Suresh Pachauri Joins BJP: పార్లమెంట్‌ ఎన్నికల (Parlament Election 2024) ముందు కాంగ్రెస్‌కు మరో సీనియర్‌ నాయకుడు హ్యాండిచ్చాడు. గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, కేంద్ర మాజీ మంత్రి సురేష్‌ పచౌరీ (suresh pachauri) కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. ఆయనతోపాటు మాజీ ఎంపీ గజేంద్ర సింగ్ రాజుఖేడి, ఇండోర్ మాజీ ఎమ్మెల్యే సంజయ్ శుక్లా, పిపారియా మాజీ ఎమ్మెల్యే విశాల్ పటేల్, అర్జున్  పాలియా (Arjun Paliya), ఎన్ఎస్‌యుఐ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అతుల్ శర్మ(Atul Sharma) కూడా కమలం పార్టీలో చేరిపోయారు. సీఎం డాక్టర్ మోహన్ యాదవ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వీడీ శర్మ, మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్  చౌహాన్ వీరిని పార్టీలోకి ఆహ్వానించారు. సురేష్‌ పచౌరి... కాంగ్రెస్ హయాంలో కేంద్ర రక్షణశాఖ సహాయమంత్రిగా వ్యవహరించారు. వరుసగా నాలుగు సార్లు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. 


బీజేపీలో చేరుతూనే కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు సురేష్‌ పచౌరి. కొన్ని రోజులుగా కాంగ్రెస్‌ తీసుకుంటున్న నిర్ణయాలు ఆమోదయోగ్యంగా లేవని అన్నారాయన. అయోధ్యలో బాల రాముడి ప్రాణప్రతిష్ఠను తిరస్కరిస్తూ... కాంగ్రెస్‌ పార్టీ  చేసిన ఆరోపణలు తనను బాధించాయన్నారు. అసలు బాలరాముడి ప్రాణప్రతిష్టకు కేంద్ర ప్రభుత్వం పంపిన ఆహ్వానాన్ని కాదనాల్సిన అవసరం ఏంటని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్‌ తీసుకుంటున్న నిర్ణయాలు ఆందోళన కలిగిస్తున్నాయని... 
కాంగ్రెస్‌ అంతరించిపోయే దశకు చేరుకుందని అన్నారు. 


సురేష్‌ పచౌరీ రాజకీయ ప్రస్థానం..
సురేష్‌ పచౌరీ కాంగ్రెస్‌ (Congress)లో సీనియర్‌ నాయకుడు. గాంధీ కుటుంబానికి సన్నిహితుడు. 1972లో యూత్ కాంగ్రెస్ కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1984లో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యారు. 1985-88 మధ్య  భారత యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1984-90 మధ్య రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 1990, 1996, 2002లోనూ రాజ్యసభకు ఎన్నికయ్యారు. కేంద్ర రక్షణ, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులతోపాటు పెన్షన్లు మరియు పార్లమెంటరీ  వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా, పార్టీ అట్టడుగు సంస్థ అయిన కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడిగానూ కూడా పనిచేశారు. సురేశ్ పచౌరీ తన రాజకీయ జీవితంలో రెండుసార్లు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేశారు. 1999లో భోపాల్ లోక్‌సభ స్థానం నుంచి  బీజేపీ అభ్యర్థి ఉమాభారతిపై పోటీ చేసి 1.6 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత 2013 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. భోజ్‌పూర్ నుంచి బీజేపీ అభ్యర్థి సురేంద్ర పట్వాపై పోటీ చేసి ఓడిపోయారు.


సురేష్‌ పచౌరీ భాజపాలో చేరడంపై మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh) మాజీ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ (Shivraj Singh Chauhan) హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ నాయకత్వంతో ఆ పార్టీ నేతలు విసిగిపోయారని అన్నారాయన. అందుకే ఒక్కొక్కరుగా బీజేపీలోకి వస్తున్నారన్నారు. హస్తం పార్టీ అంతరించే దశకు చేరుకుందని... దాన్ని పూర్తిగా నాశనం చేసిన తర్వాతే రాహుల్‌ గాంధీ ఊపిరిపీల్చుకుంటారని విమర్శలు చేశారు. సురేష్‌ పచౌరీ వంటి నాయకుడిని కాంగ్రెస్‌లో స్థానం లేకుండా పోయిందని అన్నారు మధ్యప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు వీడీ శర్మ. అందుకే ప్రధాని నరేంద్ర మోడీ పనిచేయాలని భావించారన్నారు.