Lavish Weddings On Income Tax Radar: 2024 సంవత్సరానికి వివాహాల సీజన్ (Wedding Season 2024) ముగిసింది. పెళ్లయ్యాక, నూతన దంపతులు హనీమూన్‌కు వెళతారు. ఒక తప్పు చేస్తే మాత్రం, హనీమూన్‌ బదులుగా ఆదాయ పన్ను శాఖ కార్యాలయానికి వెళ్లాల్సి వస్తుంది. ఈ ఏడాది నవంబర్ & డిసెంబర్‌లో మంచి ముహూర్తాలు ఉండడం వల్ల, ఈ రెండు నెలల కాలంలోనే దేశవ్యాప్తంగా వేలాది పెళ్లిళ్లు జరిగాయి. దేశంలోని వివిధ నగరాల్లో అంగరంగ వైభవంగా జరిగిన కొన్ని వివాహాల్లో కోట్లాది రూపాయలను మంచినీళ్లలా ఖర్చు చేశారు. పెళ్లి చేసుకోవడానికి డబ్బు ఖర్చు పెట్టినట్లు కాకుండా, డబ్బు ఖర్చు పెట్టడానికే పెళ్లి చేసుకున్నట్లుగా వేడుకలను మార్చేశారు. అలాంటి ఖరీదైన వివాహాలపై ఆదాయ పన్ను విభాగం (Income tax department) దృష్టి పెట్టింది. అలాంటి కొన్ని గ్రాండ్‌ వెడ్డింగ్స్‌లో సినిమా తారలు, సెలబ్రిటీలు కూడా పాల్గొని పెళ్లి వైభవాన్ని మరింత పెంచారు.


పెళ్లిళ్లలో రూ.7500 కోట్ల మేర  నల్లధనం!
ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్‌ ప్రకారం, జైపుర్‌కు చెందిన 20 మంది వెడ్డింగ్ ప్లానర్ల ఆఫీసుల్లో ఆదాయ పన్ను విభాగం సోదాలు నిర్వహిస్తోంది. అంగరంగ వైభవంగా జరిగిన వివాహ వేడుకల్లో, గత ఏడాది కాలంలో, రూ.7500 కోట్ల విలువైన లెక్కల్లో చూపని డబ్బు (unaccounted money) ఖర్చయిందని ఐటీ డిపార్ట్‌మెంట్‌ అనుమానిస్తోంది. లెక్కల్లో చూపని డబ్బు అంటే "నల్లధనం" (Black Money). నకిలీ బిల్లులు తయారు చేసే ఎంట్రీ ఆపరేటర్లు, హవాలా ఏజెంట్లు, మ్యూల్ ఖాతాలు (mule accounts) నిర్వహిస్తున్న వ్యక్తులు ఈ దందాలో భాగస్వాములయ్యారని డిపార్ట్‌మెంట్‌ గట్టిగా నమ్ముతోంది. ఈ ఏజెంట్లు హైదరాబాద్, బెంగళూరులోని మరికొందరు పార్ట్‌నర్స్‌తో కలిసి గ్రాండ్‌ వెడ్డింగ్‌ బిజినెస్‌ చేస్తున్నారని, నల్లధనాన్ని యథేచ్చగా ఖర్చు పెట్టే మార్గంగా వివాహ వేడుకలను మార్చారని ఎకనమిక్‌ టైమ్స్‌ రిపోర్ట్‌ వెల్లడించింది.


రాడార్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్స్‌ కూడా..
ఈ వారం ప్రారంభం నుంచే ఆదాయ పన్ను విభాగం దాడులు ప్రారంభమయ్యాయి, ఇవి మరికొన్ని రోజులు కొనసాగుతాయని సమాచారం. వెడ్డింగ్ ప్లానర్ల సహకారంతో, మొత్తం వ్యయంలో 50 నుంచి 60 శాతాన్ని నగదు రూపంలో ఖర్చు చేసినట్లు కనిపెట్టిన ఆదాయ పన్ను విభాగం, వాటికి సంబంధించిన లావాదేవీలను వెలికితీసింది. ఈ సోదాలతో, విదేశాల్లోని అందమైన ప్రదేశాల్లో జరిగే డెస్టినేషన్ వెడ్డింగ్స్‌ కూడా ఐటీ రాడార్‌లోకి వస్తాయని భావిస్తున్నారు. ఈ తరహా వివాహాలకు హాజరయ్యే అతిథులను అక్కడకు తీసుకెళ్లడానికి చార్టర్డ్ విమానాలు బుక్ చేస్తారు, ఖరీదైన రిసార్ట్స్‌లో బస ఏర్పాట్లు చేస్తారు. ఇలాంటి అన్ని రకాల ఖర్చల గురించి ఐటీ అధికారులు ఆరా తీస్తారు.


వివాహాలకు హాజరైన అతిథుల సంఖ్య & ఆహ్వానాల స్థాయి ఆధారంగా, ఆదాయ పన్ను విభాగం ఆ వివాహాలకు అయ్యే ఖర్చులను లెక్కిస్తోంది. ఖరీదైన భోజనాలు అందించిన క్యాటరింగ్ సంస్థలను కూడా ప్రశ్నిస్తోంది. ఈ మొత్తం దందాలో జైపుర్‌లోని వెడ్డింగ్ ప్లానర్‌లు కింగ్‌పిన్‌లుగా ఉన్నారని, ఈవెంట్‌లను నిర్వహించడానికి ఇతర నగరాల ప్లానర్‌లు వాళ్లను సంప్రదిస్తున్నారని ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో తేలినట్లు ఆదాయ పన్ను శాఖ అధికారి చెప్పారు.


మరో ఆసక్తికర కథనం: మీ నగరంలో చవకగా మారిన గోల్డ్‌, సిల్వర్‌ నగలు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ