Srikakulam News: రోడ్డుపై వెళ్తున్న ఓ ఆటోలోంచి రూ.500 నోట్లు కింద పడిపోయాయి. అయితే టోల్ గేట్ సిబ్బంది ఇది గమనించారు. డబ్బులు మొత్తాన్ని సేకరించారు. ఆపై ఆటోలో వెళ్తున్న వారిని వెంబడించే ప్రయత్నం చేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయింది. చివరకు ఏం చేయాలా అని ఆలోచించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండడంతో ఎవరైనా రాజకీయ నాయకులే డబ్బును తరలిస్తున్నారేమోనని కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


అసలేం జరిగిందంటే?


శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం మడపాం టోల్ గేట్ వద్ద శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. శ్రీకాకుళం వైపు నుంచి నరసన్నపేట వైపు వస్తున్న గుర్తు తెలియని ఓ ఆటోలో నుంచి రూ.500 నోట్లు జారిపడ్డాయి. విషయం గుర్తించిన టోల్ గేట్ సిబ్బంది వాటిని సేకరించారు. మరికొంత మంది సిబ్బంది ఆటోను వెంబడించినా ఫలితం లేకుండా పోయింది. ఈ సొమ్ము ఎరికి చెందిందన్నది ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఈ ఘటనపై సూపర్ వైజర్ ఢిల్లేశ్వర రావు, కృష్ణారావు తదితరులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.


ఆటో వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదని స్థానిక ఎస్సై సింహాచలం తెలిపారు. ఆటోకు ముందు ఓ ద్విచక్ర వాహనం ప్రయాణిస్తున్నట్లు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలకు చెందిన సొమ్ము అయి ఉంటుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. టోల్ గేట్ సిబ్బంది సేకరించిన రూ.88 వేల నగదును శనివారం సాయంత్రం పోలీసు స్టేషన్ కు అప్పగించారు. ఈ నగదు గురించి ఎవరైనా స్పష్టమైన ఆధారాలతో వస్తే అప్పగిస్తామని ఎస్సై తెలిపారు. 


గత నెలలో గుజరాత్ లో రూ.500 నోట్ల వర్షం..


సోషల్ మీడియా. ఇప్పుడిదే అందరి ప్రపంచం. జస్ట్ అలా ఫేస్‌బుక్, ఇన్‌స్టా ఓపెన్ చేస్తే చాలు. బోలెడంత కంటెంట్. వీడియోలైతే చెప్పనవసరం లేదు. స్క్రోల్ చేస్తున్న కొద్ది వస్తూనే ఉంటాయి. వాటిలో కొన్ని విపరీతంగా వైరల్ అవుతాయి. మొన్నా మధ్య బెంగళూరులో ఓ వ్యక్తి బ్రిడ్జ్‌ పై నుంచి నోట్ల వర్షం కురిపించిన వీడియో చాలా రోజుల పాటు వైరల్ అయింది. ఇప్పుడు మరోసారి అలాంటి వీడియోనే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గుజరాత్‌లోని మెషనా జిల్లాలో ఓ మాజీ సర్పంచ్‌ తన ఇంటి డాబాపై నుంచి నోట్ల వర్షం కురిపించాడు. ఎన్ని లక్షలు అలా పై నుంచి నోట్లు విసురుతూనే ఉన్నాడు. తన మేనల్లుడికి పెళ్లి జరుగుతోందన్న సంతోషంలో ఇలా చేశాడు. కెర్రీ తహసీల్లోని అగోల్ గ్రామంలో తన మేనల్లుడు రజాక్ పెళ్లి సందర్భంగా మాజీ సర్పంచ్ కరీమ్ యాదవ్ ఊరేగింపు నిర్వహించాడు. ఆ సమంలోనే బిల్డింగ్‌పై నిలబడి రూ.500 విలువైన నోట్లను ప్రజలపై విసిరాడు. దాదాపు రూ.5 లక్షలు ఇలా విసిరినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. జోధా అక్బర్‌లోని అజీమ్ ఓ షాన్ షెహన్‌షా అనే పాట బ్యాక్‌గ్రౌండ్‌లో వినబడుతోంది. పైన నిలబడి ఆ వ్యక్తి పూలు జల్లినంత సింపుల్‌గా నోట్లు చల్లుతూ కనిపించాడు.