CWC Meeting : కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలుగా మళ్లీ సోనియాగాంధీ(Sonia Gandhi)నే ఆ పార్టీ ఎన్నుకుంది. దిల్లీలో ఆదివారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(Congress Working Committee) భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐదు గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ భేటీలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ప్రధానంగా చర్చించారు. పార్టీ అధ్యక్ష ఎన్నిక అంశం చర్చకు రాగా ఎక్కువ మంది నేతలు సోనియా గాంధీ వైపే మొగ్గుచూపారు. తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీనే కొనసాగనున్నట్లు సమావేశం అనంతరం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌(KC Venugopal) మీడియాకు వెల్లడించారు.






ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ప్రధాన చర్చ 


ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమికి కారణాలను సీడబ్ల్యూసీలో ప్రధానంగా చర్చించినట్లు కేసీ వేణుగోపాల్‌ తెలిపారు. బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లడంలో కాంగ్రెస్ విఫలమైందని నేతలు అభిప్రాయ పడినట్లు వెల్లడించారు. పంజాబ్‌(Punjab)లో సీఎం మార్పు అనంతరం చర్యల విషయంలో జాప్యం పార్టీ అధికారం కోల్పోడానికి కారణమైందని పేర్కొన్నారు. లోపాలను సరిదిద్దుకొని సాధారణ ఎన్నికలకు సమాయత్తం అవుతామని ఆయన అన్నారు. పార్టీని సోనియా గాంధీ ముందుండి నడపాలని కమిటీ నిర్ణయించినట్లు తెలిపారు. రానున్న ఎన్నికల్లో పోటీకి పూర్తిస్థాయిలో సిద్ధమవుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. 


ముకుల్ వాస్నిక్ ను అధ్యక్షుడు చేయాలంటున్న అసమ్మతి నేతలు 


ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమిపై కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో వాడి వేడి చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గే, పి. చిదంబరం, ఇతర నేతలు భేటీలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అధిష్టానంపై అసహనంతో ఉన్న నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మరో ముగ్గురు సీనియర్ నేతలు భేటీకి రాలేకపోయారని కాంగ్రెస్  వర్గాలు తెలిపాయి. ముకుల్‌ వాస్నిక్‌ను కాంగ్రెస్‌ అధ్యక్షుడు చేయాలని అసమ్మతి నేతలు పట్టుబడుతున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమితో నిరాశతో ఉన్న కాంగ్రెస్‌ పార్టీని తిరిగి గాడిలో పెట్టాలంటే ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకోవాలని చాలామంది సీనియర్‌ నేతలు కోరారు.