఫీసును కూడా ప్రారంభించి, తర్వాత వినాయక స్వామి వారి మూల విరాట్టు దర్శించుకొని, యాగశాలలో జరుగుతున్న లక్ష మోదక లక్ష్మీ గణపతి హవనము కార్యక్రమంలో పాల్గొన్నారు.