Solapur BJP Leader : మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్రీకాంత్ దేశ్ ముఖ్‌ను ఆ పార్టీ పదవి నుంచి తొలగించడమే కాకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీనికి కారణం ఓ వీడియో వైరల్ కావడమే. ఈ శ్రీకాంత్ దేశ్ ముఖ్ మంచంపై కూర్చుని ఉండగా మరో మహిళ లైవ్ ఇస్తూ.. తనను లైంగికంగా వేధించడానికి వచ్చాడని ఆ వీడియోలో చెబుతుంది. అప్పటి వరకూ ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఉన్న శ్రీకాంత్.. తెలుసుకుని వెంటనే లేచి వచ్చి ఆ మహిళపై దాడి చేసి పోన్ ఆపేస్తాడు. ఆ వీడియో వైరల్ అవడంతో శ్రీకాంత్ ను పార్టీ పదవి నుంచి తప్పించి ..  సస్పెండ్ చేశారు. 



ఆ మహిళ బీజేపీ కార్యకర్త. తనకు బీజేపీలో ప్రాధాన్యం ఇస్తానని చెప్పి వెంట తిప్పుకుని లైంగికంగా వేధిస్తున్నాడని.. అయినా మోసం చేస్తున్నాడని ఆరోపిపిస్తోంది. ఈ అంశంపై ఆమె ఎలాంటి ఫిర్యాదులు చేయలేదు కానీ..  ఫోన్‌లో వీడియో లీక్ చేసి మొత్తానికి శ్రీకాంత్ ను రోడ్డున పడేసింది. 


 



అయితే శ్రీకాంత్ దేశ్ ముఖ్ మాత్రం ఆ మహిళ తనపై హనీట్రాప్‌కు పాల్పడిందని ముంబైలో కేసు పెట్టారు. ఈ ఘటన జరిగింది ముంబైలోనే. పార్టీ కార్యకర్తగా పరిచయం చేసుకుని చనువుగా మసిలిందని... తనను హనీ ట్రాప్‌లో పాల్పడి గదికి తీసుకెళ్లిందని ఆరోపించారు. ఆమెపై కేసు పెట్టారు. పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు కానీ అరెస్ట్ చేయలేదు. 


అసలు ఈ కేసులో ఏం జరిగిందో వారిద్దరికే తెలుసు.  శ్రీకాంత్ నిజంగానే ఆమెను మోసం చేయబోయాడా... లేకపోతే ఆమె హనీట్రాప్‌కు పాల్పడిందా అనేది వారికే తెలుసు. అయితే ఈ ఎపిసోడ్‌లో మొత్తంగా నష్టపోయింది మాత్రం శ్రీకాంతే. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఆయన రాజకీయ భవిష్యత్‌కు దాదాపుగా ఎండ్ కార్డ్ పడినట్లయింది. హనీ ట్రాప్‌లో పడ్డానని ఆయనే అంగీకరిస్తున్నారు కాబట్టి...  తప్పు చేయబోయాడని జనం కూడా తీర్మానించుకుంటున్నారు.