మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతికి పట్టరాని కోపం వచ్చింది. ఆమె తన పర్యటనలో భాగంగా ఓ వైన్ షాపు మీదకి రాయి విసిరారు. ఈ వీడియో ఆమెనే స్వయంగా ట్విటర్‌లో ట్వీట్ చేయడంతో విపరీతంగా వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని బర్ఖేరా పఠానీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మద్యం నిషేధించాలని కొంతకాలంగా డిమాండ్ ఆమె చేస్తున్నారు. 2022 జనవరి 15 కల్లా రాష్ట్రంలో మద్యం అమ్మకాలను పూర్తిగా నిషేధించాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు చేపడతామని ఆమె పోయిన ఏడాదే ప్రకటించారు.
భోపాల్‌లోని బర్ఖేరా పఠానీ ప్రాంతంలో ఉన్న వైన్ షాపు వల్ల స్థానిక మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ మద్యం సేవించిన మందుబాబులు ఆ సీసాలను అక్కడే పడేస్తున్నారు. దీంతో అక్కడ ఉండే మహిళలు, పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు.. అదే సమయంలో పర్యటనకు వచ్చిన ఉమా భారతికి తెలిపారు. దీంతో ఆ షాపులోకి వెళ్లిన ఉమా భారతి ఓ బండరాయి తీసుకొని లిక్కర్ దుకాణంలోకి వెళ్లి మద్యం బాటిళ్లను పగులగొట్టారు. అనంతరం బయటికి వచ్చేశారు. స్థానికంగా స్లమ్‌లో నివసించే రోజువారీ కూలీలు తమ సంపాదనలో ఎక్కువగా మద్యం తాగడానికే తగలేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో ఆ షాపును వారం రోజుల్లోగా అక్కడి నుంచి తీసేయాలని షాపు యజమానిని ఉమా భారతి ఆదేశించారు. అయితే, ఈ ఘటనపై ఎవరూ తమకు ఫిర్యాదు ఇవ్వలేదని, ఉమా భారతిపై ఎలాంటి కేసూ నమోదు చేయలేదని భోపాల్ పోలీస్ కమిషనర్ మకరంద్ డియోస్కర్ వెల్లడించారు.
మరోవైపు సీఎం శివరాజ్ సింగ్ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ విధానాన్ని ప్రకటించింది. మద్యాన్ని మరింత తక్కువ ధరకే విక్రయించనున్నట్లు పేర్కొంది. ఉమా భారతి విధించిన డెడ్‌లైన్ దాటిన 2 రోజులకే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. విదేశీ మద్యం అమ్మకాలకు కూడా పర్మిషన్ ఇచ్చింది. దీంతో పాటు విదేశీ లిక్కర్‌పై ఎక్సైజ్ సుంకాన్ని 10-13 శాతం తగ్గించింది. ప్రజలు గతంలో కంటే నాలుగు రెట్లు ఎక్కువ మద్యం ఇంట్లో ఉంచుకోవచ్చని ప్రకటించింది. వార్షిక ఆదాయం రూ.కోటి కంటే ఎక్కువ ఉన్న వ్యక్తులు ఇంట్లోనే బార్‌ను తెరుచుకునేందుకు కూడా మధ్యప్రదేశ్ ప్రభుత్వం అనుమతించింది. ఉమా భారతి మధ్య నిషేధం అని డిమాండ్ చేస్తున్న వేళ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరించడం ప్రాధాన్యం సంతరించుకుంది.