Loksabha Election 2024:
రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థి..?
కాంగ్రెస్ తరపున ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ నిలబడతారన్న ఊహాగానాలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. అయితే...చాలా సందర్భాల్లో పలువురు నేతలు దీన్ని కొట్టిపారేశారు. రాహుల్‌ని ప్రధాని అభ్యర్థిగా ప్రచారం చేసుకోడం లేదని తేల్చి చెప్పారు. కానీ..రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోట్ మాత్రం కీలక వ్యాఖ్యలు చేశారు. I.N.D.I.A కూటమి గురించి ప్రస్తావిస్తూ 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ రేసులో ఉంటారని తేల్చి చెప్పారు. ఎన్నో చర్చల తరవాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల ఆధారంగానే విపక్షాలన్నీ కలిసి కూటమి కట్టాల్సి వచ్చిందని, ఇది ప్రజలు కోరుకున్నదే అని అన్నారు గహ్లోట్. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ వైఖరినీ ఖండించారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన చాలా గర్వంగా కనిపిస్తున్నారని, కేవలం 31%ఓట్లతోనే బీజేపీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. మిగతా 69% మంది మోదీ సర్కార్‌కి వ్యతిరేకంగానే ఉన్నారని చెప్పారు. బెంగళూరులో గత నెల విపక్షాలు భేటీ అవడం చూసి NDA భయపడిపోయిందని సెటైర్లు వేశారు. 50% ఓట్లు రాబట్టుకునేందుకు NDA కృషి చేస్తోందన్న అంశంపైనా స్పందించారు.
"ప్రధాని నరేంద్ర మోదీ 50% ఓట్లు సాధించడం ఎప్పటికీ జరగదు. ఆయన చరిష్మా ఎక్కువగా ఉన్నప్పుడే ఇది సాధ్యం కాలేదు. వచ్చే ఎన్నికల్లో అయితే ఎలాగో అది జరగదు. ఆయన ఓటు షేర్ కచ్చితంగా తగ్గుతుంది. 2024 ఎన్నికల ఫలితాలు వచ్చాకే అదే అర్థమవుతుంది. ఆ ఎన్నికలే తదుపరి దేశ ప్రధాని ఎవరన్నది డిసైడ్ చేస్తుందిఠ
- అశోక్ గహ్లోట్, రాజస్థాన్ ముఖ్యమంత్రి
ఇందిరా గాంధీ వల్లే ఇస్రో అభివృద్ధి..
2014లో నరేంద్ర మోదీ అధికారంలోకి రావడానికి కారణం కాంగ్రెస్‌యేనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు గహ్లోట్. ప్రధాని మాట తీరుపైనా విమర్శలు గుప్పించారు. రానున్న ఎన్నికల్లోనూ తానే ప్రధాని అవుతానని మోదీ చెప్పడాన్ని ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎప్పుడు ఎలా అధికారంలోకి వస్తారో చెప్పలేమని వెల్లడించారు. అయినా...ఎవరు గెలవాలన్న నిర్ణయం ప్రజల చేతుల్లో ఉంటుందని, మోదీ సర్కార్ ఎన్నో హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చలేకపోయిందని విమర్శించారు. చంద్రయాన్ 3 సక్సెస్‌నీ ప్రస్తావించారు అశోక్ గహ్లోట్. ఈ మిషన్ సక్సెస్‌లో జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ కంట్రిబ్యూషన్ కూడా ఉందని అన్నారు. విక్రమ్ సారాభాయ్ సలహా ప్రకారమే నెహ్రూ ఇస్రోని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఇందిరా గాంధీ హయాంలో ఇస్రో ఎంతో అభివృద్ధి చెందిందని తేల్చి చెప్పారు.
అమేఠీ నుంచి పోటీ..?
రాహుల్ గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని అమేఠి నుంచి పోటీ చేస్తారని యూపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అజయ్ రాయ్ వెల్లడించారు. మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ అమేఠి నుంచి పోటీ చేస్తారని తెలిపారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీది ఇదే నియోజకవర్గం. ఇక్కడే పోటీ చేసి గెలవాలనే పట్టుదలతో ఉన్నారు అజయ్ రాయ్ అన్నారు. కాంగ్రెస్‌కి కంచుకోట అయిన అమేఠీలో రాహుల్ గాంధీ గత ఎన్నికల్లో ఓడిపోయారు. ప్రత్యర్థి స్మృతి ఇరానీ విజయం సాధించారు. అప్పటికే మునిగిపోతున్న కాంగ్రెస్‌కి ఇలాంటి కంచుకోటలోనూ ఓడిపోవడం చాలా ఇబ్బంది పెట్టింది. పైగా 2019 ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. 2019లో రాహుల్ ఓడిపోయేంత వరకూ కాంగ్రెస్ ఇక్కడ వరుసగా గెలుస్తూ వచ్చింది. తొలిసారి ఇక్కడ 1967లో ఎన్నికలు జరిగాయి. గాంధీలకు ఇది అచ్చొచ్చిన నియోజకవర్గం. సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ ఇక్కడే గెలిచారు. ఆ తరవాత సోనియా గాంధీ కూడా ఇక్కడే విజయం సాధించారు. 2004 నుంచి 2019 వరకూ రాహుల్ గాంధీ ఈ నియోజకవర్గంలో గెలుస్తూ వచ్చారు. అందుకే...ఇక్కడ గెలవడాన్ని ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది కాంగ్రెస్.
Also Read: ముస్లిం విద్యార్థిని కొట్టిన ఘటనపై యూపీ సర్కార్ సీరియస్, తాత్కాలికంగా స్కూల్ బంద్