Mahakumbha Mela 2025 : జనవరి 13, 2025 నుంచి ఫిబ్రవరి 26, 2025 వరకు జరగబోయే మహా కుంభమేళాకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ ఉత్సవాలకు ఈ ఏడాది ప్రపంచం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వస్తారని భావిస్తున్నారు. ఇందుకోసం అధికారులు ఇప్పటికే ఆయా సౌకర్యాల ఏర్పాటును పూర్తి చేశారు. మరికొన్ని చోట్ల ఏర్పాట్లను పర్వవేక్షిస్తున్నారు. ఈ సమయంలో ఓ పిడుగు వార్త ఆందోళనకు గురి చేస్తోంది. కుంభమేళాపై ఉగ్రదాడి ముప్పు పొంచి ఉందనే ప్రచారం సాగుతోంది. దీంతో వెంటనే అప్రమత్తమైన హోంశాఖ.. మంత్రిత్వ శాఖ CBRNE బృందాన్ని ఏర్పాటు చేసింది. అన్ని రకాల ప్రమాదాలను ఎదుర్కోవడానికి సిద్ధమవుతోంది.
మహ కుంభమేళాలో ఉగ్రవాద ముప్పును దృష్టిలో ఉంచుకుని, రసాయన, జీవ, రేడియోలాజికల్, న్యూక్లియర్ అటాక్ (CBRNE) ద్వారా గాయపడిన వారికి చికిత్స కోసం హోం మంత్రిత్వ శాఖ 25 మంది నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది. వీరందరికీ నరోరా న్యూక్లియర్ సెంటర్ నుంచి శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వ అంచనాల ప్రకారం ఈసారి మహా కుంభమేళాకు నలభై కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో భక్తుల భద్రతా ఏర్పాట్లు కూడా ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారుతున్నాయి. కుంభమేళాలో భక్తుల భద్రత బాధ్యతను స్వయంగా హోంశాఖ తీసుకుంది. ఆ ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించేందుకు భద్రతా సంస్థ ఎన్ఐఏ ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేస్తోంది.
నరోరా న్యూక్లియర్ సెంటర్‌లో శిక్షణ:
మహా కుంభమేళాపై తీవ్రవాద ఛాయలు కమ్ముకున్న నేపథ్యంలో 25 మంది నిపుణుల బృందానికి నరోరా అణు కేంద్రం శిక్షణ ఇచ్చింది. వారిలో ఒకరైన డాక్టర్ జితేంద్ర శుక్లా మాట్లాడుతూ.. రసాయనిక దాడి జరిగితే క్షతగాత్రులకు ఏవిధంగా చికిత్స అందించాలనే దానిపై ముందుజాగ్రత్త చర్యగా హోం మంత్రిత్వ శాఖ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది. రసాయన దాడి విషయంలో, గాయపడిన వ్యక్తులు రేడియోధార్మిక మూలకాల ద్వారా కూడా ప్రభావితమవుతారు. కావున సాధారణ సేవా సిబ్బంది గాయపడిన వారికి సహాయం చేయలేరు. అందుకే హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు నరోరా అణువిద్యుత్ కేంద్రంలో ఇటువంటి అత్యవసర పరిస్థితుల్లో క్షతగాత్రులకు చికిత్స చేసేందుకు వివిధ విభాగాలకు చెందిన మొత్తం 25 మంది ప్రభుత్వ నిపుణులకు శిక్షణ ఇచ్చారు.
స్వరూప్ రాణి ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సీబీఆర్‌ఎన్ వార్డు శిక్షణలో భాగంగా.. రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ బారిన పడిన వ్యక్తికి చికిత్స చేసే విధానాన్ని నేర్పించారు. రేడియోధార్మిక పదార్థాల బారిన పడిన వ్యక్తిని రేడియోధార్మిక పదార్థాల నుండి విముక్తి చేయడానికి అవసరమైన యంత్రాలు, చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేసే ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతుందని హోం మంత్రిత్వ శాఖ కెమికల్ అటాక్ ట్రీట్‌మెంట్ టీమ్ చైర్‌పర్సన్ వత్సల మిశ్రా అన్నారు. రసాయన దాడి వంటి అత్యవసర పరిస్థితుల్లో, స్వరూప రాణి నెహ్రూ హాస్పిటల్‌లోని మూడు పెద్ద వార్డులు అన్ని అవసరమైన వైద్య యంత్రాలు, పడకలు మొదలైన సౌకర్యాలతో ఖాళీగా ఉంచుతున్నారు.